Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''సాహితీ సృజన చేయడానికి వెనుక నేనేం చేసాను అంటే చేయాల్సిందెంతో ఉందని మాత్రం చెప్పగలను. సాహిత్యమనే సంద్రంలో ఈత నేర్చుకుని తొలి అడుగుల్లో ఉంటూ సముద్రపు అందాలను చూస్తున్నాను. లోతులను గమనిస్తున్నాను. అద్భుతాలను అవలోకనం చేసుకుంటున్నాను. ఆటుపోట్లను తెలుసుకుంటున్నాను'' అంటారు ప్రముఖ రచయిత్రి డా.సమ్మెట విజయ. పెండ్లయి పిల్లలు పుట్టిన తర్వాత ఇటు కుటుంబాన్ని చూసుకుంటూనే నాటక రంగంలో పరిశోధన చేశారు. కవితలు, కథలు రాస్తూ తన ఆలోచనలు ప్రపంచం ముందు పెడుతున్నారు. అక్షరయాన్తో మమేకమై ఎన్నో సాహిత్య కార్యక్రమాలు చేస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో...
అమ్మ లక్ష్మీ తులసి, గృహిణి. నాన్న సమ్మెట పోతరాజు. అసిస్టెంబర్ లెబర్ ఆఫీసర్‌గా చేసేవారు. ఆయన ఉద్యోగ రీత్యా అనేక ప్రాంతాలు తిరిగాము. నేను హైదరాబాద్‌లో పుట్టాను. నాకు ఇద్దరు అక్కలు, అన్నా, చెల్లి ఉన్నారు. అందరం సాహిత్యం పట్ల అభిమానం వున్న వాళ్ళమే. నాన్న ట్రాన్సఫర్ల మధ్య నా చదువు చాలా ఊర్లలో జరిగింది. నిజామాబాద్, శ్రీరాం సాగర్, కరీంనగర్, కొత్తగూడెంలో స్కూలు చదువు పూర్తి చేశా. ఇంటర్ ఖమ్మంలో, డిగ్రీ మంచిర్యాలలో, బి.యిడి మహబూబాబాద్‌లో, ఎం.ఎ, ఎంఫిల్, పి.హెచ్డీ హైదరాబాద్‌లో పూర్తి చేశాను. స్కూల్లో చదువుతూనే లైబ్రరీ నుండి పుస్తకాలు తెచ్చుకొని చదువుకునే దాన్ని. నాన్న కూడా అనేక పత్రికలు, పుస్తకాలు ఇంటికి తీసుకొచ్చేవారు. వాటిని కూడా ఇంట్లో మేమందరం చదివేవాళ్ళం. నేనూ మా చిన్నక్క ఉమాదేవి రచనా రంగంలో వున్నాం. తను వయసులో పెద్దదైనా ఇద్దరం మంచి స్నేహితులం.
సాహిత్యానికి చేరువ చేసింది చదువే
చిన్నతనం నుంచి నాకు చదువంటే పిచ్చి. చదువే లోకంగా పెరిగాను. ఆ చదువే నన్ను సాహిత్యానికి చేరువ చేసింది. ఆ చదువే గొప్ప రచయితలను, రచనలను, మనుషుల మనస్తత్వా లను పరిచయం చేసింది. నన్ను నడిపించి నా చదువును కొనసాగించేలా చేసిన వారు నా తల్లిదండ్రులు. వివాహానం తరం నాకు తోడుగా నిలిచి ముందుకు పంపింది నా భర్త, అత్తమామలు. అలాగే పెద్దక్క దేవకీదేవి ప్రోత్సాహం నన్ను నన్నుగా నిలబెట్టింది. చదువుకోవాలనే పట్టుదల వివాహం అయినా, పిల్లలు పుట్టినా ఎం.ఏ, బి.ఇడితో ఆగక ఎం.ఫిల్, పి.జి డిప్లమా పబ్లిక్ రిలేషన్స్, ఎం.ఇడి, పి.హెచ్డి వరకు కొనసాగింది.
