Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గృహిణిగా ఇంటిపని, వంట, పిల్లలను స్కూల్‌కు పంపడం వంటివాటితో రోజు ఎలా గడుస్తుందో తెలియదు. అయితే అవే పనులను కొందరు సంపూర్ణంగా పూర్తిచేయగలిగి, మిగతా సమయాన్ని తమకు నచ్చినట్లుగా వినియోగించుకుంటారు. అలాగే మరికొందరికి చేయాల్సిన పనే.. మిగిలిపోతుంటుంది. వీటన్నింటికీ సమయపాలన పాటించాలని గట్టిగా అనుకోవాలి. ఫలానా టైంలోనే పూర్తిచేయాలని ప్రణాళిక వేసుకొని అమలు చేయడానికి ప్రయత్నించాలి. దీనికి తేలికైన పద్ధతులను కనిపెట్టి అవలంబించాలి.
- పని మొత్తం మీరొక్కరే చేయకుండా, అవసరమైతే ఇంట్లో మరొకరి సాయాన్ని తీసుకొని పూర్తిచేయగలగాలి. ఇదొక అభ్యాసంగా మారి క్రమేపీ అనుకున్న సమయంలోనే పనులన్నీ పూర్తవుతాయి. మిగిలిన సమయాన్ని వ్యక్తిగత అభిరుచులు లేదా మనసుకు నచ్చిన కెరియర్‌కు వినియోగించొచ్చు.
- ఉద్యోగం చేసే వారికి ఇల్లు, ఆఫీస్ పని మాత్రమే బాధ్యత కాదు. ఆరోగ్యానికి కూడా సమయాన్ని కేటాయించుకోవాలి. లక్ష్యాలను చేరుకోవాలన్నా.. ఉద్యోగం, ఇంటి పనులు అనుకున్నట్లుగా పూర్తిచేయాలన్నా.. శారీరక సామర్థ్యం తోడైతేనే వీలవుతుంది. ఉదయం లేదా సాయంత్రం అరగంట వ్యాయామాలకు కేటాయించాలి. రోజంతా పని చేయడంతో శరీరం అలసిపోయింది లేదా అదే పెద్ద వ్యాయామం అనుకుంటే పొరపాటే. మొత్తం రోజులో ఎక్కడ సమయం వృథా అవుతుందో గుర్తించి దాన్ని మిగిల్చే ప్రయత్నం చేయాలి. వ్యాయామాల కోసం దాన్ని వినియోగిస్తే కండరాలు బలోపేతమవుతాయి. ఆరోగ్యం సొంతమై, అది లక్ష్యాలను సాధించడానికి తోడ్పడుతుంది.
- ఆ రోజు హాజరుకావాల్సిన సమావేశాల వివరాలను ముందురోజే సేకరించాలి. వాటికి సంబంధించిన సమాచారాన్ని, పూర్తి చేయాల్సిన బాధ్యతలను డైరీలో ముందుగానే పొందుపరుచుకోవాలి. ప్రాజెక్ట్ గురించి సహోద్యోగులకు సమాచారాన్ని అందించాల్సి వస్తే ముందురోజే పూర్తిచేయాలి. ఆఫీస్‌కెళ్లిన తర్వాత చేయాల్సిన పని గురించి ఆలోచించకుండా, వెళ్లేటప్పుడే ఎక్కడి నుంచి పని ప్రారంభించాలో ప్రణాళిక వేసుకోవాలి. ఏ పనికి ఎంత సమయం పడుతుందో అవగాహన ఉంటే చాలు. సక్రమంగా చేస్తే, పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.