Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన చేనేతకు చేయుతగా నిలిచి, పర్యావరణ ప్రేమికగా, మన దేశ వస్త్రాల ప్రాముఖ్యాన్ని, ప్రాభావాన్ని ప్రపంచానికి చాటుతున్న వ్యాపారవేత్త... నేటి మహిళ మేటి మహిళ అని నిరూపిస్తున్నారు మృణాళిని శాస్త్రి. సిక్స్ యార్డ్స్ ప్లస్ అనే సంస్థ ద్వారా చీరకు మెరుగులు దిద్ది నేటి ఆధునిక మహిళకు కూడా చీర సొబగులను నేర్పి, వారు సులభంగా చీరను కట్టుకునే ట్రిక్‌ను చెబుతున్న వీరి అంతరం నేటి మానవిలో...
మృణాళిని తల్లిదండ్రులిద్దరూ ప్రైవేట్ డాక్టర్స్. మధ్యతరగతి కుటుంబం. తల్లికి సంగీత జ్ఞానం కూడా ఉండేది. మొదటి నుంచి పుస్తకాలు బాగా చదవడమన్నా, సినిమాలు చూడడమన్నా మృణాళినికి చాలా ఇష్టం. అలాంటి అందమైన కుటుంబ వ్యవస్థలో ఆమె పెరిగారు. టాప్ స్టూడెంట్‌గా ఉండి కూడా సైన్స్‌కి బదులుగా కామర్స్ ఎంచుకున్నారు. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచినప్పటికీ ఇదే తనలో ఉన్నటువంటి కళకు, సృజనాత్మకతకు పదునుపెట్టిందంటున్నారు. అంతేకాదు తనను ఓ అడ్మినిస్ట్రేటివ్‌గా ఎదగడానికి దోహద పడిందని అన్నారు. ''కష్టపడుతున్నానని అందరూ అంటున్నారు, కానీ ఈ కష్టపడే తత్వం నాకు నా తల్లిదండ్రుల నుండి వచ్చింది' అంటారు ఆమె.
సిక్స్ యార్డ్స్ ప్లస్ ఆవిర్భావం
ఏదో సాధించాలని తపన తనలో బాగా ఉండేది. బీకాం చేసి ఎంబీఏ పూర్తి చేశారు. ఫ్రెంచ్ భాషను కూడా నేర్చుకున్నారు. ఎంబీఏ పూర్తి చేశాక 16 ఏండ్లు కొన్ని ఎన్జీఓలలో పనిచేశారు. అక్కడ చేనేత కళాకారుల నేత పనితనాన్ని బాగా గమనించేవారు. చీరలపై వాళ్ళు చేస్తున్న వర్క్‌ని చూసి ఇంప్రెస్ అయ్యారు. అలా చీరనే తనకు ఆధారమయింది. ఆ చీరనే తన కెరీర్‌గా మలచుకున్నారు. అందులోంచే ఆవిర్భవించిందే సిక్స్ యార్డ్స్ ప్లస్. నేడు హైదరబాద్, శ్రీనగర్ కాలనీలో వైభవోపేతంగా కొలువుదీరి ఉంది.
కళాకారులకు గుర్తింపు కోసం...
చేనేత రంగానికి, చేనేత కార్మికులకు, కళాకారులకు గుర్తింపు రావాలి. తమకంటూ ఒక విలువ లభించాలి వాళ్ళ పనితనానికి, నైపుణ్యానికి సమాజంలో ఒక మహోన్నతమైన స్థానం లభించాలి. అలా జరగాలంటే ముందు చీర వైభవాన్ని తిరిగి తీసుకురావాలి. ఆధునిక మహిళ చీర కట్టును ఆస్వాదించగలగాలి. చీర కట్టుకోవడంలో మెళకువలు తెలుసుకోవాలి. ఆ దిశగా చేనేత కార్మికులకు తోడుగా సాగుతుంది సిక్స్ యార్డ్స్ ప్లస్. చేనేత కళాకారుల పనితనం కేవలం వారి కళ మాత్రమే కాదు. అది వాళ్ళ జీవన భృతి.
సిక్స్ యార్డ్స్ ప్లస్ ఏం చేస్తుంది..?
