Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె పుట్టింది ఓ సాధారణ కుటుంబం. అప్పటి వరకు ఇంట్లో ఎవరికీ పెద్దగా చదువుకోలేదు. తండ్రి టైలరింగ్ చేసి కుటుంబాన్ని పోషించేవారు. అలాంటి నేపథ్యం నుండి వచ్చిన ఆమె కసితో చదువుకున్నారు. పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించారు. సైన్స్ రంగంలో విస్తృతమైన పరిశోధన చేశారు. ప్రస్తుతం తెలంగాణ
రాష్ట్రంలో మొదటి మహిళా యూనివర్సిటీ కోఠి ఉమెన్స్కుమొదటి వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆమే ప్రొ.ఎం.విజ్జులత.యూనివర్సిటీ అభివృద్ధి కోసం పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్న ఆమెతో
మానవి ఇంటర్వ్యూ...
మొదటి మహిళా యూనివర్సిటీకి వీసీగా మీపై ఎలాంటి బాధ్యతలు ఉన్నాయనుకుంటున్నారు?
కోఠీ ఉమెన్స్ కాలేజీకి ఎంతో చరిత్ర వుంది. అలాంటి యూనివర్సిటీకి వీసీగా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పైగా ఈ కాలేజీతో నాకెంతో అనుబంధం ఉంది. ఇదే కాలేజీలో నేను డిగ్రీ చదువుకున్నాను. ఏడాదిన్నర పాటు ప్రిన్సిపల్‌గా కూడా చేశాను. కాబట్టి ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, పిల్లలకు ఎలాంటి సౌకర్యాలు అవసరమో తెలుసుకోగలిగాను. ఆ సమస్యలన్నీంటినీ పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నాము. కాలేజీ అభివృద్ధి కోసం ఏం చేయాలి అనే అవగాహన కూడా ఉంది. వీసీ అయినందుకు వీటన్నింటినీ చేయగలను అనే దృఢ నమ్మకం వచ్చింది.
ఉన్నత విద్యలో అమ్మాయిల సంఖ్య ఎలా ఉందంటారు?
పీజీ వరకు అమ్మాయిల సంఖ్య బాగానే ఉంటుంది. అయితే పీహెచ్‌డీకి వచ్చే సరికి తగ్గిపోతున్నారు. పీజీ చేసి ఏదో ఒక ఉద్యోగం వస్తే చేసుకుందాం అనే ఆలోచనలో ఉంటున్నారు. అలాగే పెండ్లి, పిల్లలు, కుటుంబం అనే బంధాలు కూడా ఏర్పడతాయి. పెండ్లి తర్వాత కూడా ఉన్నత చదువు కొనసాగించి జీవితంలో స్థిరపడాలంటే ఉమ్మడి కుటుంబాలు ఉండాలి. పెద్ద వాళ్ళు ఇంట్లో ఉంటే పిల్లల్ని చూసుకుంటారు. మనం ఏదైనా చేయగలం. అలా కాకుండా నేనూ నా భర్త, నా పిల్లలు అనుకుంటే ఏమీ సాధించలేం. నేను పెండ్లి తర్వాతే పీహెచ్డీ చేశాను. ఆ సమయంలో మా అత్తయ్య నాకు చాలా సపోర్ట్ చేశారు.
యూనివర్సిటీ అభివృద్ధి కోసం మీ ప్రాణాళిక
మా దగ్గరకు వచ్చే అమ్మాయిల్లో 90శాతం మంది గ్రామీణ ప్రాంతం నుండి వస్తారు. వారి కుటుంబాలకు పెద్దగా ఆదాయం వుండదు. చాలా మంది ప్రభుత్వం ఇచ్చే స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి చదువుకుంటారు. డిగ్రీ చేరిన వారికి మేము ఒక ఇన్ట్రాక్షన్ క్లాసు పెడతాము. మీరు భవిష్యత్‌లో ఏం కావాలనుకుంటున్నారు అని అడిగితే చాలా మంది పోలీస్ కానిస్టేబుల్ అవుతాననో, టీచర్ని అవుతాననో, చిన్న ఉద్యోగం చూసుకుంటా ననో చెబుతుంటారు. ఇలా ఇక్కడికి వచ్చినపుడు వారి ఆలోచనలు పరిమితంగా ఉంటాయి. అదే డిగ్రీ తర్వాత అడిగితే ఐఏఎస్, ఐపీఎస్, బిజినెస్ చేద్దామను కుంటున్నా నని చెప్తారు. అంటే వారి ఆలోచనల్లో మార్పు రావడం గమనించాము. ఇలాంటి పిల్లలకు అవసరమైన సహకారం ఇస్తే జీవితంలో ఉన్నతంగా స్థిరపడతారు. కాబట్టి అలాంటి వారికి అవసరమైన కొత్త కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని అనుకుంటున్నాము. ఇలాంటి కోర్సుల వల్ల అమ్మాయిలు మంచి ఉద్యోగాలు సంపాదించుకోగలరు. జీవితంలో మంచిగా స్థిరపడతారు. వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం కూడా ఉండదు.
