Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రోజుల్లో ఫోన్ మనందరి జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయామనే ఫీలింగ్. మన కుటుంబంలోనే కాదు మన శరీరంలోనే ఒక భాగంగా మారిపోయింది. చివరకు నిత్యవసర వస్తువుగా కూడా మారిపోయింది. మనతో ఎవరూ లేరు అనే బాధ లేకుండా చేస్తుంది. ఎప్పుడు మన చుట్టూ నలుగురు వుండాలి అనుకునే వాళ్ళను సైతం ఫోన్ వుంటే చాలు అనుకునేలా మార్చివేసింది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఇప్పుడు అందరూ తమకు కావల్సిన సమాచారాన్ని ఫోన్లోనే వెదుక్కుంటున్నారు. గంటలు గంటలు దాంతోనే గడిపేస్తున్నారు. అయితే ఇది ఒక వ్యసనంగా మారిపోయి మన కుటుంబాల్లో అఘాధాలను కూడా సృష్టిస్తుంది. అలాంటి సమస్యతోనే ఇటీవల ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది సుజాత. ఆ వివరాలేంటో ఈ వారం ఐద్వా అదాలత్ ద్వారా తెలుసుకుందాం...
ఇంట్లో సుజాతతో పాటు భర్త వివేక్, పాప, బాబు, అత్తయ్య ఉంటారు. ఇంట్లో ఇతర సమస్యలేమీ లేవు. భర్తకు మంచి ఉద్యోగం. పిల్లలు కాలేజీకి వెళతారు. ఆమె కూడా ఉద్యోగం చేస్తుంది. అత్తయ్య వృద్ధాప్యం వల్ల ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళను చూసిన వారంతా భార్యాభర్తలిద్దరూ ఎలాంటి సమస్యలూ లేకుండా ఉద్యోగం చేసుకుంటున్నారు అనుకుంటారు. కానీ ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇక్కడ సమస్య ఫోన్.
సుజాతకు ఫోన్ చూడడం పెద్దగా ఇష్టం ఉండదు. ఎంత వరకు అవసరమో అంత వరకే దాన్ని ఉపయోగిస్తుంది. ఆమె దృష్టిలో ఫోన్ అంటే ఒక కమ్యూనికేషన్. ఇప్పుడు ఆమె సమస్య ఏమిటంటే వివేక్ తనతో ఒకే గదిలో ఉంటాడు కానీ అతను ఎప్పుడూ ఫోన్‌తోనే గడుపుతుంటాడు. అది ఎంతగా అంటే అందరూ కలిసి భోజనం చేస్తుంటే అతను మాత్రం తొందరగా తినేసి మళ్ళీ చేతిలో ఆ ఫోన్ పట్టుకదొని కూర్చుంటాడు. ఇక వేరే విషయాలేమీ పట్టించుకోడు.
ఎవరైనా బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చినా, వాళ్ళు తనతో మాట్లాడుతున్నా పట్టించుకోడు. ఇంట్లో ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చి చెప్పుకోవాలనుకుంటే వాళ్ళ గురించి కూడా పట్టించుకోడు. ఎప్పుడూ ఫోన్ చూస్తూనే ఉంటాడు. ఉదయం నిద్ర లేచింది మొదలు ఆఫీస్‌కు వెళ్ళే వరకు ఇదే పని. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నిద్రపోయే వరకు ఇదే వరస. ఇంట్లో వాళ్ళతో సరదాగా మాట్లాడాలి, వాళ్ళకు కాస్త సమయం కేటాయించాలనే ఆలోచనే అస్సలు ఉండదు.
ఒక సారి సుజాతకు ఆరోగ్యం బాగోక ఆస్పత్రిలో చేర్పించారు. చివరికి ఆస్పత్రికి వెళ్ళినా బెడ్‌పై ఉన్న భార్యను పట్టించుకోకుండా ఫోన్ చూస్తూ కూర్చున్నాడు. ఈ విధంగా వివేక్ భార్యా పిల్లలను పట్టించుకోకుండా ఫోన్‌కు బానిసైపోయాడు. ఆమె ఎప్పుడైనా ప్రేమతో పలకరించినా తెగ చిరాకు పడిపోతుంటాడు. అతను ఫోన్ చూసేటపుడు ఆమె ఏం మాట్లాడిగా గట్టిగా కేకలు వేస్తాడు. 'ఫోన్ చూస్తుంటే ఎందుకు డిస్ట్రబ్ చేస్తావు' అంటూ రంకెలు వేస్తాడు.
చివరకు ఒక రోజు సుజాత బాధ భరించలేక తెలిసిన వారు చెబితే ఐద్వా అదాలత్ వద్దకు వచ్చి 'మేమిద్దరం ప్రేమగా ఐదు నిమిషాలు మాట్లాడుకొని కొన్ని ఏండ్లు గడిచిపోయింది. నాకు నేను ఒంటరిగా మిగిలిపోయాననే బాధ కలుగుతుంది. నేను పడుకున్నా ఆయన మాత్రం ఫోన్ చూస్తూనే ఉంటాడు. నాకన్నా ఆయనకు ఫోనే ఎక్కువైపోయింది. ఇంట్లో పిల్లలతో కూడా సరిగా మాట్లాడడు. ఇక నేను అతని జీవితంలో ఉంటే ఏంటీ, పోతే ఏంటి. అందుకే నా భర్తతో విడాకులు తీసుకోవాలను కుంటున్నాను. నాకు కాస్త సాయం చేయండి'' అంటూ తన కష్టమంతా చెప్పుకుంటూ కన్నీరు కార్చింది.
