Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రోజుల్లో ప్రతి అంశం డబ్బుతోనే ముడిపడి ఉంటోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆర్థిక క్రమశిక్షణను అలవరచుకుంటే చాలా సమస్యలను దీటుగా ఎదుర్కోవచ్చంటున్నారు ఆర్థిక నిపుణులు. ముఖ్యంగా 20ల్లో ఉండే యువత ఆర్థిక విషయాల్లో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది చిన్నవయసులోనే ఉద్యోగాలు తెచ్చుకొని సొంతంగా డబ్బు సంపాదిస్తున్నారు. అయితే కొంతమంది ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం వల్ల వివిధ సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం...
ఆర్థిక క్రమశిక్షణలో మొదటి, ముఖ్యమైన అంశం బడ్జెట్ కేటాయించుకోవడం. మీ ఆదాయం ఎంత? దాన్నుంచి మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు? వంటి అంశాలను ముందుగా లెక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత మీ ఖర్చులకు తగ్గట్టు బడ్జెట్ వేసుకోవాలి. ఇది చాలా కష్టమైన పనే. ఇందుకోసం ప్రస్తుతం చాలా మొబైల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఏదైనా ప్రయత్నిం చవచ్చు. ఒక్కసారి బడ్జెట్ వేసుకున్నాక దానికి అనుగుణంగానే ఖర్చు చేయాలి. అయితే అన్ని సందర్భాల్లో అది సాధ్యం కాకపోవచ్చు. కానీ ఆ తేడా మాత్రం స్వల్ప మొత్తంలోనే ఉండేట్టు చూసుకోవాలి.
స్కోర్ పడిపోకుండా...
కొన్ని లక్ష్యాలను సాధించడానికి అధిక మొత్తంలో డబ్బు అవసరమవు తుంటుంది. అలాంటి సందర్భాల్లో లోన్ కోసం బ్యాంకులను ఆశ్రయించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరికొన్ని అవసరాల కోసం క్రెడిట్ కార్డును ఉపయోగించాల్సిన అవసరం రావచ్చు. అయితే ఇవి పొందాలంటే బ్యాంకులు క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేస్తుంటాయి. ఈ స్కోరే మీ ఆర్థిక క్రమశిక్షణను నిర్ణయిస్తుంటుంది. కాబట్టి ఇరవైల్లో ఉన్నప్పటి నుంచే మీ క్రెడిట్ స్కోర్ పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం నెలవారీ బిల్లులు ఏవైనా ఉంటే వాటిని ఎప్పటి కప్పుడు చెల్లించాలి. అలాగే క్రెడిట్ కార్డుకి సంబంధించిన లావాదేవీలను సాధ్యమైనంత మేరకు అదుపులో పెట్టు కోవాలి. ఆ బిల్లులను కూడా గడువులోపు చెల్లించాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఇల్లు కొనుక్కోవడం, సొంతంగా బిజినెస్ పెట్టుకోవడం వంటి లక్ష్యాలను బ్యాంక్ లోన్ల ద్వారా సులభంగా సాధించవచ్చు.
రెండో ఆదాయం కోసం...
ఎప్పుడూ ఒకే ఆదాయంపై ఆధారపడద్దు. పెట్టుబడులతో ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించాలి' అంటారు ఆర్థిక నిపుణులు. ఈ పద్ధతిని ఇరవైల్లో ఉన్నవారు పాటిస్తే మంచి ఫలితాలను రాబట్టవచ్చు. చాలామంది కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత కేవలం ఆ సంపాదనపైనే ఆధారపడుతుంటారు. మిగతా సమయాన్ని వృథా చేస్తుంటారు. అయితే దీనికి బదులుగా రెండో ఆదాయ మార్గాన్ని సృష్టించుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని సంపాదించు కోవచ్చు. ఇందుకోసం ఫ్రీలాన్సింగ్ చేయడం, పార్ట్‌టైమ్ బిజినెస్ పెట్టుకోవడం.. వంటివి చేయచ్చు. ఈ చిట్కా మీ ఆర్థిక వృద్ధితో పాటు ఆత్మవిశ్వాసాన్నీ పెంచుతుంది.
అత్యవసర నిధి అవసరం
అత్యవసర పరిస్థితుల్లో అప్పులు చేయకుండా ఖర్చుల్ని వెల్లదీయాలంటే అత్యవసర నిధి తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఇందుకోసం ప్రతి నెలా మీ వేతనంలో కొంత మొత్తాన్ని కేటాయించాలి. ఆ డబ్బుని ఎప్పుడు పడితే అప్పుడు తీయడానికి వీలు లేకుండా ప్రత్యేక ఖాతాను ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇలా చిన్న వయసులోనే ఇలాంటి పద్ధతిని పాటించడం ద్వారా ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు సులభంగా బయటపడగలుగుతారు.