Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కంటే కూతుర్నే కనాలి' అనిపించేలా చేశారు మన భారతీయ మహిళా బాక్సర్లు. నిఖత్ జరీన్, లోవ్లినా బోర్గోహైన్, సావీటీ బూరా (స్వీటీ), నీతు ఘంఘాస్... సొంత గడ్డపై ఒకే సారి నాలుగు బంగారు పథకాలు సాధించి దేశం గర్వపడేలా చేశారు. ఢిల్లీ వేదికగా జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) పోటీల్లో మహిళా శక్తిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిన వారి పరిచయం నేటి మానవిలో క్లుప్తంగా...
తొలి తెలుగు అమ్మాయి
ప్రపంచ మహి ళల బాక్సింగ్ చాంపి యన్‌షిప్‌లో తెలం గాణ అమ్మాయి నిఖత్ జరీన్ వరుసగా రెండో ఏడాది విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఒళ్లంతా దెబ్బలు, రక్తంతో తడిసిన బిడ్డను చూసి తల్లి భయపడింది.. బాక్సింగ్ చేసే అమ్మాయికి పెెండ్లి కాదని తండ్రిని భయపెట్టారు. అయినా వెనుకాడలేదు. సీనియర్ విభాగంలో దిగ్గజ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రపంచ టైటిల్ నెగ్గిన రెండో భారత బాక్సర్‌గా నిఖత్ ఘనత సాధించింది. ఢిల్లీలో జరిగిన అంతర్జతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) వరల్డ్ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం 50 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో ఆమె 5-0 తేడాతో గెలుపొందింది. బాక్సింగ్‌లో రెండుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డ్ సృష్టించింది.
తండ్రి ప్రోత్సాహంతో...
నిజామాబాద్‌లో పుట్టిపెరిగిన నిఖత్ ప్రస్తుతం హైదరా బాద్‌లో నివాసం ఉంటోంది. నిఖత్ జరీన్ తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్ తన కుమార్తెను బాక్సింగ్‌లో ప్రోత్సహించి స్వయంగా తనే ఒక ఏడాది పాటు శిక్షణ ఇచ్చారు. 2009లో విశాఖపట్నానికి చెందిన ద్రోణాచార్య అవార్డీ ఐవీ రావు దగ్గర ఆమె శిక్షణ పొందింది. అప్పటి నుంచీ పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆడుతూ వచ్చింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టార్గెట్ ఒలంపిక్ పోడియం స్కీమ్‌కి ఎంపిక అయింది. 2011లో టర్కీలోని అంటాల్యాలో జరిగిన అంతర్జాతీయ విమెన్స్ యూత్ అండ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలవడం ఆమె కెరీర్లో తొలి పెద్ద అడుగు. గత ఏడాది తొలిసారి వరల్డ్ చాంపియన్‌గా నిలిచారు.
బాక్సింగ్ ప్రస్థానం...
మొదట్లో నిజామాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ గ్రౌండ్లో పరుగు ప్రాక్టీస్ చేసేది నిఖత్. ఆమె 100, 200, 300 మీటర్ల పరుగు ప్రాక్టీస్ చేసేది. ఆమెను గొప్ప అథ్లెట్‌గా తీర్చిదిద్దాలన్నది తండ్రి జమీల్ కల. రోజూ గ్రౌండ్‌కు తీసుకెళ్లి, తీసుకువస్తుండే వారు తండ్రి. గ్రౌండ్ తర్వాత స్కూల్. స్ప్రింట్ ప్రాక్టీస్ చేస్తోన్న నిఖత్ అదే గ్రౌండ్లో జరుగుతోన్న బాక్సింగ్ ట్రైనింగ్ కూడా గమనించేది. అక్కడ చాలా మంది అబ్బాయిలు శిక్షణ తీసుకునే వారు. ఒకరోజు ఆ శిక్షణ సాగుతున్నపుడు తాను బాక్సింగ్ నేర్చుకుంటాను అని అడిగింది తండ్రిని. 'అది మగ పిల్లల ఆట. రఫ్ గేమ్. దెబ్బలు తగులుతాయి. దెబ్బల వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి' అన్నాడు తండ్రి. కానీ తను మాత్రం కష్టపడతానంది. దాంతో తండ్రి ఒప్పుకున్నాడు. ఇలా 12 ఏండ్లకే క్రీడల్లో తన ప్రయాణం ప్రారంభించింది నిఖాత్. అలా చేరిన ఆమెను అప్పట్లో నిజామాబాద్‌లో మగవారికి బాక్సింగ్ శిక్షణ ఇస్తున్న కోచ్ ప్రోత్సహించారు. ఏడాదిలోనే బాక్సింగ్‌లో మంచి నైపుణ్యంతో జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం మొదలుపెట్టింది. జాతీయ స్థాయిలో బ్రాంజ్, తర్వాత గోల్డ్ సాధించి.