కేవలం 11 వేల రూపాయలతో, కొన్ని జాకెట్ ముక్కలతో మృణాళిని పూర్తి ఆత్మవిశ్వాసంతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. భర్త సూర్య, పిల్లలు, తల్లిదండ్రుల అందరి ప్రోద్బలంతో నిర్దిష్టమైన సమయాన్ని పెట్టుకొని అంచలంచలుగా కష్టపడుతూ ఈరోజు 12 రాష్ట్రాలలో చేనేత కళాకారులతో పని చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలలో 65శాతం మహిళలు, 80శాతం రూరల్ ప్రాంత చేనేత కళాకారులు ఇందులో పనిచేయడం తనకు చాలా గర్వకారణంగా ఉందని ఆమె అంటున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి గొల్లభామ, గోవా నుంచి కుంది, బీహార్ నుంచి బావన్ బూటీ శారీస్, హంబుల్ వీవింగ్ పద్దతిలో తక్కువ ధరలోనే హాయిగా కట్టుకునే విధంగా చీరలు రూపొందిస్తున్నారు.
చేనేత మన వారసత్వ సంపద
శ్రీనగర్ ఆఫీసులో కేవలం ఐదుగురు మాత్రమే ఉండి పని చేస్తారు. తనతో పాటుగా మరో నలుగురు ఆపరేషన్ సిస్టం, అడ్మిన్ ప్రొడక్షన్ అండ్ సేల్ వారు ఉంటారు. మిగిలిన వారంతా లూమ్స్ మీద పని చేస్తుంటారు. వారికి అవసరమైన లూమ్స్, డిజైన్స్ అందజేస్తుంటారు. ఇలా మగ్గాల పైన 300 మంది కళాకారులు చేనేత వస్త్రాలను సిక్స్ యార్డ్స్ ప్లస్ కోసం నేస్తున్నారని ఆమె చెప్పారు.
చేనేతకు చేయూతగా...
చేనేత కార్మికులకు పని కల్పించడం, సాంకేతిక విజ్ఞానాన్ని అందించి దాని ద్వారా చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడం, టెక్నాలజీని చేనేతను కలపడం వల్ల మార్కెటింగ్ చేయడం చాలా సులభవుతోంది. చేనేత వస్త్రాలు ప్రజల వరకు సులభంగా అందుబాటులోకి రాగలుగుతాయి. వారి పనితనానికి తగినంత మూల్యం ఇవ్వడంలో ప్రజలకు అవగాహన ఏర్పడుతుంది. కళాకారుల నైపుణ్యానికి సరైన గుర్తింపు, వాళ్ళ జీవితానికి సరిపడినంత సంపద ఏర్పడడానికి అవకాశం కల్పిస్తోంది సిక్స్ యార్డ్స్ ప్లస్.
ఇన్స్టెంట్ చీరలు
''ఆధునిక అమ్మాయిలో కొందరికి చీర కట్టుకోవడం నిజంగా ఒక సవాలే. మార్కెట్లో సైజులవారిగా కుట్టినటువంటి చీరలు కొంతవరకు దొరుకుతాయి. కానీ నాకు ఇలాంటి అప్రోచ్ నచ్చదు. చీరలకు సైజులతో సంబంధం లేదు. కుట్టిన చీరలు సైజుతో సంబంధం లేకుండా ఎవ్వరైనా కేవలం అర నిమిషంలో కట్టుకునేలా అందరికోసం రూపొందించాం. రాప్, హుక్, ఫ్లిప్ ఇంతే కేవలం మూడే మూడు స్టెప్స్ అంతే..! మూడే మూడు చిటికల్లో చీర కట్టుకునే విధంగా ఇన్స్టెంట్ చీరను రూపొందించాను. పర్యావరణానికి హితాన్నిచ్చే కుట్టిన ఇన్స్టెంట్ సిక్స్ యార్డ్స్ ప్లస్ చీరలో ఒదిగిన సెలెబ్రిటీలు కూడా ఉన్నారు'' అంటున్నారు మృణాళిని.
అవార్డులు గుర్తింపు
మృణాళిని తాను చేస్తున్న ఈ సృజనాత్మక వ్యాపారానికి ఎన్నో అవార్డులు అందుకున్నారు. అందులో ఇనార్బిట్ పింక్ పవర్ అవార్డ్ - 2019, షీ ద పీపుల్ టీవీ డిజిటల్ మార్కెటింగ్ అవార్డ్ - 2021, కోవిడ్ వారియర్ అవార్డ్ - 2020, స్త్రీ శక్తి అవార్డ్ - 2022 ఉన్నాయి.
