Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిమూవల్ టెక్నాలజీ వుంటేనే సాధ్యమవుతుందన్న శాస్త్రవేత్తలు
లండన్ : పారిస్ వాతావరణ ఒప్పందంలో పేర్కొన్న లక్ష్యాన్ని నెరవేర్చాలంటే 2025కల్లా వంద కోట్ల టన్నుల మేరకు కార్బన్ డయాక్సైడ్ను తగ్గించాల్సి వుందని కొయిలేషన్ ఫర్ నెగిటివ్ ఎమిషన్స్ (సిఎన్ఇ), కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సేల ఇచ్చిన నివేదిక పేర్కొంది. గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్ కన్నా తగ్గించేందుకు ఉద్దేశించిన పారిస్ ఒప్పందంపై 190కి పైగా దేశాలు సంతకాలు చేశాయి. కర్బన ఉద్గారాలను పెద్ద మొత్తంలో తగ్గిస్తామని హామీలు ఇచ్చినప్పటికీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి కర్బన ఉద్గారాల తొలగింపు సాంకేతికత (రిమూవల్ టెక్నాలజీ) అవసరమవుతుందని పలువురు శాస్త్రవ్తేతలు విశ్వసిస్తున్నారు. అంతర్జాతీయంగా 1 గిగాటన్ (జిటి) ఉద్గారాలను తొలగించడానికి చర్యలు తీసుకోకపోతే పారిస్ ఒప్పందం పరిధిలో గ్లోబల్ వార్మింగ్‌ను 1.5డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించలేమని ఆ నివేదిక పేర్కొంది. ఈ ఒప్పందంలో పేర్కొన్న లక్ష్యాన్ని సాధించాలంటే దేశాలన్నీ కలిసి 2025కల్లా వంద కోట్ల టన్నుల ఉద్గారాలను తొలగించాల్సి వుందని తెలిపింది. ఆ తర్వాత ప్రతి ఏటా వందకోట్లకు పైగా ఉద్గారాలను తొలగించాల్సి వుంటుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో వున్న ప్రాజెక్టుల వల్ల 2025నాటికి కేవలం 15కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ను మాత్రమే తొలగించగలవని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం కర్బన ఉద్గారాల తొలగింపు సాంకేతికత చాలా వ్యయభరితంగా వుంది. కర్బన ఉద్గారాలపై ధరను నిర్ణయించేందుకు చాలా దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే సాంకేతికను పెంచితే ఖర్చు తగ్గుతుందని నివేదిక పేర్కొంది. టన్ను కార్బన్ డయాక్సైడ్ను తొలగించడానికి సగటున 41 నుండి 138 డాలర్లు ఖర్చు అయ్యే అవకాశం వుందని పేర్కొంది.