Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నప్పుడు మనం విన్న చుక్ చుక్ రైలు ఒక్కసారిగా గుర్తొస్తోంది... అందులో ఏడుస్తున్న బిడ్డకు తల్లి జోల పాడుతూ... ''జో జో పాపా ఏడవకు... లడ్డు మిఠాయి తినిపిస్తా...'' అంటోంది. మనం వాడుక భాషలో కూడా ఎవరినైనా ఆటపట్టించాలి అంటే 'లడ్డూ కావాలా నాయనా' అంటుంటాం. ఇంతకీ... ఈ లడ్డూ గోల ఏంటి అనుకుంటున్నారా.? అయితే ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండీ...
లడ్డు అంటే ఇష్టపడని వారు ఈ భూమి మీద ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే స్వీట్స్ రారాజు లడ్డూ. అయితే అందరిలా కాకుండా మనం కాస్త స్పెషల్‌గా ఉండాలని... చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలని కొందరు అనుకుంటూ ఉంటారు. ఊరికే ఇలా అనుకోవడం మాత్రమే కాకుండా వారి బుర్రలోనీ ఆలోచనలకు పదును పెట్టి ఆ ఆలోచనకు కాస్త కొత్తదనాన్ని చేర్చినపుడే విజయం సాధిస్తారు. అలా తాను తయారు చేసిన ఏ పదార్థం అయినా సమా జంలోని ప్రతీ ఒక్కరి జీవన శైలికి తగ్గట్టుగా ఉండాలని కోరుకుంటుంది కవితా గోపు. అందరి మన్ననలను అందుకుంటోంది.
ఆలోచనలను ప్రోత్సహిస్తూ...
'లడ్డూ బాక్స్' అనే సంస్థను 2019లో ప్రారంభించారు కవిత. ఇందు కోసం తాను చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కూడా వదులుకుంది. ఈ సంస్థను మొదలు పెట్టారు. ప్రతీ మగాడి విజయం వెనుక ఒక మహిళ ఉన్నట్లు కవిత ఆలోచనలను ప్రోత్సహిస్తూ తన వంతు సహాయ సహకారాలను అందించారు ఆమె భర్త సందీప్. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్లు తన చెయ్యిని పెండ్లి ప్రమాణాల్లోనే.. కాదు సమాజంలో తన భార్య కు ఒక ప్రత్యేక స్థానం పొందేందుకూ అండగా ఉన్నారు సందీప్.
గడ్డు పరిస్థితుల్లో...
అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న చిన్న బిడ్డకు ఒక పెద్ద దెబ్బతగిలితే ఆ తల్లి మనసు విల విల లాడుతుందోంది. అలా 2019లో కవిత ప్రారంభించిన తన సంస్థకు కరోనా రూపంలో పెద్ద దెబ్బ తగిలింది. ఆమెనే కాదు కరోనా ఎందరో జీవితాల్ని తలకిందులు చేసింది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో తన బిడ్డను (లడ్డు బాక్స్ సంస్థను) ఎలా కాపాడుకోవాలి అని తలమునకలు అవుతున్న పరిస్థితుల్లో ఒక చిన్న ఆలోచన ఊపిరి పోసుకుంది.
అవగాహన కల్పిస్తూ...
ఆఫ్‌లైన్‌లో కాకుండా. ఆన్లైన్ బిజినెస్ మొదలు పెట్టారు. అలా మొదలు పెట్టిన సంస్థ ఒక బాక్స్ స్వీట్స్‌తో మొదలైంది. ఇప్పుడు ఆ ఆర్డర్లు కాస్త కేజీల కొద్ది లడ్డూలు కావాలనే వరకు విస్తరించింది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్య వంతులుగా ఉండాలనే లక్ష్యంతో తాము తయారు చేసే లడ్డూల కోసం బెల్లంతో, చిరు ధాన్యాలను ఉపయోగిస్తున్నారు. ప్రజల్లో చిరు ధాన్యాలపై అవగాహన కల్పిస్తున్నారు. తాను చేస్తున్న కృషికి గాను అగ్రగామిగా ఉన్న సంస్థలకు ధీటుగా నిలబడి అవార్డ్స్ కూడా అందుకున్నారు.
- దీప నిదానకవి