Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతిభా తప్లియాల్... 41 ఏండ్ల సాధారణ గృహిణి. ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో సీనియర్ మహిళల విభాగంలో స్వర్ణం సాధించింది. ఇందులో విశేషమేమిటంటే ఉత్తరాఖండ్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళ ఈమె. అంతేకాదు అనారోగ్యం ఉన్నప్పటికీ కేవలం 16 నెలలు శిక్షణ తీసుకుని ఛాంపియన్ బాడీబిల్డర్‌గా నిలిచింది. అదెలా సాధ్యమయిందో మానవిలో తెలుసుకుందాం...
పౌరీలోని యమకేశ్వర్ బ్లాక్‌కు చెందిన ప్రతిభ గత ఏడాది కేవలం మూడున్నర నెలల శిక్షణ తీసుకుంది. తన జీవితంలో తొలిసారిగా బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొంది. సిక్కింలో జరిగిన జాతీయ ఛాంపియన్ షిప్లో నాలుగో స్థానంలో నిలిచింది. మహిళా బాడీ బిల్డింగ్ లో దృవతారలా మెరిసిపోయింది. అయితే ఆమె ఈ బాట లో నడవడానికి కారణం ఆమె అనారోగ్యమే. 2008లో రెండో కొడుకు పుట్టాక ఆమె ఆరోగ్యం కాస్త క్షీణించింది. శరీరం కొద్ది శ్రమకే చాలా అలసిపోయేది. బీపీ కూడా తగ్గడం ప్రారంభించింది. ఇద్దరు చిన్న పిల్లల సంరక్షణ, ఇంట్లో పని వల్లే ఇలా జరుగుతోందని అనుకునేది. అయితే ఈ సమస్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది.
ప్రమాద స్థాయిలో థైరాయిడ్
ప్రతిభ భర్త భూపేష్ థప్లియాల్ డెహ్రాడూన్‌లో బట్టల వ్యాపారం చేస్తున్నాడు. అతనికి రెండు దుకాణాలు ఉన్నాయి. పెండ్లి తర్వాత ప్రతిభ భర్త వ్యాపారంలో సహాయం చేసేది. మహిళల బట్టల దుకాణాన్ని ఆమే చూసుకునేది. 2014 వరకు ప్రతిభ ఇల్లు, వ్యాపారం, పిల్లల బాధ్యతలతో పాటు అలసట, లోబీపీతో పోరాడుతూనే ఉంది. చివరకు తట్టుకోలేక డాక్టర్ దగ్గరకు వెళితే థైరాయిడ్ ప్రమాదకర స్థాయికి పెరిగిపోయిందని తెలిసింది. 5 పాయింట్లకు మించకూడని థైరాయిడ్ ఆమెకు 50 పాయింట్లకు చేరుకుంది. దాంతో వెంటనే భారీ డోసు మందులు తీసుకోవడం ప్రారంభించింది. థైరాయిడ్‌ను మందులతో అదుపు చేయవచ్చని అనుకుంది. కానీ పెరుగుతున్న తన బరువును నియంత్రించలేకపోయింది. 2014 - 2018 మధ్య ఆమె బరువు 60 కిలోల నుండి 85 కిలోలకు పెరిగింది. దాంతో డాక్టర్ సలహా మేరకు జిమ్‌లో చేరింది. ఆమెతో పాటు భర్త భూపేష్ కూడా జిమ్‌లో చేరాడు.
ఆటల్లో చురుగ్గా...
ప్రతిభ రిషికేశ్‌లో చదువుకుంది, అక్కడే పెరిగింది. హిందీలో ఎంఏ చేసిన ఆమె చదువుతో పాటు క్రీడల్లో కూడా చాలా చురుగ్గా ఉండేది. చదువుకునే రోజుల్లో వాలీబాల్‌లో ఉత్తరాఖండ్‌కు కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించింది. నార్త్ జోన్లో ఐదుసార్లు ఆడింది. అంతే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో నాలుగు సార్లు క్రికెట్ ఆడింది. కాబట్టి జిమ్‌లో చెమటలు పట్టడం ఆమెకు కొత్త విషయం కాదు. అయితే ఊహించని విధంగా కేవలం 3-4 నెలల్లో ఆమె బరువు 85 కిలోల నుండి 60 కిలోలకు తగ్గింది.
బాడీబిల్డర్‌కు అనుకూలంగా...
కరోనా తర్వాత 2021 జూన్‌లో థాప్లియాల్ దంపతులు మళ్లీ జిమ్‌లో చేరినపుడు ప్రతిభ తన శరీరాన్ని బాడీబిల్డింగ్కు అనుగుణంగా మార్చుకో వచ్చని గమనించిన భూపేష్ ''బాడీబిల్డర్‌గా మారే అవకాశాలు ఆమె శరీరంలో కనిపించాయి. బరువు తగ్గించుకునే శిక్షణ ప్రారంభించి నప్పుడు ఆ ఫలితాలు కండరా లపై వెంటనే కనిపిస్తాయి. ఆమె ఇంకొంచెం శిక్షణ తీసుకుంటే సరి పోతుంది'' అని భావించాను అన్నాడు. అదే ఏడాది నవంబర్‌లో బాడీ బిల్డింగ్ కోసం భూపేష్ తన భార్యను ఉత్తరాఖండ్ బాడీ బిల్డర్ల సంస్థలో ఉన్న జిమ్‌లో చేర్పించాడు. అయితే మార్చి 2022లో జరగనున్న జాతీయ ఛాంపియన్ షిప్‌ల కోసం ప్రతిభను తయారు చేయడం కంటే అతను చేసిన సప్లిమెంట్లను విక్రయించడంపై తన కోచ్ ప్రాధాన్యం ఉందని తర్వాత అతను గ్రహించాడు.
