Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగం రాలేదని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని, అప్పుల బాధతో, తల్లిదండ్రులు మందలించారని ఇలా అనేక చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న యువతకు ఈ అమ్మ ఆదర్శం... తన కుటుంబంలో ఒక్కరు తప్ప మిగిలన వారందరూ వివిధ కారణాలతో మరణించారు. తాను కన్న పిల్లలు ఒక్కొక్కరుగా కంటి ముందే మరణిస్తుంటే భరించలేక పోయింది. కడుపు కోతను భరిస్తూ గుండె దిటవు చేసుకుంది. అక్షర జ్ఞానం కూడా లేని ఆమె తనకు ఎవరూ లేరని పిరికిదానిలా ఆత్మహత్య చేసుకోలేదు. ధైర్యంగా విధితో పోరాడుతోంది... ఈమె పేరు మాలోతు రాణి.
రాణి వయసు ప్రస్తుతం 65. అడ్డబట్ట తండా (అమీనా బాద్), గ్రామం మండలం, చిన్నారావు పేట, వరంగల్ జిల్లాకు చెందిన ఆమెకు 14 ఏండ్లకే రాజు అనే వ్యక్తితో పెండ్లి జరిగింది. నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు. కానీ భర్త, నలుగురు కొడుకులు, ఒక బిడ్డ వివిధ కారణాలతో మరణించారు. అయినా ఆ బాధని భరిస్తూ ధైర్యంతో రోజంతా కష్టపడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది. నలుగురు కొడుకుల్లో మొదటి కొడుకు ఏడాది వయసులోనే పసకలతో చనిపోయాడు. రెండవ కొడుకు 14 ఏండ్ల వయసులో గుండెజబ్బుతో మరణించాడు. మూడవ కొడుకు పెండ్లయిన తర్వాత 25 ఏండ్ల వయసులో లివర్ పాడవడంతో చనిపోయాడు. ఇక నాలుగవ కొడుకు పెండ్లి అయిన తర్వాత అత్త మామలు తిట్టడంతో విషం తాగి చనిపోయాడు.
మనువరాలి కోసం...
మూడో కొడుకు కూతురూ, తన మనమరాలికి ఆరోగ్యం బాలేక పోవడంతో తనకున్న రెండు ఎకరాల్లో ఎకరం అమ్మి ఆమెకు చికిత్స చేయించింది. ఇక ఆమె పెండ్లి ఉన్న ఎకరం అమ్మి పెండ్లి చేసింది. నలుగురు కొడుకులు చనిపోయిన తర్వాత భర్త కూడా అనారోగ్యంతో కన్నుమూశాడు. ఇక ఇద్దరు కూతుర్లలో పెద్ద కూతురు పెండ్లయిన తర్వాత భర్త తిట్టడంతో ఉరివేసుకొని మరణించింది. పెద్ద అల్లుడు కూడా చనిపోయాడు. చిన్న అల్లుడు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఉన్న ఒక్కగానొక్క కూతురు ఒంటరిగా జీవితం వెల్లదిస్తుంది.
డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తే...
65 ఏండ్ల వయసులోను ఇప్పటికీ ఆమె ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఆర్ట్స్ కాలేజ్ ముందు, 11 నుండి 3 గంటల వరకు హనుమకొండ అదాలత్ కోర్టు ముందు, తిరిగి నాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పబ్లిక్ గార్డెన్ ముందు సాక్స్‌లు, కర్చీఫ్‌లు అమ్ముకుంటూ బతుకుతుంది. అంటే దాదాపు రోజంతా కష్టపడుతూ ఉంటుంది. ఇలా అమ్మగా వచ్చిన డబ్బు మీకు సరిపోతుందా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పెన్షన్ తనకు 2000, తన కూతురికి 2000 వస్తున్నాయని వాటితో పాటు ఇలా అమ్ముకుంటూ జీవితం వెల్లదీస్తున్నానని కన్నీళ్లు పెట్టుకుంది. ఉండడానికి సొంత ఇల్లు కూడా లేని తల్లీ, బిడ్డలు చిన్న రేకుల షెడ్డులో కిరాయికి ఉంటున్నారు. ప్రభుత్వం సహకరించి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తే బాగుంటుందని ఆమె ఆశ. లేదా ఎవరైనా దాతలు తనను ఆదుకోవాలని చేతులు జోడించి వేడుకుంటుంది.
- రాజు, హన్మకొండ రిపోర్టర్, నవతెలంగాణ