Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పద్మ లక్ష్మి... ఓ అడుగు ముందుకేసింది. కనిపించని వివక్షను బద్దలు కొట్టింది. ట్రాన్స్ కమ్యూనిటీకి దిగ్గజంగా గుర్తింపు తెచ్చుకుంది. కేరళ రాష్ట్రంలో లాయర్‌గా నమోదు చేసుకున్న తొలి ట్రాన్స్‌జెండర్‌గా చరిత్ర సృష్టించింది. ఆ వివరాలేంటో, దాని వెనుక ఆమె పడ్డ కష్టమేంటో మనమూ తెలుసుకుందాం...
గత నెల మార్చి 19న తన గురించి పత్రికలో వచ్చిన వార్తను చదవకూడదని నిర్ణయించుకుంది. పైగా ఇంటికి వెళ్లి ప్రశాంతంగా నిద్ర పోయింది. ''మరుసటి రోజు నా కోసం ఒక కొత్త అధ్యాయం వేచి ఉంది. నేను నా కొత్త బాధ్యతలను నెరవేర్చేటందుకు రాబోయే రోజుల్లో అనేక నిద్రలేని రాత్రులు ఉంటాయని నాకు తెలుసు'' అని కేరళలో లాయర్‌గా నమోదు చేసుకున్న మొదటి ట్రాన్స్‌జెండర్ అయిన పద్మ అన్నారు.
ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు...
ఎర్నాకులం గవర్నమెంట్ లా కాలేజీ నుండి ఫిజిక్స్‌లో బీఎస్సీ పూర్తి చేశారు పద్మ. తన సాధించిన ఈ విజయానికి తన తల్లిదండ్రులకు రుణపడి ఉన్నానని, వారు అన్నింటిలో తనకు అండగా నిలిచారని ఆమె అన్నారు. ''నేను లాయర్‌గా మొదటి రోజు నల్లని కోటును ధరించిన ప్పుడు మా నాన్న ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అయన నాతో చెప్పాడు 'నువ్వు ఉత్సాహంతో ముందుకు వెళ్ళు. నువ్వు ఎప్పుడూ తల ఎత్తుకునే వుండాలి. ఎవరి ముందు తలవంచాల్సిన అవసరం లేదు' అన్న తండ్రి మాటలు ఆ యువ న్యాయవాది గుర్తు చేసుకున్నారు.
ఏది ఏమైనా ఆమె మా బిడ్డ...
కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో మాజీ కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన తండ్రి మోహన కుమార్ తన పరివర్తన ప్రయాణంలో వచ్చిన మార్పుల గురించి అన్న మాటలను గుర్తుచేసుకుంటూ 'ఏమైనప్పటికీ ఆమె మా బిడ్డ... మేము ఆమెను రక్షిస్తాము, అవసరమైన మద్దతు ఇస్తాం. అప్పుడే ఆమెను ఇతరులు అంగీకరిస్తారు. పద్మకు ఇద్దరు అక్కలు. అశ్వతీ మోహన్ అకౌంటెంట్‌గా చేస్తుండగా, రెండవ అక్క అర్చన మోహన్ సెయింట్ జేవియర్స్ కాలేజీలో మలయాళ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. పద్మ ట్రాన్స్ ఉమెన్‌గా మారే ప్రయాణం అంత సులభంగా జరగలేదు. ఆమె విద్యా విజయం అన్నింటికంటే మించిపోయింది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT)కి సిద్ధమయ్యేలా ప్రోత్సహించినందుకు ఆమె తన తల్లి జయ మోహన్‌కు, న్యాయవాది అబ్దుల్ హకీమ్‌కు ఆమె తన విజయ ఘనతను ఇచ్చారు.
నిరంతరం ఆందోళన చెందాను...
