Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలమేదైనా చర్మం జిడ్డుగానే కనిపించడం కొందరికి పెద్ద సమస్య. వేసవి వచ్చిందంటే ఈ పరిస్థితి మరింత ఎక్కువవుతుంది. ఇలాంటప్పుడు జిడ్డు తగ్గి... ముఖం తాజాగా మెరవాలంటే ఈ చిట్కాలు పాటించి చూడండి. అందులో ఉండే ఈ పదార్థాలు మీ సమస్యను సులువుగా తగ్గించేయగలవు.
- ముఖం జిడ్డుకారుతుంటే మొటిమలూ ఇబ్బంది పెడతాయి. అలాంటప్పుడు తేనెలో రెండు చుక్కల తులసిరసం కొద్దిగా పాలు కలిపి ముఖానికి రాసి ఆరనివ్వండి. అర్ధగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయండి. ఇలా తరచూ చేస్తుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
- జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి నిమ్మరసం చక్కగా పనిచేస్తుంది. ఇందులో కొద్దిగా నీళ్లు కలిపి అందులో దూదిని ఉండలుగా చేసి వేయాలి. కాసేపు ఆ ఉండల్ని ఫ్రిజ్లో ఉంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మురికి తొలగిపోయి శుభ్రపడుతుంది. తేమ అందుతుంది జిడ్డు పేరుకోకుండా ఉంటుంది.
- విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ అధికంగా లభించే వాటిల్లో టమాటో ఒకటి. జిడ్డు చర్మం కలవారు టమాటో ముక్కపై కాస్త పంచదార చల్లి ముఖంపై మృదువుగా రుద్దాలి. పావుగంటయ్యాక చల్లటి నీళ్లతో కడిగేస్తే చర్మం తాజాగా మారుతుంది. జిడ్డు తొలగిపోతుంది.
- బొప్పాయిలో అధికంగా లభించే విటమిన్ ఎ, ఇతర పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా కాంతిమంతంగా మారుస్తాయి. బప్పాయి గుజ్జులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి పూతలా వేసుకుని అరగంటయ్యాక కడిగేస్తే చాలు. జిడ్డు మాయమవుతుంది. ఇలా తరచూ చేస్తుంటే సులువుగానే జిడ్డుకి అడ్డుకట్టవేయొచ్చు.