Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికాలో సంచలనం సృష్టించిన జార్జ్ ఫ్లాయిడ్(46) హత్య ఉదంతంలో న్యాయస్థానం ఎట్టకేలకు తీర్పు వెలువరించింది. నల్లజాతీయుడనే జాతి వివక్షతో ఫ్లాయిడ్ మెడను కాలితో నొక్కిపెట్టి పోలిస్ అధికారి డెరిక్ చౌవిన్ (45) అతడి ప్రాణాలు తీసినతీరు ప్రపంచమంతా చూసింది. ఈ ఘటనపై అమెరికా, ఇతర దేశాల్లోనూ నిరసనలు హోరెత్తాయి. దీనిపై విచారణ జరిపిన మిన్నియాపొలిస్ కోర్టు డెరిక్ చౌవిన్‌ను ఇంతకు ముందే దోషిగా తేల్చింది. అయితే ఈ కేసులో శుక్రవారం రాత్రి న్యాయస్థానం తీర్పు వెలువరించింది. డెరిక్ చౌవిన్‌కు 22.5 ఏండ్ల (270 నెలలు) జైలు శిక్ష విధిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. '' భావోద్వేగంతో, సానుభూతితో డెరిక్‌కు ఈ శిక్ష విధించటం లేదు'' అని తీర్పు సందర్భంగా న్యాయమూర్తి పీటర్ కాహిల్ ప్రకటించారు. ఫ్లాయిడ్ కుటుంబానికి డెరిక్ క్షమాపణలు చెప్పాడు. మిన్నెసోటా రాష్ట్ర చట్టాల ప్రకారం 15ఏండ్ల జైలు శిక్ష తర్వాత డెరిక్ ప్రవర్తనపట్ల జైలు అధికారులు సంతృప్తి చెందితే..విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ తీర్పు తర్వాత అధ్యక్షుడు బైడెన్ సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్పందించారు. గత ఏడాది మే 25న జార్జ్ ఫ్లాయిడ్‌ను నడిరోడ్డుపై డెరిక్ చౌవిన్ మోకాలితో నొక్కి అదిమిపెట్టాడు. తనకు ఊపిరి ఆడటం లేదని, కాలు తీయాలని ఫ్లాయిడ్ ఎంతగా వేడుకున్నా డెరిక్ విడిచిపెట్టలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఫ్లాయిడ్‌ను హాస్పిటల్‌కు తరలించాక..అప్పటికే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించి వీడియోలు, ఫొటోలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.