దుస్తులతో ఇబ్బంది పడింది
భర్త పర్యవేక్షణలో ఛాంపియన్‌షిప్‌కు సిద్ధమవుతున్న ప్పటికీ ఆమెకు ఎందుకో కాస్త సంకోచం ఉంది. అది దుస్తుల గురించి. నిజానికి బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో టూ-పీస్ బికినీలో ప్రదర్శన ఇవ్వాలి. టీషర్ట్, షార్ట్స్ వరకు ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ టూ-పీస్ బికినీ ధరించడానికే ఇబ్బంది పడింది. అయితే అది అసలు సమస్య కాదని భర్త ఆమెకు హామీ ఇచ్చారు. భర్త ఇస్తున్న నిరంతర ప్రోత్సాహంతో ఆమెలోని సంకోచం మాయమైపోయింది.
మంచి గుర్తింపు వచ్చింది
మూడున్నర నెలల బాడీ బిల్డింగ్ కెరీర్లో ఎన్నో ఏండ్లగా ప్రాక్టీస్ చేస్తున్న మహిళలను వెనక్కి నెట్టి నాలుగో స్థానంలో నిలిచిందని భూపేష్ చెబుతున్నాడు. ఈ ఘనత వల్ల ఆమెకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. స్థానిక హోటల్ ప్రతిభ వన్-టైమ్ డైట్‌ను స్పాన్సర్ చేసింది. జిమ్ యజమాని ఆమెకు అనుకూలమైన సమయంలో జిమ్‌ను ఉపయోగించుకునే సౌకర్యాన్ని కల్పించారు. ఇలా వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకుని ఈ ఏడాది మార్చి 4-5 తేదీల్లో మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ స్వర్ణం సాధించి యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది.
బాడీబిల్డింగ్ ఖరీదైన క్రీడ
ఛాంపియన్‌షిప్‌కు నెల ముందు భూపేష్ తన దుకాణాన్ని మూసివేసాడు. ప్రతిభ శిక్షణ కోసం పూర్తి సమయం కేటాయించాడు. ఆమె శారీరక, మానసిక బలాన్ని చూసుకున్నాడు. వాస్తవానికి బాడీబిల్డింగ్ ఖరీదైన క్రీడ. డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి కాలం శిక్షణ కోసమే కేటాయించాలి. దాంతో ఒకానొక సమయంలో వారి ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా మారిందని, తన ఇద్దరు అన్నలు, అక్క తనకు సహాయం చేశారని ప్రతిభ చెప్పింది. ఇప్పుడు ప్రతిభ ఆసియా, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లకు సిద్ధమవుతోంది. దేశానికి ప్రపంచ గుర్తింపును తీసుకొస్తానంటుంది. తనకు కోచ్‌గా ఉన్న భర్తపై ఆమెకు పూర్తి విశ్వాసం ఉంది. అయితే డబ్బు ఏర్పాటు చేయడమే సవాలు. ప్రభుత్వం నుంచి, సమాజం నుంచి తమకు సాయం అందుతుందని ఆశిస్తున్నట్లు భూపేష్ అంటున్నాడు.
కుటుంబ మద్దతుతో...
ప్రతిభ పిల్లలు కూడా వంట చేయడం ప్రారంభించారు. దాంతో తల్లికి మరింత సమయం దొరికింది. అయితే ఈ విజయం ఆమె అంత సులభంగా రాలేదు. ఈ విజయం కోసం ప్రతిభ ఏడాది పొడవునా చాలా కఠినమైన శిక్షణ చేసింది. కుటుంబం కూడా పూర్తి మద్దతు ఇచ్చింది. భర్త భూపేష్ కోచ్‌గా, మెంటార్‌గా ఆమెకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు. ఇంటర్, పదో తరగతి చదువుతున్న ఇద్దరు కొడుకులు కూడా ఆమెకు పూర్తిగా సహకరించారు. చిన్న కొడుకు ఆమ్లెట్‌తో పాటు శాండ్విచ్లు చేయడం కూడా నేర్చుకున్నాడు. దాంతో తాను భోజనం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతిభ చెప్పింది.
కోచ్ కుంగదీసాడు
భూపేష్ నెల రోజుల తర్వాత ప్రతిభ శరీరంలో తేడా గమనించాడు. ఆమె కూడా పోటీకి సిద్ధం కావడం ప్రారంభించింది. కానీ ఆమె కోచ్ మాత్రం తీవ్రంగా నిరుత్సాహ పరిచాడు. ''నీకు థైరాయిడ్ వచ్చింది, వృద్ధాప్యం వచ్చింది'' అంటూ తనను కుంగదీసే వాడని ప్రతిభ చెప్పింది. దాంతో ప్రతిభ శిక్షణ మొత్తం భూపేష్ చూసుకోవడం మొదలుపెట్టాడు. ఆమె డైట్, ట్రైనింగ్, సప్లిమెంట్స్ అన్నీ భర్త పర్యవేక్షణలోనే మొదలయ్యాయి.