Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుల్ఫీషా ఫాతిమా... ఓ విద్యార్థి. గత మూడేండ్లుగా అన్యాయంగా జైల్లో మగ్గుతుంది. ఆమెతో పాటు ఎంతో మంది ముస్లిం యువత జైలు జీవితం అనుభవిస్తున్నారు. ఆమె బెయిల్‌ను కోర్టు ఆమోదించిన ప్రతిసారీ కొత్త అభియోగాలు మోపుబడుతూనే ఉన్నాయి. పోలీసులు ఆమె జైలు శిక్షను పొడిగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆమె బెయిల్ పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. అసలు ఆమె జైలు శిక్ష ఎందుకు అనుభవిస్తుంది.? పోలీసులకు ఆమెపై అంత కోపం ఎందుకు..? ఘోరమైన తప్పులు చేసిన వారికి సైతం క్షణాల్లో బెయిల్ దొరికే మన దేశంలో ఈ అమ్మాయికి మాత్రం ఎందుకు రావడం లేదు..? దాని వెనక ఉన్న కుట్ర ఏమిటో తెలుసుకుందాం...
''అన్యాయం జరిగినా మౌనంగా ఉంటే బతుకుతారు. అలా ఉండలేక మీరు వారిని (ప్రభుత్వాన్ని) విమర్శిస్తే, వారు మీకు జైలు ద్వారాలు తెరుస్తారు'' అంటున్నారు గుల్ఫిషా ఫాతిమా తండ్రి తస్నీఫ్ హుస్సేన్. నిజమే మరి... అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రతివారు ఇప్పుడు దేశద్రోహులైపోతున్నారు. అలాంటి ద్రోహమే చేసింది ఫాతిమా. ఈ నెల ఏప్రిల్ 9న ఫాతిమా మూడేండ్ల జైలు శిక్షను పూర్తి చేసుకుంది. 2020 ప్రారంభంలో ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్ ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఆ సంఘటనలో ఢిల్లీ పోలీసులు ఆమెను (ఎఫ్ఐఆర్ 48/2020 ప్రకారం) అరెస్టు చేశారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని పలు సెక్షన్ల కింద ఆ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై దాడికి పాల్పడ్డారు.
నిరసన తెలిపినందుకు
సీఏఏ డిసెంబర్ 11, 2019న అమలులోకి వచ్చినప్పటికీ చట్టాన్ని అమలు చేయడానికి వీలు కల్పించే నియమాలు ఇంకా రూపొందించబడలేదు. నిబంధనలను రూపొందించకుండా చట్టం అమలు చేయబడదు. డిసెంబర్ 2019లో చట్టం అమలులోకి వచ్చినప్పటి నుండి ఈ ఏడాది జనవరిలో పార్లమెంటరీ కమిటీల ద్వారా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏడవసారి పొడిగింపును మంజూరు చేసింది. ఈసారి మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఇలా ఆ చట్టం ఇంకా పూర్తి స్థాయిలో అమలు కానప్పటికీ ఫాతిమా వంటి చాలా మంది ముస్లిం రాజకీయ ఖైదీలు ''మతపరంగా వివక్షత'' అని పిలిచే చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేసినందుకు జైళ్లలో మగ్గుతున్నారు.
ఢిల్లీ పోలీసుల కుట్ర
మే 13, 2020న ఢిల్లీ కోర్టు ఈ కేసులో ఫాతిమాకు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఆమెను జైలుకు పంపించాలని నిర్ణయించుకున్న పోలీసులు ఆమెపై మరో ఎఫ్ఐఆర్ (ఎఫ్ఐఆర్ 59/2020) నమోదు చేశారు. రెండవ ఎఫ్ఐఆర్లో పోలీసులు ఆమెపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం UAPA లోని వివిధ నిబంధనల కింద అభియోగాలు మోపారు. షార్జీల్ ఇమామ్, ఉమర్ ఖలీద్, షిఫా ఉర్ రెహ్మాన్ ఖాన్, నటాషా నర్వాల్, దేవాంగనా కలితా, ఇష్రత్ జహాన్, సఫోర్ హైదర్, సఫోర్ హైదర్, సఫోర్ హైదర్, షార్జీల్ ఇమామ్, ఉమర్ ఖలీద్, గుల్ఫీషా ఫాతిమా పన్నిన ముందస్తు ప్రణాళిక ఫలితంగానే ఢిల్లీ అల్లర్లు జరిగినట్లు ఎఫ్ఐఆర్ 59/2020 ఆరోపించింది.
