Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మచ్చల బట్టలు, బూట్లు, నెత్తికి టోపీ, చేతిలో తుపాకి ఉన్న వారు మాపై అఘాయిత్యానికి పాల్పడ్డారు''. ఇది తప్ప మరో విషయం చెప్పలేని అమాయకులు. అడవిని నమ్ముకు జీవిస్తున్న ఆదివాసులు. ప్రకృతిని ఆరాధిస్తూ అన్యాయం చేయటం తెలియని గిరిజన బిడ్డలు. ''సంతకు వెళితే ఇప్పటికీ మమ్మల్ని పోలీసుల పెళ్ళాలనే అంటున్నారు'' అంటూ ఆవేదన వ్యక్తం చేసే అడవి బిడ్డలు. వారే పోలీసుల చేతిలో అత్యంత దారుణంగా లైంగిక దాడికి గురైన వాకపల్లి ఆదివాసీ మహిళలు. న్యాయం కోసం 16 ఏండ్లు పోట్లాడారు. మూడు రోజుల కిందట కోర్టు ఈ కేసులో తీర్పునిచ్చింది. ఇప్పటికైనా వారికి నిజంగా న్యాయం జరిగిందా..? ఇన్నేండ్లు వారు చేసిన పోరాటం ఫలించిందా..? అసలు ఈ కేసుకు సంబంధించిన వివరాలు, కోర్టు తీర్పు గురించి మహిళా సంఘాలు, అభ్యుదయ వాదులు ఏమంటున్నారో ఈరోజు మానవిలో తెలుసుకుందాం...
అది 2007 ఆగస్టు 20వ తేదీ. విశాఖ ఏజేన్సీ ప్రాంతం. వాకపల్లి గ్రామం. సరిగ్గా పొద్దు కూడా పొడవలేదు. సూర్యుడు ఉదయించనే లేదు. మగవారంతా తమ పసుపు పొలాల్లో పని కోసం వెళ్లారు. మహిళలు కొందరు ఇంట్లో వంట చేసు కుంటూ, మరి కొందరు నీళ్లు మోసుకొచ్చుకుంటు న్నారు. అకస్మాత్తుగా 21 మంది గ్రేహౌండ్స్ పోలీసులు వచ్చి గ్రామంపై విరుచుకుపడ్డారు. 'మీరు మావోయిస్టులకు సహకరిస్తున్నారూ'' అంటూ పచ్చి బూతులు తిడుతూ, దౌర్జన్యంగా ఇళ్లల్లో దూరి వంటగదిలో ఉన్న మహిళలపై లైంగిక దాడులకు పాల్పడార్డురు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు నలుగురు పోలీసులు కలిసి ఒక్కో మహిళపై దాడికి పాల్పడ్డారు. ఈ హఠాత్పరిణామానికి భయపడి పారిపోతున్న వాళ్లను, బహిర్భుమికి వెళ్లిన వాళ్లను, పచ్చి బాలింతలని కూడా చూడకుండా సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
కేసు నమోదు చేయలేదు
దాడికి పాల్పడిన పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత బాధిత మహిళలంతా గుంపుగా చేరి రోధి స్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ వారి వద్దకు వెళ్ళారు. ఆయన వెంటనే మహిళలను తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు చేరుకుని జరిగిన విషయాన్ని చెప్పారు. కానీ పోలీ సులు ఎటువంటి ఎప్.ఐ.ఆర్. నమోదు చేయలేదు. అసలు దీన్ని ఓ కేసుగానే పరగణలోకి తీసుకో లేదు. దాంతో మహిళా సంఘాలు, అభ్యుదయ వాదులు, మానవ హక్కులవారు రంగంలోకి దిగారు. ఉదయం 11 గంటలు అయ్యే సరికి ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. పత్రికా విలేకరులు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా స్పందించి బాధితుల పక్షం నిలబడి బాధితులతో పాటు అధికారులకు ఫిర్యాదులు చేశారు.
కుమిలి కుమిలి ఏడుస్తుంటే...
