Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాటల్లో ఆప్యాయత... చిరునవ్వులో సహృదయత... చూపుల్లో పసికట్టే తత్వం... కళ్ళలో కసి... చేతల్లో కృషి... నడకలో గమ్యం చేరగల పట్టుదల...లక్ష్యంలో సేవా దృక్పథం.. వెరసి విజయానికి సోపానం... ఆమే సాకేత పింగళి. 'స్మార్ట్ ఫార్మా 360' సంస్థాపకురాలు. మందుల షాపులో మందులు దొరుకుతాయని మనకు తెలుసు. కానీ దాని వెనక పెద్ద సైకిల్ చక్రమే నడుస్తుందని తెలియదు. మందులు తయారీ, పంపిణీ చేయటం, అకౌంట్స్, వాటి బిల్లింగ్, మనీ కలెక్షన్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, రోజువారి ఖర్చులు, ఏజెంట్స్‌ను మేనేజ్ చేయటం ఇలా చాలానే ఉంటాయి. ఈ మొత్తం ప్రక్రియని సప్లరు చైన్ అంటారు. దీనికి ఉపయోగపడే సాప్ట్ వేరే ఇది. అలాంటి సాఫ్ట్‌వేర్‌ను సృషించాలనే ఆలోచన ఆమెకు ఎలా వచ్చింది తెలుసుకుందాం..
పువ్వు పుట్టగానే పరిమళించినట్లు సాకేత 10వ తరగతి చదువుతున్నపుడు దీనికి బీజం పడింది. ఇందిరానోయి... పెప్సీ కంపెనీకి సీఈఓగా ఎంపికైనట్లు పేపర్లో వార్త చూశారు సాకేత తల్లి ఉమా పింగళి. దాన్ని కూతురికి చూపించి 'ఎప్పటికైనా నిన్నీస్థాయిలో చూసుకోవాలి' అన్నారు. అంతే అప్పుడు మొదలయింది ఈ ప్రహాసనం. దానికి తోడుగా అమ్మమ్మ హేమలత కూడా 'మనం పెద్ద పెద్ద కలలనే కనాలి. మన కోరికలు, లక్ష్యాలు, గమ్యాలు ఎప్పుడూ ఎత్తులోనే ఉండాలి' అంటూ ప్రోత్సహించటంతో ఇక ఆమె ఆలోచనలకు ఆనకట్ట వేయాల్సిన అవసరం లేకుండా పోయింది. రాకెట్లా దూసుకు వెళ్లటమే ధ్యేయంగా తనను తాను తీర్చిదిద్దుకోవటం మొదలుపెట్టారు. లక్ష్యాన్ని చేరాలని కసిని పెంచుకున్నారు. దానికి తోడుగా పట్టుదల, శ్రమను జత చేర్చారు. అవే కదా గెలుపుకి మెట్లు. విజయానికి బాటలు.
తండ్రే రోల్ మోడల్...
12 సంవత్సరాల కఠోర శిక్షణతో కూచిపూడి నాట్యాన్ని అభ్యసించారు. అంత సుదీర్ఘ ప్రయాణం అంటే మాటలు కాదు. అక్కడే సాకేతకు క్రమశిక్షణ అలవడింది. అదే మార్గంగా చేసుకొని జీవిత పయనం ప్రారంభించారు. ఈ ప్రయాణంలో మరో ముఖ్య పాత్ర ఈమె తండ్రి సతీష్‌ది. ప్రస్తుతం ఆయన రోడ్స్ అండ్ బిల్డింగ్స్‌లో ఓ అధినేతగా, చీఫ్ ఇంజనీర్‌గా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. ఎక్కడో కృష్ణాజిల్లాలోని ఓ పల్లెటూర్లో పుట్టి సరిగ్గా పాఠశాలకు కూడా వెళ్ళలేకపోయిన ఆయన చదవాలి, ఏదో సాధించాలనే పట్టుదలతో ఎం.టెక్ చేసి, గవర్నమెంట్ పరీక్షలు రాసి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు. ఇదంతా తన కండ్ల ముందే జరగటంతో వారిని తన రోల్ మోడల్‌గా తీసుకుంది సాకేత.