ఇటువంటి చిన్న చిన్న విషయాలకు అంత పెద్ద నిర్ణయాలు తీసుకోవడం సరికాదని మేము అతని భర్తను పిలిచి 'మీ భార్య మీ నుండి విడాకులు తీసుకోవాలనుకుంటుంది' అన్నాము. కంగారు పడ్డ అతను 'అసలు ఏం జరిగింది, నేనేం చేశాను' అంటూ అత్రంగా అడిగాడు. 'మీకు ఫోన్ తప్ప మరో లోకం లేదు. ఇంట్లో భార్యను, పిల్లను పట్టించుకోవడం లేదు. అందుకే ఆమె ఒంటరిగా ఫీలవుతుంది. మీ నుండి విడిపోవాలనుకుంటుంది'' అన్నారు.
''నేను ఫోన్ చూడడం వల్ల నా భార్య ఇంతగా బాధ పడుతుందనే విషయం నాకు తెలియదు. నిజంగా నేను ఇప్పటి వరకు తన ఫీలింగ్స్ తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అయినా నేను ఇంట్లో ఉన్నప్పుడే ఫోన్ చూస్తాను. ఆఫీసుకు వెళితే ఫోన్ చూసే సమయమే ఉండదు. అందుకే ఇంట్లో చూస్తాను. అయితే దీని వల్ల నా భార్య ఇంతగా ఇబ్బంది పడుతుందని మీరు చెప్పిన తర్వాత తెలుసుకున్నాను. నిజంగానే ఫోన్ నాకు ఓ వ్యసనంగా మారిపోయింది.
పెండ్లి అయిన 25 ఏండ్ల తర్వాత నా భార్య నా నుండి విడాకులు అడుగుతుంది. అంటే నేను తనను ఎంతగా నిర్లక్ష్యం చేశానో అర్థమయింది. ఇన్నేండ్ల మా సంసారంలో నేను నా భార్యను ఒక్క మాట కూడా అనలేదు. తను కూడా నన్ను ఏమీ అనలేదు. ఇప్పటి వరకు మా మధ్య చిన్న గొడవ కూడా లేదు. అందరూ మమ్మల్ని చూసి భార్యాభర్తలంటే వీళ్ళలా అన్యోన్యంగా వుండాలి అనేవారు. అలాంటిది నా భార్య ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది. అది కూడా నాతో చెప్పకుండా ఇక్కడి వరకు వచ్చి మీతో చెప్పుకుంది. అంటే ఆమెను నేను ఎంతగా బాధపెట్టానో. ఎప్పుడూ నవ్వుతూ గలగలా మాట్లాడే ఆమె ఈ మధ్య కాలంలో కాస్త డల్‌గా ఉంటుంది. దానీకి కారణం నేనే అని అర్థం చేసుకోలేకపోయాను. తను అలా మూఢగాీ ఉంటే మూఢ్స్వింగ్ అనుకున్నాను.
నా తప్పును నేను సరి చేసుకుంటాను. ఎప్పుడూ పిల్లలకు చెబుతుండేవాడిని రోజుకు రెండు గంటలు మాత్రమే ఫోన్ చూడాలని. ఇప్పుడు నేను కూడా అదే ఫాలో అవుతాను. నాకు నా భార్య కంటే ఏదీ ఎక్కువ కాదు. ఆమె తర్వాతనే మిగిలినవి. ఇకపై సుజాతను ప్రేమగా చూసుకుంటాను. ఫోన్‌కు దూరంగా ఉంటాను. అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగిస్తాను' అని చెప్పాడు.
భర్తలో వచ్చిన ఈ మార్పుకు సుజాత కూడా సంతోషించింది. ఇద్దరూ కలిసి సంతోషంగా ఇంటికి వెళ్ళారు. అప్పటి నుండి ఇద్దరూ ఆనందగా ఉంటున్నారు. ఏదైనా ఫోన్లో ముఖ్యమైనవి చూడాలి అనుకుంటే ఇద్దరూ కలిసి చూస్తున్నారు. ఒక్క సుజాత జీవితంలోనే కాదు ఇటీవల కాలంలో ఎందరి జీవితాల్లోనే ఫోన్ ఒక శత్రువుగా మారిపోయింది. వ్యాసనం ఏదైనా సరే మనిషిని సర్వనాశనం చేస్తుంది. గతంలో వివాహేతన సంబంధాలు, జూదం, మద్యం మాత్రమ వ్యసనాలుగా ఉండేవి. ఆధునిక కాలంలో ఫోన్ కూడా ఓ వ్యసనంగా మారిపోయింది. ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలి. వీటిని ఎవరికి వారే స్వయంగా నియంత్రించుకోవాలి. అప్పుడు జీవితం సంతోషంగా ఉంటుంది.
- వరలక్ష్మి, 9948794051