Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పచ్చని చెట్లు కార్బన్ డయాక్సైడును పీల్చుకుని ఆక్సిజన్‌ను ఇచ్చే ప్రాణదాతలని చెప్పుకుంటాం కదా! చెట్లకు ఆకులు, పూలు, కొమ్మలు, రెమ్మలు, వేర్లు విత్తనాలు, కాయలు, పండ్లు వంటివన్నీ ఉంటాయి కదా! ఇలా చెట్ల భాగాలతో, ఎండు పుల్లలతోనూ ఎన్నో బొమ్మలు చేసుకోవచ్చు. పచ్చని ఆకులతో ఎలా చేసుకుంటామో ఎండు వాటితో కూడా అలాగే చేసుకోవచ్చు. కాఫీ ఆకులు, గింజలు, అవకాడో కాయ, అగ్ని పూలు, సంపెంగ ఆకులు, మిరియాల ఆకుల వంటి అనేక అరుదైన చెట్ల భాగాలతో ఎన్నో బొమ్మలు చేశాను. 690 బొమ్మలు, అలంకారాలు పూర్తయ్యాక తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం అప్లై చేశాను. వాళ్ళు రికార్డు ఇచ్చే టైముకు 750 చిత్రాలు దాటాయి. లవంగాలు, యాలకులు, రెడ్ బెర్రీస్, బ్లూ బెరీస్ర్ వంటి మసాల దినుసులు డ్రై ఫ్రూట్స్‌తో కూడా చిత్రాలు అలంకారాలు చేశాను. ఎండిన చెట్ల వేర్లు, బెరడు, పూ మొగ్గలు, శంకులు వంటివన్నీ ఉపయోగించారు. ఈ రోజు చెట్లు భాగాలతో చేసిన చిత్రాలను గమనిద్దాం. ప్రయత్నిద్దాం.
పెద్ద వృక్షాలకు బెరడు ఉంటుంది. ఆ బెరడుతో కూడా అలంకారాలు చేయవచ్చు. రోడ్డు పక్కన ఉన్న చెట్లను కొట్టేస్తు న్నారు. అందులో ఒకతను నా బొమ్మల్ని చూసి ఉండటంతో చెట్టు బెరడును తీసి ఇచ్చాడు. 'ఏమైనా బొమ్మ చేసుకుంటారా' అని చాలా మంది ఇలాంటి వస్తువులు తెచ్చివ్వడం పరిపాటే. అందుకే ఆశ్చర్యపడకుండా ఏం బొమ్మ చేస్తే బాగుంటుందా అని ఆలోచించాను. వెడల్పుగా ఉన్న బెరడును నిలువుగా రెండు ముక్కలు చేశాను. ఒక వెడల్పాటి పాత్రను తీసుకుని దానిలో ఈ రెండు నిలువుగా ఉన్న బెరడులను నిలబెట్టాను. నిలబెడితే మామూలుగా పడిపోతాయి కదా! అందుకే అడ్డంగా ఒక పుల్లను పెడితే రెండు బెరడ్లు నిలబడతాయి. ఇప్పుడు రెండు రాళ్ళు తీసుకొని మధ్యలో పెడితే ఏదో రాళ్ళ గుట్టలాగా కనిపిస్తుంది. చిన్న చిన్న గడ్డి మొక్కలు, చిన్న పూల కొమ్మల్ని అతికిస్తే అందంగా కనువిందు చేస్తుంది. ఇలాంటి అలంకరణలు నాలుగైదు రోజులు ఉంచుకోవచ్చు. అప్పుడు కొమ్మలు తీసేస్తే బెరడ్లతో వేరే అలంకరణ చేయవచ్చు.
కాయలున్న చెట్టు
ఎండిపోయిన చెట్లతో కూడా అలంకరారం చేయవచ్చు. కాక పోతే కాస్త వెరైటీగా చేద్దాం. కుండీల్లో ఎండిపోయిన మొక్కల్ని పీకి పక్కనుం చుకోవాలి. బాగా ఎండలో ఎండబెట్టాలి. వాటికి నల్ల రంగును వేసుకోవాలి. రంగు వేశాక మళ్ళీ ఎండ బెట్టాలి. ఇప్పుడు దానికి కాయలు కాసినట్టుగా పెట్టాలి. దాని కోసం బెలూన్లు తెచ్చుకోవాలి. బెలూన్ను సగానికి కత్తి రించి దానిలో దూదిని పెట్టాలి. బెలూన్ లావుగా అవుతుంది. దాని చివర గట్టిగా లాగి ముడేయాలి. ఈ బెలూన్‌కు మధ్యలో దారంతో కుట్టేయాలి. అప్పుడు యాపిల్ లాగా కనిపిస్తుంది. దీనికి మూడు ఆకులు పెట్టాలి. ఆకుల కోసం క్రేడ్ పేపర్‌ను వాడుకోవాలి. ఆకుపచ్చ క్రేడ్ పేపర్‌ను కత్తిరించి ఆకుల్లాగా చేసుకుని యాపిల్‌కు అడుగున పెట్టాలి. మళ్ళీ ఒక కుట్టు వేయాలి. దీనిలో ఇంతకు ముందు నల్లరంగు వేసుకున్న ఎండు చెట్టును పెట్టాలి. ఆ చెట్టుకు అక్కడక్కడా ఈ యాపిల్ కాయల్ని అతికించాలి. కాయలున్న చెట్టులాగా కనిపించి అందంగా ఉంటుంది. ముళ్ళ చెట్లకు కూడా రంగులు వేసి పువ్వులు అతికించవచ్చు. జపాన్ ముళ్ళున్న కొమ్మకు నలుపు రంగువేసి దానికి పూసలు గుచ్చాలి. ఇలా ఏదో ఒకటి చేసి అందంగా అలంకరించవచ్చు. ముళ్ళ కొమ్మతో బొమ్మలు చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి.