ధ్యాసంతా వ్యాపారం మీదే
స్కూల్లో జరిగే ప్రతి కాంపిటేషన్‌లో పాల్గొని బహుమతులు సాధించేవారు సాకేత. ఇంటర్ తర్వాత 17 ఏండ్ల వయసులో ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్‌లో సీటు సంపాదించు కున్నారు. కానీ ఆమె ధ్యాసంతా వ్యాపారం మీదే. అలాగే బి.టెక్ పూర్తి చేశారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఎంటిలో ఎంబీఏ కూడా సాధించారు. తర్వాత అరుణాచల్ ప్రదేశ్‌లోని ఓ కంపెనీలో చేరారు. హిమాలయాల నుంచి మంచు కరిగి నదిలా ప్రవహించే నీటి నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే కంపెని అది. దీన్ని ''హైడ్రో పవర్'' అంటారు. ఆ ప్రాజెక్టు ఆపరేషన్ అమలు చేయడంలో ఈమె కీలక పాత్ర పోషించారు. అలా నాలుగు సంవత్సరాల అక్కడ అనుభవాన్ని సంపాదించారు. అయితే వ్యాపారం చేయాలనేది ఆమె కల. దాన్ని నిజం చేసుకోవడానికి తన ప్రయత్నాన్ని ప్రారంభించారు. తాను ఎంబీఏ చేసిన కాలేజీలోనే కాఫీ షాప్ తెరవాలని నిశ్చయించుకున్నారు. అనుకున్నదే ఆలస్యం అన్నీ చేసేసే అలవాటు ఉండటం వల్ల రంగ ప్రవేశం జరిగిపోయింది.
ఉద్యోగం చేసిన అనుభవంతో...
ప్రారంభించి క్యాంటీన్ విజయవంతం కావడంతో అదే ఉత్సాహంతో నల్లజర్ల లా యూనివర్సిటీలో కూడా మరొకటి ప్రారంభించారు. ఇక్కడ తనకు అవసరమైన టీంని ఏర్పాటు చేసుకోవడంతో ఆమెకు కాస్త సమయం చిక్కేది. ఆ సమయంలో తన ఆలోచనలన్నీ బిజినెస్ చుట్టూనే తిరుగుతుండేవి. అరుణాచల్ ప్రదేశ్‌లో పనిచేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్‌తో అన్ని విషయాల్లో పాలుపంచుకోవటం, ఒక వస్తువుని తయారు చేయడం దగ్గర నుంచి కస్టమర్ దగ్గరికి చేర్చడం వరకు ఎన్ని చేతులు మారాలి అన్నది ప్రత్యక్షంగా చూడటంతో దాని గురించి బాగా ఆకళింపు చేసుకున్నారు. ఆ అనుభవం తోనే ఫార్మా కంపెనీ ప్రారంభించాలను కున్నారు. వెంటనే కొందరు క్లైంట్స్‌ని, మెడికల్ స్టోర్స్‌ని, డిస్ట్రిబ్యూటర్స్‌ని కలిసి వారి పనిని దగ్గరగా పరిశీ లించారు. ఆ ఫీల్డ్ ఆమెకు బాగా నచ్చి ఫార్మా కంపెనీ ప్రారంభించాలనుకున్నారు. ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు సేవా దృక్పథం కూడా! హెల్త్ కేర్ అవకాశం అందరికీ రాదు. కొందరికి మాత్రమే దక్కే అవకాశం. అందుకే ఈ అవకాశాన్ని వదులుకోకూడదనుకున్నారు.
ఏ చిన్న సమస్య వచ్చినా...
