Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాగిలో పీచు పదార్థం ఎక్కువ. గుండె జబ్బులతో బాధపడే వారికి కూడా ఇది అద్భుతమైన ఆహారం. రాగులు ఊబకాయాన్ని నివారించడంతో పాటు జీర్ణక్రియని మెరుగుపరుస్థాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తాయి. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు క్రమం తప్పకుండా రాగులతో చేసిన పదార్థాలను తమ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కొవ్వు తక్కువ ఉండటం వల్ల గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అయితే రాగులతో జావ, రాగి దోశ మాత్రమే కాదు... ఇంక అనేక రుచికరమైన పదార్థాలను తయారు చేసుకోవచ్చు. అవేంటో మీరు ఒకసారి చూసేయండి.
బర్ఫీ
పాన్ స్టౌ మీద పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి పోసి వేడి చేసుకోవాలి. అందులో కొద్దిగా రాగి పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. సన్నని మంట మీద మూడు నుండి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత అందులో కప్పు బెల్లం పొడి వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత పావు కప్పు బాదం పొడి, కప్పు పాలు, స్పూను యాలకుల పొడి వేసుకుని ఆ మిశ్రమాన్ని బాగా దగ్గరపడేదాక ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని నెయ్యి రాసిన ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అది పూర్తిగా ఆరిన తర్వాత బర్ఫీ ముక్కలు మాదిరిగా కట్ చేసుకోవాలి.
లడ్డు
పాన్‌లో కప్పు నెయ్యి వేసుకుని అందులో కప్పు రాగి పిండి వేసుకోవాలి. పిండి పచ్చి వాసన పోయేంత వరకు సుమారు ఐదు నుండి ఏడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అది కొంచెం చల్లారిన తర్వాత కప్పు బెల్లం వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత యాలకుల పొడి, టేబుల్ స్పూను యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. మిశ్రమం వేడిగా ఉన్న సమయంలోనే చేతితో లడ్డూల మాదిరిగా ఉండలు చేసి గాలి చొరబడని సీసాలో భద్రపరుచుకోవాలి.
పాన్ కేక్
పాన్ కేక్‌లు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. రాగి జావ తాగని పిల్లల కోసం తల్లులు ఇవి ట్రై చేసి చూడండి. మీ పిల్లలు ఎంతో ఆబగా వీటిని తినేస్తారు. కప్పు రాగి పిండి, కప్పు గోధుమ పిండి, టీ స్పూన్ ఉప్పు, టీ స్పూను బేకింగ్ పౌడర్, కప్పు బెల్లం పొడిని తీసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి బాగా వేడి చేసిన తర్వాత దాని మీద నూనె లేదా నెయ్యి రాయాలి. ఒక గంటె పిండిని తీసుకుని పాన్ మీద వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. అంతే వేడి వేడి రాగి పాన్ కేక్ రెడీ. ఇవే కాదు రాగి ఇడ్లీ, రాగి దోశ కూడా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రాగి పిండితో ఈ వంటకాలు చేసి రుచి చూసేయండి.
కుకీస్
50 గ్రాముల రాగి పిండి, 50 గ్రాముల గోధుమ పిండి తీసుకుని దాన్ని ఐదు నుండి ఏడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. దాన్ని మిక్సింగ్ గిన్నెలోకి మార్చుకోవాలి. మరో గిన్నెలో 60 గ్రాముల బెల్లం పొడి, 80 గ్రాముల వెన్న వేసుకోవాలి. దాంట్లో వేయించి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని, టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసి కలుపుకోవాలి. అన్ని బాగా కలుపుకొని ముప్ఫై నిమిషాల పాటు నానబెట్టాలి. ఓవెన్‌ను 160 డిగ్రీల వద్ద పెట్టి బేకింగ్ ట్రేలో రాగి పిండి ముద్దలను కుకీల షేప్‌లో వేసుకుని పెట్టేయాలి. కుకీలను 15 నిమిషాల పాటు కాల్చుకోవాలి. వాటిని గాలి చొరబడని కంటైనర్‌లో పెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు.