Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మధురమైన స్వరం ఉంటే సరిపోదు... దానికి ఓ గుర్తింపు కావాలి. తమ స్వరానికి గుర్తింపు రావాలని ఎవరు మాత్రం కోరుకోరు. అలాంటి వారి కోసం నేడు ఎన్నో టీవీ షోలు సిద్ధంగా ఉన్నాయి. కానీ అవకాశాలు ఊరికే ఎవరికీ రావు. దానికి కఠోర సాధన కావాలి. పైగా ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే కష్టపడక తప్పదు. అలా రాత్రీ పగలు సాధన చేసింది. ఇప్పుడు ఆహా తెలుగు ఇండియన్ ఐడియల్ సీజన్ 2లో ఎంపికై దుమ్మురేపుతుంది. ఆమే మన సిద్దిపేట బిడ్డ లాస్య ప్రియ. ఆమెతో మానవి ప్రత్యేక ఇంటర్వ్యూ...
మీ కుటుంబం గురించి చెప్పండి?
నేను పుట్టింది నల్గొండ. అమ్మ చంద్రిక, మా నాన్న వేణుమాధవ శర్మ. ఆయన గవర్నమెంట్ టీచర్. నాన్నకు బదిలీలు ఎక్కువగా ఉండేవి. దాంతో ఆయనకు ఎక్కడకి బదిలీ అయితే మేమూ వెళుతుండేవాళ్ళం. అలా చాలా ప్రాంతాలు తిరిగాం. నేను హైస్కూల్‌కి వచ్చే సరికి మా తాతయ్యకు ఆరోగ్యం బాగోకపోవడంతో సిద్ధిపేటలో ఉండిపోయాము.
సంగీత ప్రపంచంలోకి ఎలా వచ్చారు..?
చిన్నప్పటి నుండి టీవీలో పాటలు వింటూ నాలో నేనే పాడుకుంటూ వుండేదాన్ని. బాగా పాడుతున్నానని మా అమ్మ సంగీతం క్లాసుల్లో చేర్పించింది. అలా చేరిన తర్వాత సంగీతం పట్ల ప్రేమ మరింత పెరిగింది. అయితే మేము ఎక్కడ ఉన్నా సంగీతం క్లాసులకు మాత్రం అమ్మ కచ్చితంగా పంపించేది. స్కూల్లో కూడా ప్రతి ప్రోగ్రామ్‌లో నా పాట కచ్చితంగా ఉండేది.
అంతకు ముందు ఏవైనా టీవీ షోల్లో పాల్గొన్నారా?
నాకు 13 ఏండ్లు ఉన్నప్పుడు బోల్ బేబీ బోల్ అనే ప్రోగ్రామ్‌లో రెండు సీజన్స్‌లో పాల్గొన్నాను. మా మ్యూజిక్ క్లాసుల ద్వారా అక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయని తీసుకెళ్ళారు. ఆడిషన్స్‌లో సెలక్ట్ అయ్యాను. చాలా మందికి మొదటి సారి టీవీలో అనే సారికి భయం ఉంటుంది. కానీ నేనెందుకో ఎలాంటి భయం లేకుండా పాడాను. పైగా అక్కడ బాగా ఎంజారు చేశాను. స్కూల్‌కి వెళ్ళే పనిలేదు. చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. సరదాగా గడిచిపోయింది. 2014లో సీజన్ 3లో పాల్గొన్నాను. తర్వాత 2016లో సీజన్ 6లో పాల్గొన్నాను. అక్కడకు వెళ్ళిన తర్వాతనే చాలా నేర్చుకున్నాను. మెంటర్స్ కూడా చాలా సపోర్ట్ చేసేవారు. షో కంటే ముందు షో తర్వాత నేను పాడే పాటల్లో చాలా మార్పు వచ్చింది. అసలు పాట ఎలా పాడాలో అక్కడే నేర్చుకున్నాను. సీజన్ 3లో సెమీ ఫైనల్స్ వరకు వెళ్ళాను. సీజన్ 6లో రన్నర్‌గా ఉన్నాను.
బోల్ బేబీ బోల్ తర్వాత అవకాశాలు ఏవైనా వచ్చాయా?
చాలా షోస్ చేసే అవకాశం వచ్చింది. నాకు మొదటి నుండి నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. ఇంట్లోనే ఉండి చాలా ప్రాక్టీస్ చేసేదాన్ని. శ్రీనిహాల్ వద్ద సంగీతంలో శిక్షణ తీసుకున్నాను. అక్కడ మా బ్యాచ్ ఒకటి ఉంటుంది. అక్కడకు వెళితే చాలా హ్యాపీగా, మనసుకు చాలా ఉంటుంది. హైదరాబాద్‌లో ఈ మధ్యనే అనాహట పేరుతో ఓ బ్యాండ్ ప్రారంభించాం. ఇంట్లో ప్రాక్టీస్ చేయడానికి స్టేజ్‌పై పాడటానికి చాలా తేడా ఉంటుంది. బ్యాండ్‌లోకి వెళ్ళిన తర్వాత స్టేజ్‌పై లైవ్ పాడటం నేర్చుకున్నాను. తెలుగు ఇండియన్ ఐడియల్కి ఎంపికైన తర్వాత బ్యాండ్‌కి బ్రేక్ తీసుకున్నాను.
తెలుగు ఇండియన్ ఐడిల్ షోలో అవకాశం ఎలా వచ్చింది?
మా ఫ్రెండ్స్ చాలా మంది ఏదైనా షోలో పాల్గొనొచ్చు కదా ఎప్పుడూ అంటుండేవారు. అయితే అప్పట్లో వచ్చే షోలేవి నాకు పెద్దగా నచ్చలేదు. ఆహాలో వస్తున్న సీజన్ 1 చూశాను. చాలా బాగా నచ్చింది, చాలా నేర్చుకున్నాను. పాడుతున్న పాటలు కానీ, విధానం కానీ బాగా నచ్చింది. మనం డెవలెప్ అవ్వడానికి, నేర్చుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయని అనిపించింది. అందుకే సీజన్ 2 ఆడిషన్స్‌కు నా వీడియో సాంగ్ పంపించాను. ఎలాగైనా 2లో సెలక్ట్ కావాలని ప్రాక్టీస్ చేశాను. కానీ ఈ ఆడిషన్స్‌లో పది వేల మంది మంది పాల్గొన్నారు. నాకు అవకాశం వస్తుందా లేదా అనే డౌట్. కానీ నా ప్రయత్నం నేను చేద్దామనకున్నాను. ఆ పది వేల ముంది నుండి థియేటర్ రౌండ్‌కి 50 మందిని ఎంపిక చేశారు. అసలు థియేటర్ రౌండ్ వరకు వెళతానని అస్సలు ఊహించలేదు. అందులో సెలక్ట్ కావడమే చాలా గొప్ప అనుకున్నాను. ఇక ఆ యాభై మందిలో కూడా 12 మందిని ఎంపిక చేశారు. ఆ పన్నెండు మందిలో నేనూ ఉన్నాను. పైగా సిద్దిపేట నుండి నేనొక్కదాన్నే.
ఆడిషన్స్‌లో ఇప్పటి వరకు మీకు బాగా నచ్చిన పాట?
మొదటిసారి ఆడిషన్స్‌కు ఓ వీడియో సాంగ్ పంపించాను. అది ''మనసా వాచా''. ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట.
షో లో పాల్గొన్న తర్వాత బాలకృష్ణతో, జడ్జీలతో మీ అనుభవం?
చాలా సంతోషంగా ఉంది. షోలో అందరూ నన్ను సిద్దిపేట అని పిలుస్తుంటారు. కొన్ని రోజులకు నా పేరు కూడా మర్చిపోతారేమో అనిపిస్తుంది. అందరం మంచి ఫ్రెండ్స్ అయ్యాము. ఒకరి నుండి ఒకరం నేర్చుకుంటూనే ఉంటాం. ఇక బాలయ్యను మొదటి సారి చూడగానే భయం వేసింది. కానీ ఒక్క సారి మాట్లాడిన తర్వాత చాలా ఫ్రీ అయ్యాను. ఆయన కూడా మాతో కలిసిపోయారు. జడ్జిలుగా ఉన్న తమన్, కార్తికేయ, గీతామాధురి కూడా చాలా ఫ్రీగా ఉంటారు.
భవిష్యత్‌లో సంగీతాన్ని కెరీర్‌గా మలుచుకోవాలనుకుంటున్నారా?
ప్రస్తుతం నేను ఫ్రెషర్స్‌లో జాబ్ చేస్తున్నాను. అయితే సంగీతాన్ని మాత్రం వదిలి పెట్టాను. మంచి సంగీతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఒక మంచి పోయమ్ చదివితే ఒకలా ఉంటుంది. అదే పాడితే మరోలా వుంటుంది. నా గొంతు ఆ స్టోరీకి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలి. అలాంటి పాటలు పాడాలనేది నా కోరిక.
మీ ఇంట్లో సపోర్ట్ ఎలా వుంది?
ఇంట్లో వాళ్ళకు నాపై చాలా నమ్మకం. నేనేం చేసిన ఆలోచించి చేస్తాను అని వాళ్ళ నమ్మకం. వాళ్ళు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తాను. ఏమన్నా సమస్య వచ్చినా చూసుకోవడానికి మా అన్నయ్య ఉన్నాడు. అది కూడా నాకో ధైర్యం. అందుకే నాకు భయం లేదు.
సంగీతంతో మీ అనుబంధం?
ఒక్క గంట కూడా పాడకుండా ఉండలేను. పాడకపోయినా మెదడులో ఏదో ఒక సంగీతం తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇక్కడ మేం 12 మంది ఉన్నాము. ఎప్పుడూ సంగీతం గురించే చర్చ. ఎప్పుడూ సంగీత ప్రపంచంలోనే ఉంటున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది.
సినిమాల్లో ఏమైనా పాడారా..?
కొన్ని సినిమాల్లో ట్రాక్స్ మాత్రమే పాడాను. అవి ఇంకా రిలీజ్ కూడా కాలేదు. రికార్డింగ్ స్టూడియోలో అలవాటవుతుందనే ఉద్దేశంతో వాటిని పాడాను.
జాబ్ చేస్తున్నారు, ఈ షో వల్ల అక్కడ ఇబ్బంది ఏమీ లేదా?
వాస్తవానికైతే ఉండాలి. జాబ్‌లో చేరి ఆరు నెలలే అవుతుంది. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి నిజానికి ఎవరూ పర్మిషన్లు ఇవ్వరు. కానీ మా మేనేజ్‌మెంజ్ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. వారంలో రెండు రోజులు సెలవు ఇచ్చి షోలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. వాళ్ళకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాను.
- సలీమ