నా లక్ష్యం నెరవేర్చుకున్నాను
నా సబ్జెక్ట్ తెలుగు కనుక తెలుగు ఉపాధ్యాయురాలిగా జీవనం మొదలైంది. కుటుంబం కోసం కళాశాలకు వెళ్లకుండా (వేరే ఊర్లకు వెళ్ళలేక) బడి ఉద్యోగానికే పరిమితమయ్యాను. సాహిత్యం తెలుసుకోవాలంటే ముందు బాగా చదవాలని తెలుసుకున్నాను. అందుకు మామయ్య అంగీకారంతో, భర్త సహకారంతో చేస్తున్న ఉద్యోగానికి సెలవుపెట్టి (జీతం లేకుండా) ఒకటిన్నర వయసున్న బాబుకు పాలు, బట్టలు సర్ది అత్తవారింట వదిలి మూడు బస్సులు మారి తార్నాకా నుంచి కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చి బాబును చూసు కుంటూ చదువుకున్నాను. ఇక పి.హెచ్.డి కి ఎన్ని బస్సు లెక్కానో, నాటక రంగంలో పరిశోధనకు ఎందరిని కలిసి ఇంట ర్వ్యూలు చేసానో లెక్కలేదు. ఉద్యోగం చేస్తూ, కుటుంబ బాధ్య తలు నెరవేరుస్తూ నా లక్ష్యం నెరవేర్చుకున్నాను. ఈ ప్రయత్నం లో ఇంకా చదువంటూ తిరుగు తుందనే విమర్శను ఎదుర్కున్నా.
'సమ్మెట విజయ సౌజన్య'
ఇంటర్ నుంచి రచనలు చేస్తున్నాను. స్త్రీల సమస్యలపై 'సమ్మెట విజయ సౌజన్య' పేరుతో 40కి పైగా రాసిన వ్యాసాలు వివిధ పత్రికల్లో వచ్చాయి. తొలి కథ 'అమ్మాయి ప్రయాణం' భారతి పత్రికలో చూసుకున్నపుడు ఆనందం కలిగిం చింది. ఆ తర్వాత పరిశోధకురాలిగా ఉస్మానియా, తెలుగు, ఆదికవి నన్నయ్య, ద్రవిడ విశ్వవిద్యాలయాలలో పత్రసమ ర్పణలు చేశాను. ఒకప్పుడు డాక్టర్ కావా లని బైపీసీ తీసుకున్న నేను తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ చేసాను. నాకు లభించిన మరో అద్భుతమైన అవకాశం నా పి.హెచ్డి. అలాగే ఉస్మానియా విశ్వవిద్యా లయం, ఠాగూర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కాన్వకేషన్ ముఖ్యఅతిథి ఎ.పి.జె.అబ్దుల్ కలామ్, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సమక్షంలో డాక్టరేట్ తీసుకోవడం. నా జన్మలో మరిచి పోలేని రోజు అది. అబ్దుల్ కలామ్ ప్రసంగం నాలుగడుగుల దూరంలో వినడంతో ఆత్మ విశ్వాసం, పట్టుదల ఆ రోజు నుంచే అలవరు చుకున్నాను. ఆయన మాటలను ఆదర్శంగా తీసుకున్నాను.
కవితలు విరివిగా రాశాను
పి.హెచ్డి అయ్యాక ఆ పుస్తకం ''తెలుగులో నాటక రచన 1991-2000'' అభి నయ జాతీయ నాటక రంగ సంస్థ అభినయ శ్రీనివాస్ నిర్వహణ లో డా.సి.నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది. తర్వాత నా తొలి కవితా సంపుటి 'భావనాంజలి' వచ్చింది. నేను రచించిన వ్యాసాలతో ఒక వ్యాస సంకలనంగా తేవాలన్నది నా కోరిక. కానీ పుస్తక ప్రచురణకు అయ్యే ఖర్చు భరించలేక ఆగిపోయాను. ఇంతకు ముందు రాసి సిద్ధంగా ఉన్న 'తెర వెనుక', మరి రెండు పుస్తకాలు కూడా అలాగే ఉండిపోయాయి. కవయిత్రిగా కవితలు విరివిగా రాసాను. అనేక కవి సమ్మేళనాలలో పాల్గొన్నాను. హైదరాబాదుతో పాటు యానాం, ఖమ్మంలోనూ బహుమతులు అందుకు న్నాను. నేను పనిచేస్తున్న రైల్వే మిశ్రమోన్నత పాఠశాల లో కవితల పరంపర కొనసాగుతూనే ఉంది.
నాటక రంగం పరిశోధకురాలిగా...
అబ్బూరి ఛాయాదేవి కథల మీద ఎం.ఫిల్ చేసిన నేను కథలు చదవడం, రాయడంపై ఆసక్తిని పెంచు కున్నాను. నేను రచించిన ఓ కథ అర్చనా ఫైన్ ఆర్ట్స్ అకాడమి వారి బహుమతికి ఎంపికైంది. వివిధ కథా సంకలనాలలో నా కథలున్నాయి. వ్యాస రచయిత్రి గా భూమిక నుంచి బహుమతులు గెలుచుకు న్నాను. నవతెలంగాణలో, సారంగలో నా వ్యాసాలు, పుస్తక సమీక్షలు వచ్చాయి. డా.ప్రభాకర్ జైని రచించిన 'హీరో' నవలపై నేను రచించిన సమీక్ష ప్రత్యేక బహుమతికి ఎంపికైంది. నాటకరంగ పరిశోధకురాలిగా ఎన్నో వ్యాసాలు రచించాను. తెలంగాణ నాటక సాహిత్యం గ్రంథంలో తెలంగాణ నాటక రంగం లో మహిళల గురించి వ్యాసం రాసాను. బడి నేపథ్యంలో రచించిన 'బడే నా లోకం' నవల ముద్రణలో ఉంది.