అమ్మాయిల్లో చదువుపై ఆసక్తి పెంచడానికి చేస్తున్న ప్రయత్నం?
చాలా మంది ఇంజనీరింగ్ మాత్రమే మంచి చదువు అనుకుంటున్నారు. అలా కాకుండా బీఎస్సీలోనే మంచి కోర్సులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే యూపీఎస్సీ, గ్రూప్ కోచింగ్ కూడా ఇక్కడే ఏర్పాటు చేశాం. చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. డిగ్రీ తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళకు నేర్పిస్తున్నాం. దీనికోసమే నేను ప్రిన్సిపల్‌గా ఉన్నప్పుడు మెంటర్ మెంటీ అనే పద్ధతిని ప్రవేశపెట్టాం. అంటే ప్రతి 20 మంది అమ్మాయిలకు ఒక టీచర్ మెంటర్‌గా ఉంటారు. వాళ్ళకు ఎలాంటి సమస్య వచ్చినా అది ఆర్థికంగా కావొచ్చు, మానసికంగా కావొచ్చు. ఆ సమస్య పరిష్కరించే విధంగా ఆ మెంటర్ ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో టీచర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అమ్మాయిలు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చదువుకునేలా ప్రయత్నం చేస్తున్నాము.
మీ కుటుంబం గురించి చెబుతారా..?
నేను పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంతా హైదరాబాద్‌లోనే. అమ్మ పారిజాత, గృహిణి. నాన్న రామేశ్వరావు, టైలరింగ్ చేసేవారు. మేము నలుగురం పిల్లలం. నాకు ఒక అక్క, ఇద్దరు తమ్ముళ్ళు. అమ్మ పీయూసీ వరకు చదువుకున్నారు. తనకు మేము బాగా చదువుకోవాలని కోరిక. మా అక్క రూపలత ఎన్ఐఎల్లో పీహెచ్డీ చేసి, యుఎస్ వెళ్ళి పీడీఎఫ్ చేసింది. అక్కడే స్థిరపడింది. నేను రాంనగర్‌లోని సెయింట్ పాయిస్ స్కూల్లో చదువుకున్నాను. డిగ్రీ కోఠీ ఉమెన్స్ కాలేజీలో చేశాను. పీజీ, పీహెచ్డీ సెంట్రల్ యూనివర్సిటీలో పూర్తి చేశాను. 1998లో నా పీహెచ్డీ సబ్మిట్ చేశాను.
పెండ్లి తర్వాత ప్రోత్సాహం ఎలా ఉంది..?
నెట్ కూడా క్వాలిఫై కావడంతో వెంటనే జాబ్ వచ్చింది. మా అత్తమ్మ నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అంటూ నా చదువులో, ఉద్యోగంలో ఎంతో ప్రోత్సహించారు. మా అత్తయ్య, మామయ్య ఏం చదువుకోలేదు. కానీ నన్ను బాగా ప్రోత్సహించేవారు. ఇంటి నుండి బయటకు వెళితే పిల్లల గురించి అస్సలు ఆలోచించేదాన్ని కాదు. వాళ్ళు చూసుకున్నారు కాబట్టి నేను ఇదంతా చేయగలిగాను. అలాగే మా అమ్మ కూడా చాలా ప్రోత్సహించేది. బాగా చదువుకోవాలి అని ఎప్పుడూ చెబుతుండేది. తనకు నన్ను పీడీఎఫ్ కూడా చేయమంది. కానీ చేయలేకపోయాను. మా వారు ఎంబీఏ చేశారు. మాకు కల్పన అనే స్టూడియో ఉంది. అది ఆయనే చూసుకుం టారు. వాళ్ళు కూడా నలుగురు అన్నదమ్ములు. అందరం కలిసే వుంటాము.
అధ్యాపకురాలుగా మీ ప్రయాణం..?
1999 డిసెంబర్లో నిజాం కాలేజీలో నా మొదటి పోస్టింగ్. అక్కడే 15 ఏండ్లు చేశాను. అయితే మొదట్లో నాపని కేవలం టీచింగ్ మాత్రమే. నాకైతే ఇంకా ఏదో చేయాలని ఉండేది. ఏదైనా అంశం తీసుకుని రీసెర్చ్ చేద్దామనుకున్నాను. కానీ అక్కడ సరైన రీసెర్చ్ ల్యాబ్ లేదు. దాంతో ల్యాబ్ లేకపోయిన రీసెర్చ్ ఎలా చేయవచ్చు అనే దాని గురించి ముందు రీసెర్చ్ చేశాను. అలా నా రూంలోనే నా డబ్బుతో ఓ కంప్యూటర్ కొనుక్కొని పెట్టుకున్నాను. నాకున్న అవగాహన మేరకు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని వర్క్ ప్రారంభిచాను. మొదటి సారి 2008లో ఐదుల లక్షల రూపాయలతో క్యాన్సర్‌పై యూజీసీ ప్రాజెక్ట్ ఒకటి తయారు చేసి పంపిచాను.
