Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మర్చిపోవడం అనేది చాలా మందికి సహజమైన విషయం. అయితే పదే పదే మర్చిపోతున్నారా? ఆఖరి నిమిషంలో హడావుడి పడొద్దని ఇక్కడే పెట్టానే! నిన్న కూడా గుర్తు చేసుకున్నా.. ఇప్పుడే ఎంత ప్రయత్నించినా జ్ఞప్తికి రావట్లేదు. ఇంతలోనే ఎలా మర్చిపోయానబ్బా.. ఇలా తరచూ అనుకుంటున్నారా? నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు నిపుణులు.
- పుట్టగొడుగుల్లో ఉండే కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంతోపాటు అల్జీమర్స్ రాకుండానూ కాపాడతాయి. వీటితోపాటు డార్క్ చాక్లెట్, దాల్చిన చెక్క, తాజా కూరగాయలకు రోజువారీ ఆహారంలో ప్రాధాన్యమివ్వండి. మతి మరుపును దూరంగా ఉంచొచ్చు.
- ఇంట్లో, ఆఫీసులో సంబంధ బాంధవ్యాలు బాగానే ఉన్నాయా? మరచి పోవడానికీ, దీనికీ ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఇతరులతో సత్సంబంధాలు నెరపకపోవడం, గొడవలు, చిరాకులు వంటివీ మెదడుపై ప్రభావం చూపుతాయట. ఫలితమే మరచిపోవడం లాంటివి. కాబట్టి, స్నేహాలు, బాంధవ్యాలపై దృష్టిపెట్టేయండి.
- ఇంట్లో ఉంటే వంట గది, ఆఫీసుకెళితే సిస్టమ్! ఇవీ మెదడుపై ప్రతికూల ప్రభావం చూపేవే! బాల్కనీలో కూర్చోవడం, మొక్కల మధ్య నడవడం.. ఆఫీసులో అయితే కొద్దిసేపు కారిడార్లో నడక వంటివి చేయండి. గుర్తుపెట్టుకోవల్సిన ముఖ్యమైన విషయం సరైన నిద్ర ఉండేలా చూసుకోవడమూ తప్పనిసరి.
- ఫోనుతో ఎక్కువగా గడుపుతున్నారా? అయితే వీలైనంత పక్కన పెట్టేయండి. దీన్నుంచి వచ్చే నీలికాంతి మెదడుపై ప్రతికూల ప్రభావం చూపి మతిమరుపునకు దారి తీస్తుంది. దీనికి బదులు పుస్తకాలు చదవడం, గత విషయాలను గుర్తుతెచ్చుకొని రాయడం, పజిల్స్ వంటివాటిపై దృష్టిపెట్టండి. ఏమాత్రం సమయం దొరికినా వెనక్కి నడవడం సాధన చేయండి. ఇవన్నీ సమస్యను తగ్గించేస్తాయి.