Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నౌకపై బాంబులేసిన రష్యా
- మా జలాల్లోకి వచ్చారంటే సహించబోమని హెచ్చరిక
- బ్రిటన్ ప్రధాని వ్యక్తిగత ఆదేశాలతోనే ఇదంతా ?
- నల్ల సముద్ర జలాలపై రష్యా, బ్రిటన్ మాటల యుద్ధం
లండన్ : నల్ల సముద్ర జలాలు బ్రిటన్, రష్యా ఘర్షణలకు వేదికగా మారాయి. దీనిపై ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది. నల్ల సముద్ర జలాల్లో ఘర్షణకు సంబంధించి బ్రిటన్ అసత్యాలు ప్రచారం చేస్తోందని రష్యా ఆరోపిస్తోంది. క్రిమియా జలాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడితే బ్రిటీష్ నౌకలపై బాంబులు వేస్తామని రష్యా హెచ్చరించింది. బ్రిటన్ యుద్దనౌక తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిందని రష్యా పేర్కొంది, అవి ఉక్రెయిన్ జలాలేనని బ్రిటన్ వాదిస్తోంది. తమ నావికాదళం అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే వ్యవహరించిందనీ, సముద్ర జలాల్లో తమ నౌక ఇన్నోసెంట్ ప్యాసేజ్ నిర్వహించిందని బ్రిటన్ చెబుతోంది. చట్టవిరుద్ధంగా తామెలాంటి జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది. రష్యాతో నెలకొన్న యుద్ధనౌక వివాదంపై ఈ మేరకు బ్రిటన్ పార్లమెంట్లో ఒక ప్రకటన చేసింది. ఈ వివాదం ముదిరిన నేపథ్యంలో మాస్కోలోని బ్రిటిష్ రాయబారికి రష్యా సమన్లు జారీ చేయగా, లండన్‌లోని రష్యా రాయబారిని బ్రిటన్ పిలిపిం చింది. తాము హెచ్చరిస్తూ కాల్పులు జరిపి బ్రిటన్ యుద్ధ నౌకను అడ్డగించామని రష్యా పేర్కొంటుం డగా బ్రిటన్ దాన్ని తిరస్కరిస్తోంది. తమ నౌక చట్టబద్ధంగానే వ్యవహరించిందని స్పష్టం చేస్తోంది.
ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత నాటో సభ్య దేశం యుద్ధ నౌకను నిలువరించడానికి ఇలా కాల్పులు జరపడం ఇదే తొలిసారి అని రష్యా పేర్కొంది. గస్తీ నౌక హెచ్చరిస్తున్నా వినిపించుకోకుండా యుద్ధనౌక ముందుకు చొచ్చుకు వచ్చిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
రష్యా ప్రాదేశిక జలాల్లోకి దాదాపు మూడు కిలోమీటర్ల వరకు చొరబడిందని పేర్కొంది. దాంతో రష్యన్ బాంబర్ ఎస్యు-24 నాలుగు బాంబులను వేసింది. వెంటనే యుద్ధ నౌక తన మార్గాన్ని మార్చుకోవాలని హెచ్చరించిందని, కొద్ది నిముషాల తర్వాత డిఫెండర్ యుద్ధనౌక రష్యా జలాలను వీడి వెళ్లిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వివరించింది. బ్రిటన్ వ్యవహార శైలిని రష్యా విదే శాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జకరోవా తీవ్రంగా నిరసించారు.
డిఫెండర్ చర్యలపై దర్యాప్తు చేయాల్సిందిగా బ్రిటీష్ అధికారులను కోరారు. ఇదంతా అసత్యమని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ చెబుతోంది. అవి ఉక్రెయిన్ జలాలేనని, రష్యా జలాలు కాదని పేర్కొంది. యుద్దనౌకపై కాల్పులు జరిగాయనడాన్ని కూడా తోసిపుచ్చింది. ఉక్రెయిన్ నుండి క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడంతో 2014 నుండి విబేధాలు తీవ్రతరమయ్యాయి.
బ్రిటన్ ప్రధాని వ్యక్తిగత ఆదేశాలు ?
క్రిమియా జలాల్లోకి యుద్ధనౌక వెళ్లేందుకు బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ వ్యక్తిగతంగా ఆదేశాలు జారీ చేశారని, విదేశాంగ మంత్రి హెచ్చరించినా పట్టించుకోలేదని మీడియా వార్తలు పేర్కొన్నాయి. ఈ మిషన్ గురించి విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ ముందుగానే ఆందోళనలు లేవనెత్తారని, ఈ చర్య వల్ల రష్యాకు విజయం లభించే అవకాశాలు వున్నాయని కూడా ఆయన ఆందోళన చెందినట్లు టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది. ఈ మేరకు గురువారం రాత్రి రిపోర్ట్‌ను విడుదల చేసింది. క్రిమియా వివాదాన్ని పరిష్కరించేందుకు జాన్సన్ పిలుపిచ్చినట్టు తెలుస్తోంది. సోమవారం టైప్-45 డిస్ట్రాయర్ హెచ్ఎంఎస్ డిఫెండర్‌కు క్రిమియా జలాల్లోకి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత రెండు రోజులకు రష్యా నావికా, వైమానిక దళాలతో ఘర్షణ తలెత్తింది.
తమ సార్వభౌమాధికారం వున్న జలాల్లోకి యుద్ధ నౌక ప్రవేశించిందని రష్యా పేర్కొంటోంది. వెంటనే నౌకలు, విమానాలతో ఆ నౌకను అడ్డుకుని వెనక్కి తిప్పి పంపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. బ్రిటిష్ నావికులు ఆ ప్రాంతం నుండి వెళ్లిపోయే లోగానే రష్యా వైపు నుంచి వార్నింగ్ షాట్లు కూడా వెలువడ్డాయని అధికారులు చెబుతున్నారు. రష్యా వాదనలను బ్రిటన్ తిరస్కరిస్తోంది. క్రిమియా, దాని చుట్టుపక్కల ప్రాంతమంతా చట్టబద్ధంగా ఉక్రెయిన్ పరిధిలోకి వస్తుందని బ్రిటన్ పట్టుబడుతోంది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే తాము వ్యవహరిస్తున్నామని స్పష్టం చేసింది.
హెచ్ఎంఎస్ డిఫెండర్లోని జర్నలిస్టుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, రష్యా బలగాలతో ఘర్షణను బ్రిటన్ అధికారులు ముందుగానే ఊహిం చారని తెలిపారు. అయినా క్రెమ్లిన్‌కు ఒక సందేశం పంపాలని భావించారు. తీర ప్రాంత రక్షణ బలగాల నుంచి పదే పదే హెచ్చరికలు వచ్చాయని, మీరు వెనక్కి వెళ్ళకపోతే కాల్పులు జరపాల్సి వస్తుందని వారు హెచ్చరించారని నౌకలో వున్న ఒక విలేకరి తెలిపారు. హెచ్చరికగా రష్యా కాల్పులు జరిపిందా లేదా అన్నదే ఇక్కడ వివాదాస్పదమైంది. నౌకను అడ్డగించాలన్న తమ ఉద్దేశాలను తెలియచేసే చర్యలు తీసుకున్నామని రష్యా చెబుతోంది. అవి కచ్చితమైన సమాచారం కాదని బ్రిటన్ విదేశాంగ మంత్రి రాబ్ వ్యాఖ్యానించారు.
రష్యా నావికులు కేవలం అక్కడ విన్యాసాలు నిర్వహించారని బ్రిటన్ అధికారులు చెబుతున్నారు. తన వాదనలకు మద్దతుగా రష్యా గురువారం ఒక వీడియోను విడుదల చేసింది. పరుష పదజాలంతో కూడిన రేడియో హెచ్చరికలను ధ్రువీకరించింది. బ్రిటన్ నావికులను హెచ్చరిస్తూ ముందుగా కాల్పులు జరిపిన వాస్తవాన్ని కూడా ధ్రువీకరించినట్టు కనిపిస్తోంది.