పోలీసులను రెచ్చగొట్టారని
ఫిబ్రవరి 22 నుండి 24 వరకు ఢిల్లీలోని జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలోని 66 ఫుట్ రోడ్లో జరిగిన నిరసన ప్రదర్శనలో 31 ఏండ్ల కార్యకర్త అయిన ఫాతిమా హాజరయింది పోలీసులు ఆరోపిస్తూ ఆమెపై రెండు ఎఫ్ఐఆర్లు, తీవ్రమైన అభియోగాలు మోపారు. సీఏఏ, ఎన్ఆర్సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)కి వ్యతిరేకంగా కుట్ర పన్ని ఆమె స్థానిక ముస్లింలను రెచ్చగొడుతుందని పోలీసుల అభియోగం. పోలీసుల ప్రకారం సీఏఏ, ఎన్ఆర్సీ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసనల పేరుతో నిరసన ప్రదేశానికి సమీపంలో ఫాతిమా ఓ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఎఫ్ఐఆర్లో ఉమర్ ఖలీద్, నటాషా, దేవాంగనతో పాటు ఇంకా తన సహచరులతో కలిసి అల్లర్లను ప్లాన్ చేసింది. స్థానికులను హింస వైపు ప్రేరేపిస్తుందని, పోలీసులపై రాళ్లు, లాఠీలు, తుపాకీలను ఉపయోగించారని, పోలీసు లను రెచ్చగొట్టే వాతావరణాన్ని సృష్టించారని ఎఫ్ఐఆర్ ఆరోపించింది.
గందరగోళం సృష్టిస్తుందని
ఏప్రిల్ 2020లో ఫాతిమాను అరెస్టు చేసిన తర్వాత ఆమె కుటుంబం జూన్ 22, 2020న అరెస్టును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేసింది. కానీ న్యాయమూర్తులు విపిన్ సంఘీ, రజనీష్ భట్నాగర్‌లతో కూడిన హైకోర్టు బెంచ్ ఆ అభ్యర్థనను కొట్టివేసింది. జూన్ 25, 2020 వరకు ఆమెను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని అదనపు సెషన్స్ జడ్జి తీసుకున్న నిర్ణయం సరైనదేనని, ఆమెను రిమాండ్ చేయకపోతే ''ప్రజల్లో గందరగోళం, అల్లర్లు'' ఏర్పడతాయని కోర్టు పేర్కొంది. మొత్తం మీద ఆమెపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఆమె తీహార్ జైలులో ఉన్నప్పుడు చివరిది (ఎఫ్ఐఆర్ 83/2020) దాఖలు చేయబడింది. జూలై 20, 2020న బెయిల్ పొందింది.
తల్లి మానసిక క్షోభ
కోర్టులలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ విచారణలకు హాజరైన ఆమె తండ్రి ఈ ట్రయల్స్‌లో హాజరుకావడానికి సమయపాలన పాటించారు. ఎందుకంటే అవి కూడా అతనికి తన కుమార్తెను కలిసే అవకాశాలు. ''నేను కోర్టు నుండి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకు చెప్పడానికి నా వద్ద ఎటువంటి శుభవార్త లేదు. ఫాతిమా తల్లి ఏడుస్తుంది. బిడ్డను అరెస్టు చేసినందుకు ఆమె మానసిక క్షోభకు గురైంది. మా కుమార్తె దేశం కోసం ఇంత బాగా చేయగలిగినప్పుడు ఆమెను పంజరంలో ఉంచడం తల్లిదండ్రులుగా మాకు అంత సులభం కాదు'' అంటూ ఆమె తండ్రి పంచుకున్నారు. తన పేరు చెప్పుకోవడానికి భయపడిన ఫాతిమా స్నేహితురాలు మాట్లాడుతూ 'ఆమె ఎల్లప్పుడూ సహాయం చేసే మహిళ. ఆమె హృదయం అవసరమైన వ్యక్తుల కోసం తపిస్తుంది. జ్ఞానాన్ని పొందేందుకు చదువుకుంది. వీలైనంత వరకు ప్రజలకు సహాయం చేయడానికి తన గొంతు విప్పుతుంది. తన అవసరం ఉన్న ప్రతి ఒక్కరికీ ఆమె స్నేహితురాలు'' అంటూ పంచుకుంది.
పదే పదే నిరాకరిస్తూనే ఉన్నారు
అక్టోబర్ 2020లో ఆమె తీహార్‌లో 180 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత పోలీసులు 90 రోజుల వ్యవధిలో ఆమెపై ఎటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేయనందున ఆమె Cr సెక్షన్ 167(2) ప్రకారం బెయిల్‌పై విడుదల చేయాలని అభ్యర్థించింది. అయితే ఆమె దరఖాస్తులో ఎలాంటి మెరిట్ లేదని కోర్టు కొట్టివేసింది. నవంబర్ 2020లో సెషన్స్ కోర్టు భారతీయ శిక్షాస్మృతిలోని ఎఫ్ఐఆర్ 50లో హత్య, హత్యాయత్నం, చట్టవ్యతిరేకమైన సమావేశాలు, అల్లర్లు, ఆయుధాల చట్టంలోని ఇతర సంబంధిత సెక్షన్లు, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే చట్టంలోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ట్రయల్ కోర్టు మార్చి 2022లో ఆమెకు బెయిల్ నిరాకరించడంతో ఆమె ఢిల్లీ హైకోర్టులో అప్పీలు చేసింది. ఈ అప్పీల్‌పై తీర్పును జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్, జస్టిస్ రజనీష్ భట్నాగర్‌లతో కూడిన ధర్మాసనం రిజర్వు చేసింది. ఆమె బెయిల్‌తో పాటు తస్లీమ్ అహ్మద్ బెయిల్ పిటిషన్లను అదనపు సెషన్స్ జడ్జి అమితాబ్ రావత్ తిరస్కరించారు. ఛార్జిషీట్, దానితో పాటు ఉన్న పత్రాల దృష్ట్యా నిందితులపై ఆరోపణలు నిజమే అని అన్నారు.
