Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఛాంపియన్ కావడానికి హిజాబ్ అడ్డుకాదంటుంది. ఆడపిల్లలకు శిక్షణ ఇచ్చే కోచ్‌గా మారింది. హిజాబ్ ధరించే ఎందరికో శిక్షణ ఇస్తుంది. రెండు వారాల కంటే తక్కువ శిక్షణతో జిల్లా, డివిజనల్, జోనల్ ఛాంపియన్‌షిప్‌లలో తన విద్యార్థులను విజయతీరాలకు చేర్చింది. సంప్రదాయ ముస్లిం కుటుంబం నుండి వచ్చిన ఆడపిల్లలను క్రీడల్లో ప్రోత్సహిస్తుంది. ఆమే
మునిస్సా జబ్బార్...
రఫియా ఫాతిమా వయసు 12 ఏండ్లు. KFC నుండి హైఫైవ్స్, బర్గర్లు తెప్పించుకుని తినడమంటే చాలా ఇష్టం. అయితే ఇలాంటి అలవాట్లకు ఆమెను దూరంగా ఉంచగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆమె ఫుట్‌బాల్ కోచ్ మునిస్సా జబ్బార్. ప్రస్తుతం ఆమె 20 మంది బాలికలతో కూడిన బృందానికి శిక్షణ ఇస్తున్నారు. వారిలో ఎక్కువ మంది సనాతన ముస్లిం ఇళ్ల నుండి వచ్చినవారే. ఈ ఏడాది చాలా మంది క్రీడాకారులు రంజాన్ విరామం తర్వాత కేవలం రెండు రోజుల కిందటనే తమ శిక్షణ ప్రారంభించారు. ఈ తక్కువ వ్యవధిలో ఛాంపియన్లను సృష్టించడం వారికి కొత్త కాదు. బురఖాలో పవర్‌హౌస్ కోచ్ అయిన మునిస్సాకు ఇది ఎలాంటి ఇబ్బందీ కలిగించదు. గతంలోనూ హిజాబ్ ధరించిన ఈ కోచ్ తన విద్యార్థులను జిల్లా, డివిజనల్, జోనల్ ఛాంపియన్‌షిప్‌లలో రెండు వారాల కంటే తక్కువ శిక్షణతోనే విజయతీరాలకు చేర్చింది.
సంప్రదాయ ముస్లిం కుటుంబాలు
''ఇది ఒక సాధారణ ప్రకటనలాగా అనిపించవచ్చు. కానీ వారి పిల్లలు మంచి చేతుల్లో ఉన్నారని ఇది తల్లిదండ్రులకు భరోసా ఇస్తుంది'' అని మునిస్సా చెప్పారు. ఏండ్లుగా ఆమె సంప్రదాయవాద ముస్లిం కుటుంబాల నుండి అనేక మంది యువతుల కోసం ఒక మాతృకగా ఉద్భవించింది. వారు వారి కట్టుబాట్లను తెంపుకొని ఫుట్‌బాల్‌లో గుర్తింపును పొందాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లలో ఆడపిల్లలు తమ హిజాబ్‌తోనే ఆడేలా శిక్షణ ఇచ్చింది. నెలల తరబడి ఆ కుటుంబాలతో వ్యక్తిగతంగా సంబంధాలు మెరుగుపరుచుకుంది.
మహిళా కోచ్‌గా...
మునిస్సా తన శిక్షణతో విద్యార్థుల జీవితాన్ని మార్చగలదనే దృఢవిశ్వాసం ఉందని, అందుకే తన కుమార్తెను శిక్షణకు పంపమని రఫియా తండ్రి మహ్మద్ రఫీవుల్లా చెప్పాడు. ''చాలా సార్లు ముస్లిం కుటుంబాలు తమ కుమార్తెలను మహిళా కోచ్‌తో ఇతర నగరాల్లో టోర్నమెంట్లు ఆడేందుకు పంపకుండా నిరోధించే మత విశ్వాసాలు ఉన్నాయి. మరికొందరు తమ కూతుళ్లు ఎండలో ఆడుతూ రంగు తగ్గిపోతారని, లేదా మగవారి పర్యవేక్షణ లేకపోతే ఏదో ఒక ప్రమాదంలో పడవచ్చని ఆందోళన చెందుతున్నారు. కానీ నాకు నా కుమార్తెను సంతోషంగా చూడటం ముఖ్యం. ఆమె ఆటలో నైపుణ్యం పొందడం మరింత ముఖ్యం'' అని అతను చెప్పాడు. కుటుంబాల్లో ఇటువంటి మార్పు రావడం వెనుక మునిస్సా కృషి ఎంతో ఉంది. ఫుట్‌బాల్ పట్ల యువ మహిళా క్రీడాకారులను ప్రోత్సహించడం, వారిని ఛాంపియన్స్‌గా తీర్చి దిద్దడం ఆమె కల. దీని కోసం ఆమె ఎంతో పోరాటం చేస్తుంది.
