Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యాయామంలో బోలెడు కెలొరీలు కరిగిపోతాయి. ఒళ్లంతా అలసిపోతుంది. అందుకే పూర్తయ్యాక కాస్త నీరసంగా అనిపిస్తుంది. ఒక్కోసారి వెంటనే మరో పని చేయాలనీ అనిపించదు. తక్షణ శక్తి కావాలా? వీటిని తాగేయండి.
చాక్లెట్ మిల్క్: చాలామంది అమ్మాయిల చీట్ డేలో ఇది తప్పనిసరి. అలాంటిది కష్టపడి కెలొరీలు తగ్గించుకున్నాక దీన్ని తాగమంటారేంటి అంటారా? వ్యాయామం తర్వాత దీన్ని తీసుకుంటే తక్షణ శక్తి ఖాయమంటోంది ఓ అధ్యయనం. అదనంగా దీనిలోని కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్ ఎముకల ఆర్యోగానికీ సాయపడతాయి.
స్మూతీలు: పండ్లు, కూరగాయలతో చేసిన స్మూతీల్లో పోషకాలు పుష్కలం. శక్తి త్వరగా పుంజుకునేలా చేస్తాయివి. వాటికి కాస్త నట్ బటర్నీ జోడించుకుంటే ఎముకలకూ దృఢత్వం.
గ్రీన్ టీ: ఉదయం నిద్ర లేవగానే దీన్ని తీసుకునేవారు చాలామందే! కానీ వ్యాయామం తర్వాత తీసుకొని చూడండి. దీనిలో అధిక మోతాదులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫ్లమేషన్ని దరిచేరనీయవు. కొద్ది మొత్తంలో ఉండే కెఫిన్ సహజంగానే శక్తినిస్తుంది.
కొబ్బరినీళ్లు: వ్యాయామ సమయంలో చెమట రూపంలో నీరంతా బయటకు పోతుంది. డీహైడ్రేషన్‌ను తప్పించడంలో వీటిలోని ఎలక్ట్రోలైట్స్ సాయపడతాయి. కెలొరీలు తక్కువ, శరీరానికి తోడ్పడే పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఎక్కువ. శక్తిని కూడగడుతూనే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలూ అందిస్తాయి.