వి హబ్ సహకారంతో
''వి హబ్ మా ఆశయానికి తోడుగా నిలిచింది. చేనేతకు చేయూత అయిన మా సిక్స్ యార్డ్స్ ప్లస్ ఆశయం నెరవేరడానికి మార్కె టింగ్ చేయడంలో మాకు పూర్తి సహకారాన్ని అందించారు'' అంటున్నారు ఆమె. ''ముదితల్ నేర్వగరాదే ముద్దార నేర్పించినన్'' అంటారు. మహిళలు నేర్పే స్థాయికి ఎదిగారు. వాణిజ్య వేత్తలుగా ఎదిగి వ్యాపారరంగంలో తమదైన ముద్రను వేస్తున్నారు. తనకెంతో ఇష్టమైన చీరకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఇవ్వడానికి, చేనేత, కలంకారి కళాకారులకు సమాజం గుర్తించేలా తమ వంతు కృషిని అందిస్తూ మున్ముందుకు సాగుతున్నారు మృణాళిని.
అవసరాలకు అనుగుణంగా
''ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఒక ట్రక్కు లోడు బట్టలను భూమిలో పాతి పెడుతున్నారు. ఎంత వ్యర్ధం ఇది? అనవసరంగా ఇంత సరుకును వ్యర్థ పరుస్తున్నారు. దీని మీద అవగాహన రావాలి. వినియోగదారులకు ఎంత అవసరమో అంతే తయారు చేయాలి అనే ఆలోచన ఉండాలి. తయారు చేసేవారు, వినియోగదారులు ఇద్దరూ కూడా అవగాహన కలిగి ఉండాలి. ఎంత అవసరమో అంతవరకే చేయాలంటే డిమాండ్ ఎంతుందో అంతే సప్లై చేయాలి. అనవసరంగా గుట్టలు గుట్టలుగా వస్త్రాలను తయారు చేసి భూమిలో పాతి పెట్టడం వల్ల ఎంత ధనం, ఎంత మూలధనం నాశనం అవుతుంది. ఇది విన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఉత్పత్తి చేసేవారు, కొనేవారు ఇద్దరూ సంతోషంగా ఉండాలి. అంటే చేనేత వస్త్రాలకు ఆదరణ లభించాలి. బట్టలు ఎలా కొనాలి? చీరలు ఎలా వాడాలి? పాత వాటిని కూడా కొత్తవాటిగా ఎలా మలుచుకోవాలి అనే అవగాహన వినియోదారులకు కచ్చితంగా ఉండాలి'' అంటారు ఆమె.
ఆ పాత మధురాలు
అమ్మ పాత చీరను కొత్తగా మలచడం, అమ్మమ్మ చీరలకు కొత్త అందాలద్ది వాటి బోర్డర్స్‌తో మళ్ళీ తిరిగి కొత్త చీరలుగా మలచడం పాత చేనేత పట్టు, మరేదైనా వస్త్రాలకు తిరిగి పెయింటింగ్స్ వేయడం, కలంకారి డిజైన్లను వాటిలో అద్ది... అమ్మ, అమ్మమ్మల చీరల జ్ఞాపకాలను ఈనాటి తరానికి అందించేలాగా తిరిగి వాటికి కొత్త కళను తీసుకొస్తాం. బీరువాలలో దాచేసిన వాటిని మళ్ళీ ఈనాటి యువతకు న్యూ లుక్‌లో కనిపించేలాగా పాత చీరలను కొత్తగా మలచడం మేము చేస్తున్నటువంటి మరో చక్కనైనటువంటి కార్యక్రమం. ఇదంతా చీరంటే ఉన్న ఇష్టం వల్ల చేస్తున్నాను. దీనినే వృత్తిగా, ప్రవృత్తిగా ఎంచుకొని ఎంతో శ్రమతో ఒక్కో అడుగు వేస్తూ ఈ రోజు ఈ స్థాయికి వచ్చి 12 రాష్ట్రాలలో ఉన్న చేనేత కళాకారులకు చేయూత నివ్వగలిగాం. వారితో కలిసి నడుస్తున్నాం. మొదట్లో కష్టానష్టాలను, ఎన్నో సవాళన్లు ఎదుర్కొన్నాను. ''చీరలమ్ముకుంటావా.. ఏంటి?'' అంటూ కొందరు చిన్నచూపు చూశారు. ప్రతి సవాలును ఒక పరీక్షలా, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు వచ్చినటువంటి ఒక అవకాశంగా భావించుకుంటూ ముందుకు నడిచాను.
- రమాదేవి కులకర్ణి, 8985613123