Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రెసీలియా : కోవాగ్జిన్ కుంభకోణం బ్రెజిల్ అధ్యక్షుడు జైయిర్ బోల్సోనారో మెడకు చుట్టుకుంది. భారత్ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ కొనుగోలుకు సంబంధించి చోటుచేసుకున్న అక్రమాల్లో అధ్యక్షుడికి పాత్ర ఉందన్న ఆరోపణలు బ్రెజిల్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ నియంత్రణా సంస్థల అనుమతులు పక్కకుపెట్టారని, స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యాక్సిన్ ఒప్పందానికి ఆమోదం తెలిపారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విచారణ చేపడుతున్నామని బ్రెజిల్ సుప్రీంకోర్టు సైతం ప్రకటించింది. అధ్యక్షుడిపై ఆరోపణలకు సంబంధించి ఆధారాల్ని సేకరించాలని సుప్రీం న్యాయమూర్తి రోసా వెబర్ దర్యాప్తు బృందానికి ఆదేశాలు జారీచేశారు.వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాలు పక్కకు పెట్టిమరీ తనకు కావాల్సిన వ్యక్తులకు వ్యాక్సిన్ కొనుగోలు కాంట్రాక్ట్ అప్పజెప్పారా? అనేది పరిశీలించాలని న్యాయమూర్తి వెబర్ దర్యాప్తు అధికారులకు సూచించారు
బోల్సోనారోకు వ్యతిరేకంగా నిరసనలు
కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాక్జిన్ డీల్ విషయంలో బ్రెజిల్ ప్రధాని జైర్ బోల్సోనారోకు ఆ దేశంలో నిరసనకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు వినిపించారు. కోవిడ్ వ్యాక్సిన్ డీల్లో అవినీతి ఆరోపణలో విషయంలో ప్రస్తుతం ఆయన విచారణను ఎదుర్కొంటున్న విషయం విదితమే. బ్రెజిల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు చేస్తున్న ఆందోళనలు మూడో రోజుకు చేరుకున్నాయి. దేశంలో అధిక మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని రియో డి జనీరోలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న ఫిజిషియన్ లీమా మెండెస్ ఆరోపించారు. '' అనాలోచిత నిర్ణయాలు, తప్పుడు వార్తలు, అబద్దాల తో బ్రెజిల్ ప్రభుత్వం ఐదు లక్షల మందికి పైగా ప్రజలను చంపింది'' అని ఆమె అన్నారు. రియో డి జనీరోతో పాటు సావ్ పౌలో, బెలెం, రిసైఫ్, మాసియో వంటి నగరాల్లో బోల్సోనారోకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు.