Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : టిబెట్ రాజధాని లాసాని టిబెట్ సరిహద్దులోని మారుమూల ప్రాంతానికి కలుపుతూ బుల్లెట్ రైలును చైనా శుక్రవారం ప్రారంభించింది. టిబెట్ సరిహద్దులో వ్యూహాత్మకమైన ఆ ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్కు అత్యంత సమీపంలో వుంది. సిచువాన్-టిబెట్ రైల్వే సెక్షన్లోని 435.5కిలోమీటర్ల లాసా-నింగ్చి మార్గాన్ని పూర్తిగా విద్యుద్దీకరించింది. పాలక కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) శత జయంతి ఉత్సవాలు జులై 1న జరగడానికి ముందుగా ఈ బుల్లెట్ రైలును ప్రారంభించింది. టిబెట్లో తొలి విద్యుద్దీకరణ రైల్వే లైను శుక్రవారం ప్రారంభమైందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. టిబెట్లో చైనా ప్రారంభించిన సిచువాన్-టిబెట్ రైల్వే లైను రెండవది. కొత్త రైల్వే ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నవంబరులో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అధికారులను కోరారు. సరిహద్దుల్లో సుస్థిరతను పరిరక్షించడంలో కొత్త రైల్వే లైను కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. సిచువాన్ ప్రావిన్స్ రాజాని చెంగ్డూ నుండి సిచువాన్-టిబెట్ రైల్వే ప్రారంభమవుతుంది. ఈ కొత్త లైను వల్ల లాసా నుండి చెంగ్డూ ప్రయాణ సమయం 48గంటల నుండి 13 గంటలకు తగ్గింది. చైనా-భారత్ సరిహద్దుల్లో సంక్షోభం తలెత్తితే వ్యూహాత్మక సామాగ్రిని సరిహద్దులకు చేరవేయడానికి చైనాకు ఈ రైల్వే లైను ఉపయోగపడుతుందని త్సింగువా యూనివర్శిటీకి చెందిన జాతీయ వ్యూహ రచనా సంస్థ డైరెక్టర్ కియాన్ ఫెంగ్ వ్యాఖ్యానించారు.