Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా సామర్థ్యాలను తక్కువ అంచనా వేయవద్దు : జిన్పింగ్
- సముద్రాన్ని తలపించేలా చైనా శత వసంత వేడుకలు..
బీజింగ్ : సముద్రాన్ని తలపించేలా వేలాది మంది అభిమానులు, చప్పట్ల మధ్య చైనా శత వసంత వేడుకలు ఘనంగా జరిగాయి. తియనాన్మెన్ స్క్వేర్లో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) కేంద్ర కమిటీ జనరల్ సెక్రెటరీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి 70 వేల మంది హాజరయ్యారు. చైనా వ్యతిరేక శక్తుల నుంచి జాతి ప్రయోజనాలను చైనా ప్రజల బలమైన సంకల్పం, సామర్థ్యంతో కాపాడుకోగలిగిందని ప్రశంసించారు. ఈ సందర్భంగా చైనా చారిత్రక లక్ష్యమైన చైనా పునరేకీకరణ, పునరుజ్జీవనం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. చైనాను వేధించే రోజులు శాశ్వతంగా తొలగిపోయాయని జిన్పింగ్ అన్నారు. తైవాన్ విలీనానికి కట్టుబడి ఉన్నామనీ, జాతీయ పునరుజ్జీవనం కోసం ఉజ్వలమైన భవిష్యత్తును సృష్టించేందుకు కలిసి పనిచేయాలని సూచించారు. తైవాన్ సమస్య పరిష్కారానికి, చైనా జాతీయ ప్రయోజనాలు, ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు దేశ ప్రజలకు ఉన్న సంకల్ప, సామర్థ్యాలను ఎవరూ తక్కువగా అంచనా వేయవద్దని పునరుద్ఘాటించారు. బయటి శక్తులు తమని బెదిరించడానికి, అణచివేయడానికి, లొంగదీసుకోవడానికి ఎప్పటికీ అనుమతించబోమనీ, వాటిని సహించబోమని అన్నారు. ఎవరైనా ఇటువంటి దుస్సాహసం చేయాలనుకుంటే, 140 కోట్ల ప్రజలు సష్టించిన 'ది గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్'ను ఢకొీని వారి తల పగులుతుందని అన్నారు. సోషలిజంతో చైనా ప్రజల భవిష్యత్తును అభివృద్ధి చేసిందనీ, సోషలిజం మాత్రమే చైనాను కాపాడగలదని అన్నారు. సోషలిజానికి చైనా లక్షణాలు జోడించి దేశాన్ని అభివద్ధి చేయవచ్చని అన్నారు. సీపీసీ ఆవిర్భావం నాటి నుంచి చైనా ప్రజల ఆనందం, పునరుజ్జీవం కోసం పోరాటం చేసిందనీ, అ లక్ష్యాన్ని సాధించగలిగిందని అన్నారు. సీపీసీ 100 ఏండ్లుగా ఒక లక్ష్యం కోసం చైనా ప్రజలను ఏకతాటిపై నడిపించిందనీ, చైనాకు పునరుజ్జీవనాన్ని తీసుకువచ్చిందని అన్నారు. సీపీసీ, చైనా ప్రజలు పోరాటం ద్వారా చైనా పునరుజ్జీవనం చారిత్రక అభివృద్ధని ప్రపంచానికి చూపాయని అన్నారు. ఈ సందర్భంగా ఆధునిక చైనా అభివద్ధిలో కమ్యూనిస్టు పార్టీ పాత్రను ప్రశంసించారు. చైనా విప్లవం, నిర్మాణం, సంస్కరణలకు, సీపీసీ స్థాపన, ఏకీకరణ, అభివృద్ధికి మావో జెడాంగ్, జువో ఎన్లారు, లియు షావోకి, జ్యుడే, డెంగ్ షివోపింగ్, చెన్యున్లు దోహదపడ్డారని గుర్తుచేసుకున్నారు. పార్టీని ప్రజలకు దూరం చేయాలని భావించినవారు ఓడిపోయారన్నారు. హాంకాంగ్, మకావ్లో అత్యున్నత స్థాయిలో స్వయం ప్రతిపత్తి కొనసాగుతోందని, 'ఒక దేశం రెండు వ్యవస్థల' విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా చైనా ఫైటర్ జెట్ విన్యాసాలు, శతఘ్నులతో వందన స్వీకారం, సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఉదయం ఏడుగంటలకు పార్టీ జానపద గీతం 'యూనిటీ ఈజ్ స్ట్రెంత్' పాటను వినిపించడంతో తియాన్న్మెన్ స్క్వేర్ వద్ద వేడుకలు ప్రారంభమయ్యాయి. భద్రతా దళాలు జాతీయ జెండాలతో మార్చ్ చేపట్టారు. ఈ పరెడ్ సీపీసీ వందేండ్ల వేడుకలకు గుర్తుగా.. వంద అడుగుల మార్చ్ నిర్వహించారు. అలాగే గౌరవార్థం వంద గన్నులతో సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానుల కేరింతలు, చప్పట్లు పదికిలోమీటర్ల వరకు వినిపించాయి.