ప్రపంచ ఛాంపియన్షిప్
సావీటీ బూరా... 2023 ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో బంగారు పతకాన్ని, 2014 ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో లైట్ హెవీవెయిట్ విభాగంలో రజత పతకాన్ని గెలుచుకుంది. ఆమె సోదరి సివి బూరా కూడా భారతీయ బాక్సర్. బూరా 10 జనవరి 1993న హర్యానాలోని హిసార్ గ్రామీణ ప్రాంతంలో జన్మించింది. ఆమె తండ్రి మహేందర్ సింగ్, ఒక రైతు. అలాగే జాతీయ స్థాయిలో బాస్కెట్‌బాల్ ఆడాడు. బూరా 2009లో తన తండ్రి కోరిక మేరకు బాక్సింగ్‌కు మారింది. అంతకు ముందు ఆమె రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడాకారిణి. ఆమె తన క్రీడా ప్రస్థానాన్ని ప్రారంభించిన కొత్తలో చౌదరి చరణ్ సింగ్ హర్యానా అగ్రికల్చరల్ యూనివర్శిటీ సమీపంలోని వ్యవసాయ భూములలో శిక్షణ పొందింది. క్రీడలోను తన కెరీర్‌గా కొనసాగించేందుకు హర్యానా నుండి ఢిల్లీకి వచ్చింది. ఈమె 7 జూలై 2022న దీపక్ నివాస్ హుడాను వివాహం చేసుకున్నాడు.
ఫైనల్‌కు చేరిన ఏకైక భారతీయురాలు
జెజు సిటీలో జరిగిన 2014 ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బూరా లైట్ హెవీవెయిట్ (81 కిలోలు) ఈవెంట్లో ఫైనల్లో చైనా బాక్సర్ యాంగ్ జియోలీ చేతిలో ఓడిపోయి రజత పతకాన్ని గెలుచుకుంది. 2015 ఆసియా మహిళల అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో వులాంచబులో జరిగిన ఈవెంట్లో ఫైనల్ చేరిన ఏకైక భారతీయురాలు బూరా. అదే ప్రత్యర్థితో ఓడిపోయి రజతం సాధించింది.
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లు
2017లో బూరా క్రీడా విజయాలకు హర్యానా ప్రభుత్వం నుండి భీమ్ అవార్డును అందుకుంది. 2018లో ఆమె తాను పోటీలో పాల్గొనే బరువును లైట్ హెవీవెయిట్ (81 కేజీలు) నుండి మిడిల్ వెయిట్ (75 కేజీలు)కి మార్చుకుంది. 2023 మార్చి 25న లైట్ హెవీవెయిట్ విభాగంలో చైనాకు చెందిన వాంగ్ లీనాను 4-3 తేడాతో ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన 7వ భారతీయ బాక్సర్ ఈమె.
బాక్సింగ్ వదులుకోవాలనుకుంది
నీతు ఘంఘాస్... 19 అక్టోబర్ 2000న హర్యానాలోని భివానీ జిల్లాలోని ధననా గ్రామంలో జన్మించింది. ఆమె తండ్రి జై భగవాన్, చండీగఢ్‌లోని హర్యానా రాజ్యసభలో ఉద్యోగి. ఆమె తల్లి పేరు ముఖేష్ దేవి. నీతుకి అక్షిత్ కుమార్ అనే తమ్ముడు ఉన్నాడు. తల్లి చెప్పిన ప్రకారం నీతు ఒక కొంటె పిల్ల. తరచుగా తన తోబుట్టువులతో, పాఠశాలలో గొడవలు పడుతుండేది. తన బిడ్డకు కొత్త శక్తిని అందించడానికి, నిర్మాణాత్మక మార్గాన్ని చూపడానికి తండ్రి నీతూను బాక్సింగ్‌కు పరిచయం చేశాడు. ఆమె తన 12 ఏండ్ల వయసులో శిక్షణ పొందడం ప్రారంభించింది. కానీ మొదటి రెండెండ్లల్లో ఎటువంటి పోటీల్లో పాల్గొనలేకపోయింది. బాక్సింగ్‌లో ఎలాంటి పురోగతి లేక పోవడంతో ఇక విసుగు చెంది క్రీడను వదులుకోవాలని నిర్ణయించుకుంది. ఆ సమయంలో తండ్రి ఆమెను ప్రోత్సహించి అండగా నిలబడ్డాడు. బాక్సర్ కావాలనే తన కుమార్తె కలలను సాకారం చేసేందుకు తండ్రి తన ఉద్యోగానికి మూడేండ్ల పాటు సెలవు తీసుకున్నాడు. తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేశాడు. ఖర్చుల కోసం దాదాపు ఆరు లక్షలు అప్పు కూడా తీసుకున్నాడు. అతనే నీతూ శిక్షణ, తీసుకో వల్సిన ఆహార జాగ్రత్తలను వ్యక్తిగతంగా పర్యవేక్షించాడు. ఈ కాలంలో ప్రఖ్యాత కోచ్ జగదీష్ సింగ్, ప్రఖ్యాత భివానీ బాక్సింగ్ క్లబ్ వ్యవస్థాపకుడు విజేం దర్ సింగ్ మెంటర్లలో ఒకరైన నీతూ ఘంఘాస్ని గమనిం చారు. అప్పట్లో శ్రీ గురు గోవింద్ సింగ్ కాలేజీలో బీఏ విద్యార్థిని అయిన నీతూ భివానీ బాక్సింగ్ క్లబ్లో చేరి శిక్షణ కోసం తన తండ్రి స్కూటర్‌పై ప్రతి రోజూ 40 కిలో మీటర్లు ప్రయాణించేది.