''నేను ఎడపల్లి చర్చి వద్ద నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చుని CLAT కోసం సిద్ధమయ్యాను. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు'' అన్నారు పద్మ. 2019లో మొదటి అలాట్మెంట్లోనే తనకు ప్రవేశం లభించింది. పద్మ లా కాలేజీలో చేరే సమయానికి హార్మోన్ థెరపీతో పాటు ఇతర వైద్య చికిత్సను ప్రారంభించారు. ''నా శరీరం చాలా మార్పులకు గురైంది. ఇతర విద్యార్ధులు నా గురించి ఏమనుకుంటారో అని నిరంతరం ఆందోళన చెందుతూ ఉండేదాన్ని. చివరగా నా అభిమాన ఉపాధ్యాయునితో (ఎర్నాకులం లా కాలేజీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మరియమ్మ A K) నా భయం గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. నా ఆందోళన విన్న తర్వాత ఆమె 'నువ్వు ఎందుకు బాధపడాలి? ఇతరుల గురించి ఎందుకు బాధపడాలి? ధైర్యంగా ముందుకు సాగండి. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ తప్ప మరెవరూ రచించని సమానత్వ పుస్తకం(రాజ్యాంగం)తో మీరు సాయుధమయ్యారు' అన్నారు. ఆమె మాటలు చాలా సానుకూలంగా ఉన్నాయి. మిగతా టీచర్ల నుంచి కూడా ఇదే ప్రోత్సాహం లభించింది'' అని పద్మ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
చరిత్రలో మొదటి వ్యక్తి...
''ఒక సీనియర్ నా సామర్థ్యాన్ని గ్రహించి, సమాజం కోసం పనిచేసే అవకాశం ఇస్తే నా బాధ్యతను నిర్వర్తిస్తాను'' అని పద్మ అంటున్నారు. ఇప్పటివరకు తన ప్రయాణంలో తనకు లభించిన ప్రేమ, మద్దతుకు ఆమె ఎంతో ఆనందంగా వున్నారు. లాయర్‌గా తన మొదటి రోజున తన శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆమెను అభినందించిన వారిలో కేరళ పరిశ్రమలు, న్యాయ శాఖ మంత్రి పి. రాజీవ్, కేరళ ఉన్నత విద్య, సామాజిక న్యాయ శాఖ మంత్రి ఆర్.బిందు ఉన్నారు. తన ఇన్సా ్టగ్రామ్లో పద్మ చిత్రాన్ని పంచుకుంటూ రాజీవ్ ''చరిత్రలో మొదటి వ్యక్తి కావడం ఎల్లప్పుడూ కష్టతరమైన విజయం. ఈ వృత్తిలో తన పూర్వీకులు ఎవరూ లేరు. అడ్డంకులు చాలా ఉంటాయి. నిరుత్సాహపరిచే వ్యక్తులూ ఉంటారు. ఇన్ని అడ్డంకులను అధిగమించి న్యాయ చరిత్రలో పద్మాలక్ష్మి తన పేరును లిఖించుకుంది అన్నారు. బిందు ట్వీట్ చేస్తూ ''పద్మ లక్ష్మి పేరు ఇప్పుడు కేరళ చరిత్రలో నిలిచిపోతుందనడం చాలా గర్వించదగిన విషయం. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో అడ్డంకులను ఎదుర్కొందనడంలో సందేహం లేదు. కానీ ఆమె పట్టుదలగా ఉంది. ఎవరూ ఆమెను వెనక్కు లాగలేరు. పద్మాలక్ష్మి ఇప్పుడు కేరళకు ఆశాకిరణం...'' అన్నారు
ఇది నా పోరాటమే కాదు...
న్యాయవాదిగా వృత్తిని చేపట్టేందుకు తన ప్రయాణంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అడిగితే 20 సం|| వయసులో ఉల్లాసంగా ఉన్న ఆమె ''ఇది కేవలం నా పోరాటం కాదు. నా తల్లిదండ్రుల పోరాటం కూడా. నా మార్గాన్ని ఎంచుకునే విశ్వాసాన్ని వారు నాకు ఇచ్చారు. ఇలాగే తల్లిదండ్రులు తమ పిల్లలకు అండగా నిలబడితే మాలాంటి వాళ్ళను ఎగతాళి చేసేందుకు ఎవరూ సాహసించరు...'' అన్నారు. తన యుక్త వయసులో పూర్తిగా గందరగోళానికి గురై శారీరక సమస్యలను ఎదుర్కొన్న పద్మకు స్నేహితులు కరువయ్యారు. అబ్బాయిలతో సహవాసం చేసినా కూడా ప్రశాంతంగా లేదు. తల్లిదండ్రుల పూర్తి మద్దతుతో హార్మోన్ థెరపీని ఎంచుకున్నారు. తన చికిత్సకు అవసరమైన డబ్బు కోసం ఆమె భీమా ఏజెంట్‌గా పని చేశారు. ఇంట్లో ట్యూషన్లు కూడా చెప్పారు.