ఒక పిజ్జా కావాలంటే ఎక్కడ దొరుకుతుందో మనందరికీ తెలుసు. కానీ అదే ఒక మాత్ర ఎక్కడ దొరుకు తుంది అన్నది మాత్రం తెలియదు. కోవిడ్ అప్పుడు ఈ సమ స్యను అనుభవించాం. అందుకే ఈ కంపెనీ ద్వారా తన సేవల్ని, పూర్తి సమాచారాన్ని అందరికీ అందించాలని అనుకున్నారు. ఇది ఎస్ఎంబీ (స్మాల్ అండ్ మీడియం బిజినెస్) ద్వారా నడుస్తుంది. ఇక నమ్మకం అనే విషయానికి వస్తే ఇది చాలా కష్టమైన వాస్తవం. వీరి సాఫ్ట్వేర్ వాళ్లు తీసుకోవటం అంటే వాళ్ల బిజి నెస్‌ను అంతా వీరి భుజాల మీద పెట్టుకున్నట్లే. ఏ చిన్న సమస్య వచ్చినా గంటలు గంటలు వాళ్ళ పని ఆగిపోతుంది. అలా ఓ గంట సాఫ్ట్వేర్ పనిచేయకపోయినా కంపెనీ నడవదు. బిజినెస్ జరగదు. ఎందుకంటే ఓ మెడికల్ షాప్‌లో బిల్లింగ్ ఓ పది నిమి షాలు ఆగిపోయినా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవల్సి వస్తుంది. అలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తుంది వీరి సాఫ్ట్వేర్.
అంచనాలు సరిగ్గా ఉండాలి
టీంని ఎంపిక చేసుకోవడంలో కూడా చాలా పరిశీలన ఉండాలి అంటారు. అంటే వాళ్ళు మాట్లాడే మాటను బట్టి నిజాయితీపరులా కాదా అన్న విషయాన్ని, అసలు వారి ఇంటె న్షన్ ఏమిటి ఇంతకుముందు ఉన్న అనుభవం నిజమైనదేనా అని సరిగ్గా అంచనా వేయగలగాలి. అది గనక సరిగ్గా కనిపెట్ట లేకపోతే కంపెనీ రాంగ్ ట్రాక్‌లోకి వెళ్ళిపోతుంది. ఫౌండర్‌గా ఆ సామర్థ్యం ఆమెకు తప్పక ఉండాలి. అప్పుడే విజయం వైపు నడవగలుగుతారు. ప్రతి ఫార్మసీలో మా సాప్ట్ వేర్ ఉండాలనేది మా ప్రయత్నం అనేది ఆమె తన ట్యాగ్‌గా ఎంచుకున్నారు. ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి రెండున్నర సంవత్సరాల సమయాన్ని తీసుకున్నారు. గత ఆరు నెలల నుంచే కస్టమర్స్‌తో సేల్స్‌లోకి వెళ్ళటం ప్రారంభించారు. అంటే అతి కొద్ది సమయంలోనే మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
నమ్మకం చాలా అవసరం
గుర్తింపు అంత సులభంగా రాదంటారు సాకేత. కస్టమర్‌ని నమ్మించటం చాలా కష్టం. మనం ఏం చేస్తామన్నది ముందు వాళ్లకి అర్థం కావాలి. తర్వాత చిన్న కంపెని, కొత్త కంపెనీని తాము చేరాలనుకొనే ఆ ఆలోచన రప్పించటం కూడా కష్టమే. ఆర్థిక ఇబ్బందులు వచ్చినపుడు మరింత కష్టం. అలాంటి సమయంలోనే ఆమె మరొక ఇద్దరిని తన భాగస్వాములుగా ఎంపిక చేసుకున్నారు. అందులో ఒకరు సూర్య. ఈయనకు ఫార్మా ఇండిస్టీలో పాతిక సంవత్సరాలు అనుభవం ఉంది. వీరు కూడా ఎంబీఏ చేశారు. మరొకరు భరత్. వీరు కూడా ఇంజినీరే. వీరిని తన జీవిత భాగస్వామిగా కూడా ఎంచుకున్నారు. అలా ఆమె కంపెనీ త్రిమూర్తులైన ఈ ముగ్గురి చేతుల్లో భద్రంగా ఎదుగుతోంది. 2018లో భరత్‌తో సాకేతకు వివాహమైంది.
వి హబ్ అవసరాలతో...
భవిష్యత్తుపై ఆమెకు ఇంకా ఎన్నో కోరికలు ఉన్నాయి. సాధించాలనుకుంటున్న లిస్టూ పెద్దదే. ఆఫ్రికా, యూరప్, దుబారు, మలేషియా, సింగపూర్‌కి కూడా వారు చేరాలను కుంటున్నారు. ఇప్పటికే దుబారుకి వెళ్ళబోతున్నారు. ''కొత్తగా వ్యాపారంలోకి రావాలనుకున్నా, ఏదైనా చేయాలంటే మొండి ధైర్యం ఉండాలి. లేకుంటే దిగకూడదు. ముఖ్యంగా భయం ఉన్న వాళ్లు అసలే వ్యాపారంలోకి ప్రవేశించకూడదరు. తెలివితేటలు, స్కిల్స్ విషయంలో ఎప్పుడూ అప్ టు డేట్‌గా ఉండాలి'' అంటారు ఆమె. వి హబ్ తనకు చేసి సహకారం గురించి మాట్లాడుతూ... ఏడాదికి ఒకసారి ఇంకుబేషన్ కోవర్ట్కి అప్లై చేసుకోమని వచ్చినప్పుడు వారు అప్లై చేసి సెలక్ట్ అయి ఫస్ట్ కోవర్టులో చేరారు. రెండో ఏడాది కూడా అలాగే ప్రవేశించారు. అందులో ఉండటం వల్ల పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు సులభంగా జరుగుతాయి. ఏ సమస్య వచ్చినా వాళ్లు వీరికి ఆసరాగా నిలబడతారు.
టీం వర్క్‌తోనే సాధ్యం...
''పనిలో మేము చూపించే నిజాయితీ, శ్రద్ధ, టీమ్ చూపే అంకితభావంతో మా దగ్గరకు వచ్చే క్లయింట్ల సంఖ్య పెరుగుతుంది. మా టీంలో మొత్తం 21 మంది ఉంటారు. అందరూ ఏదో ఉద్యోగానికి వచ్చామా వెళ్ళామా అన్నట్లు కాకుండా ఏ వేళలో అయినా ఇది మా సంస్థ అనే భావనతో పని చేయటంవలనే మా కస్టమర్స్ సంఖ్య ఇంత పెరిగింది. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా పని ఉంటే వచ్చేస్తారు. అంతే కాదు చేసే పనిలో అత్యంత శ్రద్ధను చూపుతున్నారు'' అని వివరించారు సాకేత.
సమాజం సృష్టించిన భయమే
''మగవాళ్లకు ఆడ వాళ్లు ఏం తీసిపోరు. అన్ని రంగాల్లోనూ విజృంభిస్తున్నారు. ఇది మదిలో గట్టిగా ముద్రించుకుపోవడంతో ఈ విషయంలో వెనకంజ వేసే ఆలోచన కూడా రాలేదు. అసలు స్త్రీలు చేయలేనిది ఏదీ లేదు. సామర్థ్యంలోనూ, తెలివిలోనూ ఎందులోనూ మనం తక్కువ కాదు. నిజంగా చెప్పాలంటే చాలా ఎక్కువే. కేవలం సమాజంలో అమ్మాయిల్లో సృష్టించిన భయం వల్లనే చాలా మంది ముందుకు రావడానికి భయపడుతున్నారు. అంతే! నాకైతే నేనెప్పుడూ అమ్మాయిని కదా చెయ్యొచ్చా అన్న ఆలోచనే అసలు రాదు. అలా చేసుకుంటూ వెళ్ళిపోవటమే'' అంటారు సాకేత. అది ఆమె ఆత్మవిశ్వాసానికి గీటురాయి.
- యలమర్తి అనూరాధ, 9247260206