Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది కేవలం రైతుల పోరాటం కాదు.. ప్రజలందరిదీ..
- ఢిల్లీ రైతు ఉద్యమానికి మద్దతు తెలిపిన నోమ్ చామ్స్కీ
న్యూయార్క్: తమ ఆందోళనలు, ఉద్యమంతో భారతీయ రైతులు ప్రపంచ పోరాటానికి ఒక నమూనాను ఇచ్చారని, అందరికీ ఆదర్శంగా నిలబడ్డారని అమెరికాకు చెందిన ప్రముఖ భాషాతత్వవేత్త, రాజకీయ విశ్లేషకుడు నోమ్ చామ్స్కీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ శివార్లలో రైతుల పోరాటం...ప్రపంచవ్యాప్తంగా చీకట్లో తెల్లవారుతున్న బతుకుల్లో ఆశలు రేపిందని ఆయన అన్నారు. ఇది కేవలం రైతుల కోసమే జరుగుతున్న పోరాటం కాదని, దేశ పౌరుల సంక్షేమం, హక్కుల గురించి జరుగుతున్న పోరాటంగా తాను భావిస్తున్నానని తెలిపారు. న్యూస్ వెబ్ పోర్టల్ 'ద వైర్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
ప్రపంచ పోరాట నమూనా..
ఓ వైపు నుంచి అణచివేత, హింసను ఎదుర్కొంటూ రైతులు ఇంతకాలం పాటు ఉద్యమం కొనసాగించటం చాలా గొప్ప విషయం. రైతుల ఉద్యమం న్యాయమైంది, సరైంది. గత 40ఏండ్లలో.. పేదలు, మధ్య తరగతికి సంపదలో వాటా ఎంత దక్కిందో అందరికీ తెలిసిందే. ఒక్కశాతమున్న అత్యంత ధనికుల చేతుల్లోకి దేశ సంపద అంతా వెళ్లిపోయింది. బడా పెట్టుబడిదారులు, నియంతల చేతుల్లో దేశ వనరులు పెట్టేందుకు కొత్త చట్టాలు దోహదపడుతున్నాయి. దీనిని ఎదురించేందుకు భారతీయ రైతులు చేస్తున్న పోరాటం, చూపుతున్న ధైర్యం చాలా గొప్పది. ప్రపంచంలో నిరసనలు, ఆందోళనలకు ఇది ఆదర్శం, పోరాట నమూనాగా నిలుస్తుంది. వారు చేస్తున్న ఈ పనికి రైతులు గర్వపడాలి. ఈ పోరాటం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిలో ఉత్సాహాన్ని నింపింది.