మరి అది సక్సెస్ అయ్యిందా..?
యూజీసీ వారు ఢిల్లీకి పిలిచి ఇంటర్వ్యూ చేశారు. సాధారణంగా అందరూ 20 లక్షల ప్రాజెక్ట్ పెడతారు. ఇంత తక్కువకు ఎందుకు రాశారని అడిగారు. ఇది చేయడం నాకు చాలా అవసరం. ఎక్కువ పెడితే అవకాశం వస్తుందో లేదో అని ఐదు లక్షలు పెట్టాను. దీంతోనే నా ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చెప్పా. అలాగే అందరూ ఓ రీసెర్చ్ అసిస్టెంట్‌ని కూడా అడుగుతారు. నేను అది కూడా అడగలేదు. నేనే చేద్దామనుకుంటున్నా అని చెప్పాను. వెంటనే వాళ్ళు ఓకే చెప్పి సంతకం చేశారు. అది చేస్తూనే హెచ్ఐవీపై మరో ప్రాజెక్ట్‌కి అప్లయి చేశాను. అది కూడా ఓకే అయింది. అప్పటి నుండి పీహెచ్‌డి స్కాలర్స్ కూడా రావడం మొదలయింది. ఇప్పటి వరకు 13 మంది నా దగ్గర పీహెచ్డీ పూర్తి చేశారు. ఇంకా 8 మంది స్కాలర్స్ ఉన్నారు. 2013లో బదిలీపై ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాను. ఇప్పటి వరకు 7 రీసెర్చ్ ప్రాజెక్టులు పూర్తి చేశాను. 108 ఆర్టికల్స్ పబ్లిష్ చేశాను. నా దగ్గర చేసే స్కాలర్స్ కూడా చాలా కష్టపడతారు. ఇక్కడ కూడా నా రూంలోనే ఒక ల్యాబ్ ఉంటుంది. ఇటీవల కోవిడ్‌పైన కూడా ఒక ప్రాజెక్ట్ చేశాము.
సైన్స్‌లో అమ్మాయిల సంఖ్య ఎలా ఉందంటారు?
ప్రాథమిక స్థాయిలో చూస్తే బాగా ఉన్నారు. డిగ్రీ, పీజీ వరకు కూడా పెద్దగా సమస్య లేదు. అయితే పీహెచ్‌డీకి వచ్చే సరికి సంఖ్య తగ్గిపోతుంది. దానికి కారణం ఖర్చు ఒకటైతే, పెండ్లి, పిల్లలు, బాధ్యలు పెరుగుతాయి. అయితే పీజీ అయిపోయిన వెంటనే నెట్ క్వాలిఫై అయితే వాళ్ళకు ఆర్థికంగా ఎలాంటి సమస్య ఉండదు. పీహెచ్డీ చేస్తే మన రాష్ట్రంలోనే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. చేయగలిగే శక్తి ఉన్నా అవగాహన లేకపోవడంతో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అలాంటి అవగాహన కల్పించాలనే మేమే ఎన్నో సెమినార్లు ఏర్పాటు చేస్తున్నాము. జీవితంలో ఉన్నతంగా స్థిరపడటానికి, సొంతకాళ్ళపై నిలబడటానికి మహిళలకు అవసరమైన అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాము.
మహిళా సాధికారత గురించి మీరేంటారు..?
నా దృష్టిలో మహిళలు ఎప్పుడో సాధికారత సాధించారు. ఎందుకంటే మహిళలు చేసినన్ని పనులు మగవాళ్ళు చేయలేరు. అయితే ఒకరి కింద పని చేయకుండా మనమే ఏదైనా చేయాలి, రిస్క్ తీసుకోనైనా అభివృద్ధి చెందాలి అనే ధైర్యం వాళ్ళలో రావాలి. ముఖ్యం గా మహిళలు పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందడానికి అవసరమైన కోర్సులు యూనివ ర్సిటీలో ప్రవేశపెట్టాలి. అందుకు అనుగుణంగా సిలబస్‌లో కూడా మార్పులు తీసుకురావాలి. అలాగే ప్రభుత్వం ఫండ్స్ ఇస్తే యూనివర్సిటీలో పెద్ద హాస్టల్ ఏర్పాటు చేయాలని వుంది. మహిళల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం కోఠీ ఉమెన్స్ కాలేజీ యూనివర్సిటీ చేసింది. కాబట్టి ప్రభుత్వ సహకారంతో యూనివర్సిటీని మరింత అభివృద్ధి చేస్తాము.
- ఇంటర్వ్యూ : సలీమా
- ఫొటోలు : పిప్పళ్ల వెంకటేశ్