Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పండుగంటేనే పచ్చని తోరణాలు, రంగురంగుల పూలతో అలంకరించిన గుమ్మాలు.. రంగవల్లికలతో తీర్చిదిద్దిన ముంగిళ్లు.. ఇలా ప్రతి ఇల్లూ ఓ సరికొత్త కళను సంతరించుకుంటుంది. అలాంటిది కొత్త సంవత్సరాది ఉగాది అంటే ఇంటి అలంకరణలో మరింత శ్రద్ధ వహిస్తుంటాం. అప్పుడే పండగ శోభ రెట్టింపవుతుంది. ఈ సంతోషం ఏడాదంతా మనతోనే ఉంటుంది. మరి ఈ ఉగాదికి ఇంటిని ఎలా ముస్తాబు చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారా..?
- పండగైనా, శుభకార్యమైనా.. ఉదయాన్నే ఇంటి ముంగిట్లో ముచ్చటైన ముగ్గుల్ని తీర్చిదిద్దుకుంటాం. అలాగే ఉగాది రోజునా ఇంటి ముంగిట్లో రంగులు, పూలతో ముగ్గులు తీర్చిదిద్దితే ఇంటికి సగం పండగ కళ వచ్చేసినట్లే..! ఇక ముగ్గు త్వరగా వేయడానికి వీలుగా ప్రస్తుతం వివిధ డిజైన్లలో రూపొందించిన రంగోలీ స్టెన్సిల్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని ఉపయోగించండి.
- ఇక పండగ రోజున ఉదయాన్నే లేచి, తలస్నానం చేసి, కొత్త బట్టలు ధరించి.. ఇంటి గుమ్మాలకు పచ్చటి మామిడాకు తోరణాలు కట్టాలి. అలాగే గుమ్మం వద్ద అరటి చెట్టు కాండాలను కూడా నిలబెట్టచ్చు. తద్వారా ఈ పచ్చటి ఆకుల్లాగే మన జీవితం ఎప్పుడూ పచ్చగా, సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ధనధాన్యాలతో తులతూగుతుందని చాలామంది నమ్మకం. ఇక మామిడాకులతో పాటు పూల దండల్ని కూడా గుమ్మాలకు వేలాడదీయచ్చు. ఇక రాత్రి పూట పండగ శోభ ఉట్టిపడేలా ఫ్లోరసెంట్ లైట్లతో ఇంటి ముంగిలిని అలంకరించచ్చు.
- అలంకరణతో పాటు ఆహ్లాదం కోసం ఇప్పుడు చాలామంది ఇండోర్ ప్లాంట్స్ని పెంచుకోవడం సాధారణమయింది. అలాగే కొంతమంది బయట దొరికే ఫ్లవర్వాజుల్నీ ఇంట్లో అలంకరించుకుంటారు. అయితే ఈ పండగ సందర్భంగా వీటిలో ఉండే ప్లాస్టిక్ పూలను తొలగించి.. చామంతి, బంతి.. వంటి నిజమైన పూలను అమర్చుకోవచ్చు. అంతేకాదు.. బయట దొరికే బ్లష్ ఫ్లవర్స్నీ మధ్యమధ్యలో చేర్చుకుంటే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక ఇంటి ముంగిట ఏర్పాటు చేసే పాత్రలోనూ నీళ్లు మార్చి రంగురంగుల పూలతో అలంకరిస్తే ఇంటికొచ్చే అతిథులకు స్వాగతం పలికినట్లుగా ఉంటుంది.