Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ మహమ్మారి నీడలో 83 శాతం పెరిగిన దాడులు : ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన
వాషింగ్టన్: ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలపై మరింత భయానకమైన రీతిలో ప్రభావం చూపింది. కరోనా కట్టడికి విధించే లాక్డౌన్లు, క్వారంటైన్ల వలన లింగ ఆధారిత హింసకు సంబంధించిన కేసులు ప్రతి మూడు నెలలకు అదనంగా 1.5 కోట్లు నమోదయ్యే అవకాశం ఉందని గతేడాది కరోనా ప్రభావం మొదలైన సమయంలో ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ప్రస్తుతం చూస్తే ఆ అంచనాలు నిజమౌతున్నట్లు కనిపిస్తోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నీడలో మహిళలపై గృహహింస దగ్గరి నుంచి లైంగిక దోపిడీ, అక్రమ రవాణా, బాల్య వివాహాలు, ఆన్లైన్ వేధింపులు, ఇతర రకాల హింస భారీగా పెరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా అందుబాటులోకి రాకపోయినప్పటికీ, పోకడలు ఆ విధంగానే ఉన్నాయని గుటెరస్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి పరిశీలన చేసిన 12 దేశాల్లో మహిళలు, బాలికలపై చోటుచేసుకుం టున్న హింసకు సంబంధించి పలు సంస్థల వద్ద నమోదైన కేసుల సంఖ్య 2019తో పోల్చుకుంటే 2020లో 83 శాతం పెరిగిందని, పోలీసుస్టేషన్లలో నమోదయ్యే కేసులు 64 శాతం పెరిగాయని తెలిపారు. కరోనా ప్రభావం
మొదలైన మొదటి నెలల్లో యూరోపియన్ వ్యాప్తంగా హెల్ప్‌లైన్ నంబర్లకు వచ్చిన కాల్స్ సగటున 60 శాతం పెరిగాయి. అదేవిధంగా పెరూలో లైంగిక హింసకు సంబంధించి ఏర్పాటు చేసిన హాట్‌లైన్‌కు కాల్ప్ 2019తో పోల్చుకుంటే గతేడాది దాదాపు రెట్టింపయ్యాయి. థారులాండ్‌లో, గతేడాది ఏప్రిల్‌లో ఆసుపత్రులలోని డొమెస్టిక్ వయలెన్స్ క్రైసిస్ యూనిట్స్‌కు వెళ్లే వారి సంఖ్య కూడా అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో చూస్తే రెండింతలు ఎక్కువైందని గుటెరస్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి రాకముందు, ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవిత కాలంలో పురుషుల నుంచి హింసను ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) అంచనా వేసింది. సంవత్సరం క్రితం తాను దీనిపై హెచ్చరికలు చేశానని, యుద్ధ జోన్ల నుంచి ప్రజల ఇళ్ల వరకు ప్రతిచోటా ఉండే హింసకు ముగింపు పలకడం ద్వారా ప్రతి ఇంటిలో శాంతి నెలకొల్పాలని పిలుపునిచ్చానని గుటెరస్ పేర్కొన్నారు. తద్వారా మానవాళి మొత్తానికి ఉమ్మడి శత్రువుగా ఉన్న కరోనాపై ఐక్యంగా పోరు సలిపేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. 140కి పైగా దేశాలు ఇందుకు సంఘీభావం ప్రకటించాయని, 149 దేశాల్లో ప్రధానంగా ఆశ్రయం, న్యాయసాయం, ఇతర సేవలు, మద్దతు వంటి దాదాపు 800 మేర చర్యలు తీసుకున్నారని తెలిపారు.
మహిళలు, బాలికలపై హింసకు ముగింపు పలికేందుకు ఐక్యరాజ్యసమితి తీసుకున్న ప్రత్యేక చొరవ కారణంగా 2020లో 25 దేశాల్లో స్పష్టమైన ఫలితాలు కనిపించాయని గుటెరస్ పేర్కొన్నారు. మహిళల, బాలికల రక్షణకు సంబంధించి 84 చట్టాలను ఆమోదించడమో లేదా సమీక్షించి బలోపేతం చేయడం జరిగిందని తెలిపారు. నేరస్తులపై విచారణ 22 శాతం పెరిగిందని.. లాక్డౌన్లు, ఇతర ఆంక్షలు ఉన్నా, దాదాపు 6 లక్షల 50 వేల మంది మహిళలు, బాలికలు ఈ సేవలను వినియోగించుకున్నారని చెప్పారు.
ఈ దేశాల్లో మహిళలు, బాలికలపై హింస, నియంత్రణకు ఉద్దేశించిన బడ్జెట్ కేటాయింపులు 32 శాతం పెరిగాయని, భవిష్యత్తు సుస్థిరతకు ఇది స్పష్టమైన సూచన అని గుటెరస్ అన్నారు. లింగ సమానత్వ సాధనే లక్ష్యంగా ఈ వారం పారిస్‌లో జరగనున్న జనరేషన్ ఈక్వాలిటీ ఫోరానికి ప్రపంచ నేతలు, ఇతరులు హాజవుతారని తెలిపారు. ఈ సమావేశంలో చాలా మంది మహిళలు, బాలికల ఆరోగ్యం, హక్కులు, గౌరవం, జీవితాలకు ముప్పుగా ఉన్న భయం, అభద్రతను అంతం చేసేందుకు ఫలితాలతో నిరూపితమైన ప్రపంచ చొరవలో పాలుపంచుకోవాలని ప్రభుత్వాలు, కంపెనీలు, వ్యక్తులకు పిలుపునిస్తానని గుటెరస్ పేర్కొన్నారు. తరువాతి జనరేషన్ బాలికలు భయం లేకుండా జీవించాల్సిన అవసరం ఉందన్నారు.