కోడి బొమ్మను చేద్దాం
రోడ్డు పక్కన ఎన్నో చెట్లు కనిపిస్తాయి. నేను కారులో ప్రయాణం చేస్తు న్నపుడు రోడ్డు పక్కనున్న చెట్లను గమనిస్తూ ఉంటాను. ఈ చెట్లు ఎండిపోయి గుబురుగా కనిపించాయి. వీటి పేరేమిటో నాకు తెలియదు. బాగా ఎండి కుచ్చు కుచ్చుగా ఉంది. బొమ్మకు పనికొస్తాయని తెచ్చుకున్నాను. కోడి బొమ్మను గీసుకొని దాని లోపల ఈ ఎండిన ఆకుల్ని అతకించాను. దీనికో కన్ను పెట్టాను. ఎర్రరంగు కాగితాన్ని కత్తిరించి ముక్కు, నెత్తి మీద తురాయిని పెట్టాలి. ఈ కోడికి పిల్లలున్నాయి. పిల్లల్ని చూపించడానికి పల్లీ తొక్కల్ని వాడుకోవాలి. మూడు, నాలుగు పల్లీ తొక్కల్ని అతికించాలి. దానికి కాళ్ళు, కన్ను, ముక్కు పెట్టాలి. తర్వాత వాటి నోట్లో కాయలున్నట్లుగా స్కెచ్‌తో గీయాలి. ఇలా కోడినీ, దాని పిల్లల్నీ తయారు చేయాలి.
పూల కుండీలు
ఎండి పోయిన కొబ్బరి కాయలు, చెట్టు మీద ఎండి పోయి కింద రాలిపోతుంటాయి. అలాంటి ఎండు కొబ్బరి కాయలతో పూల కుండీ చేయవచ్చు. ఎండిన కొబ్బరి కాయను మధ్యకు రంపంతో కొయ్యాలి. దాంట్లో ఉన్న పీచు భాగాన్ని అలాగే ఉంచి విడ దీయాలి. కాయను విడిగా తీయాలి. చిప్పను పక్కనంచి దాని మీద పురికొసను చుట్టి అతికించాలి. పీచు భాగాన్ని సగానికి కత్తిరించినపుడు పడవ ఆకారంలో ఉంటుంది. దీని లోపల మట్టి పోసి దానిలో చెట్లు పెట్టుకోవచ్చు. ఈ మట్టి పోసిన కొబ్బరి పీచు కాయను కొబ్బరి చిప్ప మీద పెట్టి అతికించాలి. ఎండిన చెట్ల కాయలతో ఇలాంటి బొమ్మలు చేసుకోవచ్చు.
గుడ్ల గూబను చేద్దాం
సీతాఫలాలు తెచ్చుకున్న న్నాళ్ళూ పండ్లు తినేసి విత్తులు దాచుకున్నాను. వీటిని కడిగి ఎంబడెట్టి దాచుకుంటే బొమ్మలు చేసుకోవచ్చు. ముందుగా ఒక పెన్సిల్‌తో గీసుకొని దానిపై ఈ విత్తుల్ని పేర్చుకుంటూ రావాలి. దాని రెక్కలకు శంకు చెట్ల కాయల్ని వాడాను. ఇంకా పిస్తా పొట్టును కూడా వాడుకోవచ్చు. చూడండి గుడ్లగూబ ఎలా ఉన్నదో!
పూలతో ఏనుగు
భూమ్మీద అతి పెద్దదైన జంతువు ఏనుగును సున్నితమైన పూలతో చేయడం విచిత్రంగా ఉంది. మా కుండీల్లో బిళ్ళ గన్నేరు పూలు బాగా కాస్తున్నాయి. ఆ పూలను కోసుకొచ్చి ఏనుగుకు రేఖల్లాగా అమర్చాలి. మధ్యలో శరీరాన్ని నింపడానికి బంతి పూల రెక్కల్ని వాడాలి. మా ఇంట్లో ఎరుపు పసుపు బంతిచెట్లు ఉన్నాయి. ఆ పూల రెక్కల్ని తెంపి ఏనుగు శరీరంను తయారు చేశాను. పూల ఏనుగు బాగుందా!
- డా. కందేపి రాణీప్రసాద్