రాష్ట్రస్థాయి మ్యాచ్‌లో
1997లో చెంగల్‌పేట్‌లో విద్యార్థిగా ఉన్నప్పుడు ఫుట్‌బాల్‌తో ఆమె పరిచయం మొదలైంది. ఆడిన రెండేండ్ల లోపే కాంచీపురంలో జరిగిన రాష్ట్రస్థాయి మ్యాచ్‌లో విజయం సాధించింది. అయితే 1999లో ఊటీలో జరిగిన తమిళనాడు రాష్ట్ర టోర్నమెంట్లో గెలిచిన తర్వాత ఆమె కుటుంబంలో ఎన్నో బాధాకర సంఘటనలు జరిగాయి. ''నా గురించి వార్తా చదివినప్పుడు మా నాన్నగారు కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను ఈ స్థానంలో నిలబడి నందుకు సంతోషిస్తున్నాను. కానీ ఈ గేమ్‌లో నాకు మంచి భవిష్యత్తు ఉందని నా కుటుంబానికి హామీ ఇచ్చి కోచ్‌గా మారక పోయివుంటే 18 ఏండ్లు నిండిన క్షణంలోనే వివాహం చేసుకుని ఉండేదాన్ని'' అని ఆమె చెప్పింది.
భయాలను పోగొట్టడానికి
21 ఏండ్ల షమ్నా రెహమాన్ మునిస్సా వద్ద శిక్షణ తీసుకుంటున్న ఏకైక సీనియర్ విద్యార్థి. ఆమె తన ఆటను కొనసాగిస్తుంది. ఆమె ఇప్పుడు స్వయంగా కోచ్. మునిస్సా వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతోంది. ''నేను 2008లో తమీమ్ ఆధ్వర్యంలో శిక్షణ ప్రారంభించాను. పాఠశాల పోటీ నుండి ప్రారంభించి నా ఆట చిన్న చిన్న విజయాలతో మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది'' అని రెహమాన్ చెప్పారు. కుటుంబం, సంఘం లేదా సమాజంలో వారి భయాలను పోగొట్టడానికి వారికున్న ఏకైక మార్గం మైదానంలో విజయం సాధించడం. భారతదేశంలో వారు ఫుట్‌బాల్ ఛాంపియన్స్‌గా మారినప్పుడు దేశమే కాదు ప్రపంచం మొత్తానికి వారు ప్రత్యేకంగా కనిపిస్తారు.
భోజనం వండి పెట్టేది
ఆమె కోచ్‌గా ఏడేండ్లలో ప్రతిభావంతులైన అమ్మాయిలను జట్టులో చేర్చడానికి చాలా కష్ట పడింది. నిరుపేద కుటుంబాల నుండి వచ్చిన వారికి సహాయం చేసింది. వారి కోసం ఇంటి నుండే పోషకమైన భోజనాన్ని ప్యాక్ చేసి తీసుకొచ్చేది. తన పాఠశాల సెలవుల్లో తన బృందం ధరించే బూట్ల కోసం నిధులు సేకరించింది. శిక్షణ తో పాటు ప్రతిరోజూ వారికి భోజనం వండి పెట్టేది. ''అమ్మా యిలు కాస్త పెద్దవారైతే శిక్షణ మానేసేవారు. ఎందు కంటే 18 ఏండ్లు నిండిన తర్వాత కుటుంబం వారికి పెండ్లి చేసేస్తారు'' అని మునిస్సా అంటుంది.