భాషకు సేవ చేయగలిగాను
అక్షరయాన్ రూపొందినప్పటి నుంచి నేటి వరకూ మహిళా కవయిత్రులను సంఘటితంగా ఒక విశిష్ట సంస్థగా రూపొం దాలని తపించాము. అందుకోసం వ్యవస్థాపక అధ్యక్షురాలు అయినంపూడి శ్రీలక్ష్మితో కలిసి పలు సాహితీ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. హైదరాబాద్‌కు జిల్లా ప్రతినిధిగా రెండు సంవత్సరాలు చేసి ఆ తర్వాత పత్రికా ప్రతినిధిగా నా వంతు సహకారాన్ని అందిస్తున్నాను. అక్షరయాన్ వెలువరించిన పుస్తకాలలో నా రచనలు కూడా చోటు చేసుకున్నాయి. లైంగిక దాడుల వల్ల గురైన స్త్రీల కుటుంబాలను కలిసి ఉమెన్ సేఫ్టీ వింగ్ సహకారంతో ప్రత్యక్షంగా మాట్లాడి కథలు రాసాము. కరోనా పై యుద్ధం కవితలతో సంకలనం తీసుకొచ్చాము. విత్తన సదస్సు నిర్వహించాము. పూలసింగిడి పేరుతో బతుకమ్మ కవితలు రాసాము. పరమవీరచక్ర సైనిక వీరులకు కవితల హారతినిచ్చాము. సీనియర్ రచయిత్రులకు మాతవందనం చేసాం. సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లో మక్కువ ఉన్న నాకు తెలుగు భాషకు సేవచేసే అవకాశం కలిగించింది. అందుకు అక్షరయాన్ బాసటగా నిలిచింది. నా ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు అప్పుడప్పుడూ రచనలు చేసే విషయంలో కొంత విరామం కలిగించినా నాటకరంగం, కథలు, కవితలు అన్ని మాధ్యమాల్లో పరిశీలించి అధ్యయనం చేస్తూనే ఉంటాను. ఆయా రచయితల రచనలకు స్పందన తెలియజేస్తాను. కనుక సాహిత్యంతో నా జీవితం మమేకం. అక్షరయాన్ ద్వారా సాహిత్యానికి ఈ జీవనం అంకితం. మరిన్ని మంచి రచనలు చేయడానికి నన్ను నేను మెరుగులు దిద్దుకుంటాను.
ఆత్మీయ సంగమంగా మార్చింది
తెలుగు సాహిత్యం పట్ల మక్కువ ఎందుకు అంటే అమ్మ మీద మక్కువ ఎందుకు అని ప్రశ్నించినట్లే. తెలుగు నా మాతృభాష, ప్రాణం ఉన్నంత వరకు తెలుగు భాషకు నా వంతు సేవ చేయాలి. తెలుగు వెలుగులను దశదిశలా చాటాలి. ఇటీవల సరోజిని నాయుడు జయంతి సందర్భంగా సరోజిని నాయుడు పురస్కారం లభించడం కవిత్వం పట్ల నా బాధ్యత మరింత పెంచింది. కర్ణాటక తెలుగు సమాఖ్య, బెంగుళూరు వారి ఉగాది పురస్కారం దేశ వ్యాప్తంగా పలు సాహితీ సంస్థలలో చేసిన సేవలకు ఎంపిక చేసిన వారికి ఇచ్చే పురస్కారం. మార్చి 19, 2023న అక్షరయాన్ సంస్థ నుంచి నాకు లభించడం నన్ను మాత్రమే కాదు అక్షరయాన్ రచయిత్రులందరినీ దేశంలోని సాహితీ సంస్థల మధ్య సగర్వంగా నిలబెట్టింది. అలాగే సాహిత్యానికి 'తెలంగాణ సాహితి' చేస్తున్న కృషి సర్వదా ప్రశంసనీయం. తెలంగాణ సాహితితో విడదీయరాని అనుబంధం ఖమ్మం నుంచీ ఉంది. అనేక సాహితీ సమావేశాల్లో పాలుపంచుకుని కవితలు చదివి, పత్రసమర్పణ చేసి ఆత్మీయ సంగమంగా మార్చింది.
- సలీమ