వాకపల్లి ఆదివాసీలపై జరిగిన అత్యంత దారుణమైన ఈ సంఘటన విషయం టీవీల ద్వారా బయట ప్రపంచానికి తెలిసింది. తమపై ఘోరమైన దాడి జరిగి కుమిలి కుమిలి ఏడుస్తున్న మహిళల గురించి అప్పటి రాష్ట్ర డీజీపీ బాసిత్ చాలా అవమానకరంగా మాట్లాడాడు. అప్పటి హోంమంత్రి జానారెడ్డి అయితే ఏకంగా అసలు అక్కడ ఏమీ జరగలేదని, ఇది అవాస్తవ మని ప్రకటించారు. అప్పటి విశాఖ జిల్లా ఎస్పీగా ఉన్న అంజన్ కుమార్ సబర్వాల్ ఇది మావోయిస్టుల నీచ ఎత్తుగడని అభివర్ణించారు. అప్పటి పాడేరు డిఎస్పి స్టాలిన్ మరీ దిగజారి అమాయక గిరిజన మహిళలను అడ్డుపెట్టుకొని మావోయిస్టులు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని మీడియా ద్వారా ప్రచారం చేశారు.
సరైన విచారణ చేయలేదు
నిజానికి ఈ సమాజంలో ఏ స్త్రీ తనపై లైంగిక దాడి జరిగిందని బయటకు చెప్పుకోలేదు. పైగా ఇలాంటి ఘటన జరిగిందని తెలిస్తే తమను తమ జాతి వెలివేస్తుందని తెలిసిన ఆదివాసీ మహిళలు అసలే చెప్పరు. అందులోనూ ఆదివాసి సంస్కృతిలో అబద్ధం ఆడడం అనేది ఉండదు. అలాంటి వారికి జరిగిన అన్యాయంపై సరియైన విచారణ లేకుండా, సాక్షాధారాలు లేకుండా చేసి, గ్రేహౌండ్ పోలీసులను కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. కనీసం పోలీసులను చట్టబద్ధంగా అరెస్టులు చేసి విచారణ కూడా చేయలేదు. సంఘటన జరిగినా వెంటనే కలెక్టర్ గానీ, ఏ ఇతర అధికారులు గానీ, స్థానిక పోలీసులు ఎవ్వరూ కూడా వాకపల్లి వెళ్లి స్థానికంగా జరిగిన సంఘటనపై ప్రాథమిక దర్యాప్తు కూడా జరపలేదు.
అన్యాయం జరిగింది వాస్తవం...
సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, అభ్యుదయ వాదులు బాధితులకు అండగా నిలిచారు. వారి అండతో 16 ఏండ్లుగా ఆ ఆదివాసీ మహిళలు అలుపెరుగక సుదీర్ఘ పోరాటం చేశారు. నిరాహార దీక్షలకు దిగారు. ఆర్థిక, రాజకీయ అండ లేకపోయినా, అక్షరం ముక్క తెలియకపోయినా తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఈ పోరాట ఫలితంగానే విశాఖ అదనపు కోర్టు మూడు రోజుల కిందట సంచన తీర్పును ప్రకటించింది. మహిళలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే. అయితే ఈ కేసులో విచారణ సరిగ్గా జరగలేదని, సరైన ఆధారాలు లభించని కారణంగా పోలీసులను విడిచి పెడుతున్నామని కోర్టు దోషులపై కేసు కొట్టి వేసింది. అయితే దర్యాప్తు సరిగా చేయలని అధికారు లపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఆదివాసీలకు నష్టపరి హారం చెల్లించాలని తీర్పులో చెప్పింది. ఈ మొత్తం సంఘటనను గమనించినపుడు మొదటి నుండి ప్రభుత్వంలో పని చేస్తున్న గ్రేహౌండ్స్ పోలీసులను రక్షించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని స్పష్టంగా అర్థమ వుతుంది.
ఇద్దరు చనిపోయారు...
లైంగిక దాడికి గురైన తర్వాత సుమారు వారం రోజుల పాటు ఆ మహిళలను భర్తలు ఇంట్లోకి రానీయలేదు. ''మీరు పోలీసోళ్ళ భార్యలయ్యారు, ఇంట్లోకి రావొద్దు'' అంటూ బయటే కూర్చోబెట్టారు. అన్ని రోజులూ అవమాన భారాన్ని అనుభవిస్తూ గంజి తాగుతూ బతికారు. కనీసం పిల్లలకు పాలు కూడా ఇవ్వనీయలేదు. వాళ్ళ సంప్రదాయం ప్రకారం శుద్ధి చేసిన తర్వాత వారిని ఇంట్లోకి రానిచ్చారు. అలాంటి మహిళలపై అసలు దాడే జరగలేదని అధికాలు ఎలా ప్రకటించారో అర్థం కాని విషయం. తర్వాత కాలంలో ఆ పదకొండు మంది మహిళల్లో ఒకరు ఒత్తిడిని భరించలేక చనిపోయారు. మరో మహిళ పాము కాటుతో చనిపోయారు. ఇక ఈ కేసులో అసలు ఎలాంటి దాడి జరగలేదు అని అప్పుడు అధికారులు, పోలీసులు ఇచ్చిన ప్రకటన తప్పు అని నిరూపించడానికి బాధితుల తరపున నిల బడిన లాయర్లు ఇన్నేండ్లు ఎంతో శ్రమించారు. ఇన్నేండ్లకు అక్కడ అన్యాయం జరిగిన మాట వాస్తవమని కనీసం కోర్టు అంగీకరించే విధంగా కృషి చేసిన లాయర్లకు మహిళా సంఘాలు అభినందలు తెలియజేస్తున్నారు.
