Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారోకు తప్పని తిప్పలు
- ఒప్పందాన్ని రద్దు చేసే దిశగా పార్లమెంటరీ కమిటీ అడుగులు
రియోడీజనీరో:'బ్రెజిల్-కోవాక్సిన్' కుంభకోణం సంచలనం రేపుతోంది. మరీముఖ్యంగా బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారోకు కుర్చీకి ఎసరుపెట్టేలా పరిస్థితులు మారుతున్నాయి. కరోనా టీకాల సంబంధించి భారత్ బయోటెక్‌తో బ్రెజిల్ చేసుకున్న ఒప్పందంలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై మీడియాలో విస్తృత కథనాలు ప్రచురితమయ్యాయి. ఒప్పందం విషయంలో బోల్సోనారో తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదంగా మారి.. ఆయనపై రోజురోజుకు తీవ్ర ఒత్తిళ్లకు దారితీస్తున్నాయి. కోవాక్సిన్ టీకాలను కొనుగోలు చేసేందుకు ఫిబ్రవరిలో బ్రెజిల్ ఆరోగ్యశాఖ ఒప్పందం కుదుర్చుకున్నది. ఆ దేశంలో కోవాక్సిన్ టీకాలను ప్రెసికా మెడికోమెంటస్ ఫార్మసీ సంస్థ సరఫరా చేయనున్నది. తొలుత 2 కోట్ల డోసులకు డీల్ కుదరగా.. ఇప్పటివరకు ఒక్క డోసు టీకా కూడా చేరలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ చేపట్టిన దర్యాప్తులో ఆరోగ్యశాఖ తీరును తప్పుపట్టారు. దీంతో కోవాక్సిన్ కోసం భారత్ బయోటెక్‌తో లింకు పెట్టుకున్న ప్రెసికా సంస్థ డీల్‌ను రద్దు చేసే దిశగా పార్లమెంటరీ కమిటీ అడుగులు వేస్తోంది.
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ పూర్తిస్థాయి క్లినికల్ ట్రయల్స్ పూర్తికాక ముందే అధిక ధరలకు ఆ టీకా కోసం ఒప్పందం కుదిరినట్టు బ్రెజిల్ పార్లమెంటరీ కమిటీ గర్తించింది. ఈ డీల్‌ను రద్దు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో తేల్చే పనిలో ఉంది. అధ్యక్షుడు బోల్సోనారో ఈ ఒప్పందంతో అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్కువ ధరకే ఇతర టీకాలు అందుబాటులో ఉంటే కోవాక్సిన్‌కు అధిక ధర ఎందుకు చెల్లించారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, కోవాక్సిన్ కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బోల్సోనారో చెబుతున్నప్పటికీ.. ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తుండగా.. ప్రతిపక్షాలు బోల్సోనారోకు వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. అక్కడి చట్టసభల్లోనూ దీనిపై చర్చ జరగనుంది.