Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్యరాజ్య సమితి అధ్యయనం వెల్లడి
జెనీవా : కొన్ని పశ్చిమ దేశాల మార్కెట్లలో మినహా మొత్తంగా అంతర్జాతీయ పర్యాటక రంగం ఈ ఏడాది కూడా స్తబ్దుగానే వుంది. దీనివల్ల దాదాపు 2.4లక్షల కోట్ల డాలర్లు నష్టం వాటిల్లిందని ఐక్యరాజ్య సమితి అధ్యయనంలో వెల్లలడైంది. 2023 వరకు పూర్తి స్థాయిలో అంతర్జాతీయ పర్యాటక రంగం కోలుకునే పరిస్థితులు లేవని నివేదిక పేర్కొంది. విదేశీ పర్యాటకంలో విశ్వాసం నెలకొనడానికి కోవిడ్ వ్యాక్సినేషన్, సర్టిఫికెట్లు చాలా కీలకం. అనేక దేశాలకు ముఖ్యంగా చిన్న దీవులకు ఈ విదేశీ పర్యాటకమే ప్రధాన జీవనాధారంగా వుందని ఆ నివేదిక బుధవారం పేర్కొంది. ప్రజలకు ఉపాధి కల్పించడానికి చిన్న దీవులు భారీగా విదేశీ పర్యాటకంపై ఆధారపడతారు. 2019తో పోలిస్తే 2020లో అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలు 73శాతం తగ్గాయి. దీనివల్ల పర్యాటక, సంబంధిత రంగాల్లో 2.4లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారని ఆంక్టాడ్, ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యుఎన్‌డబ్ల్యుటిఓ) ఇచ్చిన నివేదిక పేర్కొంది. ఈఏడాది కూడా పరిస్థితులంత ఆశాజనకంగా కనిపించడం లేదని ఆంక్టాడ్ వాణిజ్య విశ్లేషణా విభాగానికి చెందిన రాల్ఫ్ పీటర్స్ వ్యాఖ్యానించారు. మొదటి మూడు మాసాల్లో పరిస్థితులు బాగా లేవని, అనుకున్నంతగా పర్యటనలు జరగలేదని అన్నారు. ఈ ఏడాది రెండో అర్ధ భాగంలోనైనా కొంత పుంజుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ క్రమం వేగంగా కొనసాగుతున్నందున కనీసం ఉత్తర అమెరికా, యూరప్‌ల వరకైనా మెరుగుపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. 30ఏళ్ళ క్రితం నాటి స్థాయికి అంతర్జాతీయ పర్యాటక రంగం పడిపోయిందని అన్నారు. చాలామంది జీవనోపాధులు ప్రమాదంలో పడ్డాయన్నారు.