లవ్లీ పంచ్
లోవ్లినా బోర్గోహైన్... 1997, అక్టోబర్ 2న అస్సాంలోని గోలాఘాట్‌లో జన్మిం చింది. ఆమె 2020 ఒలింపిక్ క్రీడలలో మహిళల వెల్టర్ వెయిట్ ఈవెంట్లో కాంస్య పత కాన్ని గెలుచుకుంది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మూడవ భార తీయ బాక్సర్‌గా నిలి చింది. ఈ ఏడాది ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లలో బంగారు పతకాన్ని, 2018 ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్, 2019 ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలను గెలుచుకుంది. అస్సాం నుండి ఒలింపిక్స్‌లో రాష్ట్రా నికి ప్రాతినిధ్యం వహించిన మొదటి మహిళా అథ్లెట్, రెండవ బాక్సర్ ఈమె. 2020లో అస్సాం నుండి అర్జున అవార్డును అందుకున్న ఆరవ వ్యక్తిగా నిలిచింది.
తొలి దశలో...
ఆమె తల్లిదండ్రులు టికెన్, మమోని బోర్గోహైన్. ఆమె తండ్రి టికెన్ ఒక చిన్న స్థాయి వ్యాపారవేత్త. తన కూతురి కల నెరవేర్చడానికి ఆర్థికంగా కష్టపడ్డాడు. లోవ్లినా ముగ్గురు సోదరీ, సోదరులలో చిన్నది. ఆమె తన కవల సోదరీమణులైనా లిచా, లిమా కిక్‌బాక్సింగ్‌లో పాల్గొనడం చూసి తనూ అదే బాటను అనుసరించింది. బాక్సింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. లోవ్లినా చదువుకున్న బర్పథర్ గర్ల్స్ హై స్కూల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రయల్స్ నిర్వహించింది. బాక్సింగ్‌లో శిక్షణ పొందేందుకు ఆమె 2012 గౌహతిలో ప్రసిద్ధ కోచ్ పదమ్ చంద్ర బోడోచే ఎంపిక చేయబడింది. తర్వాత సంధ్యా గురుంగ్ వద్ద శిక్షణ పొందింది.
ఎన్నో పతకాలు...
న్యూఢిల్లీలో జరిగిన 1వ ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్లో బంగారు పతకాన్ని, గౌహతిలో జరిగిన 2వ ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్లో రజత పతకాన్ని గెలుచుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో యుకేకి చెందిన శాండీ ర్యాన్ చేతిలో ఓడిపోయింది. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో ఎంపిక కావడానికి ముందు ఆమె ఇండియా ఓపెన్‌లో విజయం సాధించింది. ఇది ఫిబ్రవరి 2018లో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్. వెల్టర్‌వెయిట్ విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. నవంబర్ 2017లో వియత్నాంలో జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. జూన్ 2017లో అస్తానాలో జరిగిన ప్రెసిడెంట్స్ కప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అలాగే జూన్ 2018లో మంగోలియాలో జరిగిన ఉలాన్బాతర్ కప్‌లో రజత పతకాన్ని, సెప్టెంబర్ 2018లో పోలాండ్‌లో జరిగిన 13వ అంతర్జాతీయ సిలేసియన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
- సలీమ