ఆమెకు స్వేచ్ఛనిద్దాం
ఇటీవల ఫిబ్రవరి 2న హైకోర్టు ముందు ఆమె బెయిల్ విచారణ సందర్భంగా ఆమె న్యాయవాది సుశీల్ బజాజ్ 'ఆమెకు మనం ఏమీ ఇవ్వలేము. కనీసం స్వేచ్ఛను తిరిగి ఇవ్వగలం' అని అభ్యర్థించారు. ఇక్కడ కూడా ప్రత్యేక పబ్లిక్ ప్రాసి క్యూటర్ అమిత్ ప్రసాద్ ద్వారా ఆమె బెయిల్‌ను వ్యతిరేకిస్తూ... నిరసనలు చేయ డానికి ఫాతిమా వాట్సాప్ గ్రూప్‌లో భాగమయిందని ఢిల్లీ పోలీసులు సమర్థిం చారు. ప్రతిస్పందనగా ఆమె న్యాయవాది, ఫాతిమా కేవలం నిరసన కోసం వాట్సాప్ గ్రూప్ 'వారియర్స్' ను సృష్టించిందని, ఇందులో నేరం ఏమీ లేదని సమ ర్పించారు. ఈ కేసులో వాదనలు ముగిసిన తర్వాత ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై న్యాయమూర్తులు సిద్ధార్థ్ మృదుల్, రజనీష్ భట్నాగర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వు లను రిజర్వ్ చేసింది.
మరింత బలంగా తయారయింది
ఎంబీఏ గ్రాడ్యుయేట్, విద్యార్థి కార్యకర్త, చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న ఫాతిమా తాను అరెస్టు కావడానికి కొన్ని నెలల ముందు చరిత్రలో డాక్టరేట్ చేయాలనుకుంటున్నట్లు తన కుటుంబంతో పంచుకుంది. 'ఫాతిమా జైలు జీవితం ప్రారంభించి మూడేండ్లు గడిచిపోయింది. అయినా మునుపెన్నడూ లేనంత బలంగా, ధైర్యవంతు రాలిగా ఉంది. భారతీయ పౌరురాలిగా తన హక్కుల గురించి మరింత అవగాహన పెంచుకుంది. ధైర్యం, దృఢత్వానికి ప్రతీకగా నిలిచింది. ఆమె తన పేరుకు ముందు డాక్టర్ అనే అక్షరాలు ఉండాలని కోరుకుంది. ఆమె ఎప్పుడూ మమ్మల్ని గర్వపడేలా చేయాలని కోరుకునేది. ముస్లింల హక్కులను అర్థం చేసుకున్న బలమైన మహిళకు మేము తల్లిదండ్రులైనందకు గర్వపడుతున్నాము'' అని ఆమె తండ్రి చెప్పారు.
మానసికంగా వేధిస్తున్నారు
ఇంటికి దూరంగా ఉంటూ ఆమె జరుపుకుంటున్న మూడవ రంజాన్ మాసం ఇది. అరెస్టు చేయబడిన 53 మందిలో ఎక్కువ మంది ముస్లింలే. ప్రస్తుతం ఆమె క్రూరమైన UAPA చట్టం కింద నమోదైన అభియోగాల కారణంగా జైలులో ఉంది. సెప్టెంబర్ 2020లో ఆమె డిఫాల్ట్ బెయిల్ విచారణ సందర్భంగా అధికారుల చేతిలో తాను జైలులో వేధింపులను ఎదుర్కొన్నానని ఫిర్యాదు చేసింది. తీహార్ జైలులో ఉన్న ఖైదీలు తనపై మతపరమైన దూషణలు చేస్తున్నారని ఆమె కోర్టుకు తెలిపారు. ''వారు నన్ను చదువుకున్న ఉగ్రవాది అని పిలిచారు. నాపై మతపరమైన దూషణలు చేస్తున్నారు. నేను ఇక్కడ మానసిక వేధింపులను ఎదుర్కొంటున్నాను. ఈ వేధింపులను భరించలేక నన్ను నేను బాధపెట్టుకున్నట్లయితే దానికి జైలు అధికారులే బాధ్యత వహిస్తారు'' అని ఆమె కోర్టులో చెప్పింది.