- సలీమ
ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు
ఇంతకాలానికి బాధితులు చేసిన ఫిర్యాదును కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇది ఆహ్వానించదగిన విషయం. అయితే ఈ కేసులో మూడు తీవ్రమైన పొరపాట్లు జరిగాయి. అందులో మొదటిది ప్రభుత్వం, విచారణ అధికారులు ముందుగానే తీర్పు చెప్పేశారు. మావో యిస్టులు తప్పించుకోవడానికి గిరిజన మహిళలను ఉపయోగించుకున్నారని వారే నిర్ణయించేశారు. అలాగు పోలీసులే దాడికి పాల్పడితే విచారణ కోసం తిరిగి పోలీసులనే కేటాయిం చడం మరో తప్పు. మరో ముఖ్యమైనది ప్రాధమిక సాక్షాధారాలు. ఫిర్యాదు చేసిన వెంటనే దాడికి గురైన వారిని హాస్పిటల్కు పంపించాలి. అవసరమరైన సాక్ష్యాలను అంటే వారి బట్టలను సేకరించాలి. అక్కడున్న గుర్తులను సేకరించాలి. ఇవేవీ చేయకపోగా వాటిని కావాలని నాశనం చేశారు. సాక్ష్యాలను చెరిపేసే ప్రయత్నం చేశారు. ఇలా సాక్షాలు దొరక్కుండా చేశారు అనే దానిపైన సంపూర్ణంగా విచారణ జరిపి వాళ్ళకు శిక్ష పడితేనే బాధిత మహిళలకు న్యాయం జరిగినట్టు. అయితే ప్రభుత్వ చేసిన తప్పును సరిదిద్దు కోవడానికి వెంటనే వారికి పునరావాసం కల్పించాలి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు. అంటే గత ప్రభుత్వాల దారిలోనే ఈ ప్రభుత్వం కూడా నడుస్తుంది. ఆ మహిళలకు అన్యాయమే చేస్తుంది.
- డి.రమాదేవి,ఐద్వా ఏపీ రాష్ట్ర కార్యదర్శి
కాఫ్ పంచాయితీలా ఉంది...
దళిత, ఆదివాసీలకు అన్యాయం జరిగిన ప్రతి సారీ ఎలాంటి తీర్పు ఇస్తారో ఇప్పుడూ అలాంటి తీర్పే ఇచ్చారు. అది రావడానికి కూడా ఎన్నో ఏండ్లు పడుతుంది. నేరం ఉన్నప్పుడు శిక్ష ఉంటుంది. కానీ ఇక్కడ నేరం జరిగిందంటున్నారు కానీ శిక్ష మాత్రం పడలేదు. కారంచెడు నుండి చూసుకుంటే అన్ని కేసుల్లో పరిస్థితి ఇలాగే ఉంది. నష్టపరిహారం ఇస్తున్నావంటే నేరం జరిగినట్టే కదా, అప్పుడు శిక్ష ఎందుకు ఉండదు అనేది నా ప్రశ్న. విచారణ జరగాల్సిన రీతిలో జరగలేదు. చాలా మంది వాళ్ళు గుర్తుపట్టే పరిస్థితుల్లో లేరు అంటున్నారు. గుర్తు పట్టినంత మాత్రాన శిక్ష వేస్తున్నారా..? కారంచెడులో నేరం చేసిన వారిని గుర్తు పట్టారు. మరి వారికి శిక్ష పడిందా.? ఆయేషా మీర కేసులో ఏం చేశారు. నేరం చేసిన వారు ఎవరో తెలుసు, ఆ కేసులో ఏం చేశారు. ఇక బిల్కిస్బాను నేరస్థులను వదిలేశారు. దీన్ని బట్టి భారతదేశంలో మహిళలపై లైంగిక దాడులు జరిగితే శిక్షలు పడే పరిస్థితులు లేవు.
- సూరేపల్లి సుజాత