Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టాన్ స్వామి మృతిపై ఐరాస మానవ హక్కుల సంఘం
న్యూయార్క్ : మానవతావాది, ఆదివాసీల గొంతుక, సామాజిక కార్యకర్త స్టాన్ స్వామి (84) ఇకలేరనే వార్త తమను ఎంతగానో కలిచివేసిందని ఐక్యరాజ్యసమితి(ఐరాస) మానవ హక్కుల విభాగం తెలిపింది. జైలులో ఆయన మృతిచెందటం తమను తీవ్రంగా ఆవేదనకు గురిచేసిందని, తమ మనసులు ఎంతగానో ఆందోళన చెందాయని ఐరాస మానవ హక్కుల విభాగం హై కమిషనర్ అధికార ప్రతినిధి లిజ్ త్రోసెల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..'' ఫాదర్ స్టాన్ స్వామిపై పలు కేసులు నమోదుచేయటాన్ని, ఆయన్ని అకారణంగా నిర్బంధించటాన్ని హై కమిషనర్ మిచెల్లీ బాచ్లెట్, ఐరాస స్వతంత్ర నిపుణులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై భారత ప్రభుత్వానికి తమ స్పందన తెలియజేశారు. స్టాన్ స్వామి సహా 15మందిని హక్కుల కార్యకర్తలను విడుదల చేయాలని కూడా కోరారు'' అని అన్నారు.బీమా కోరేగావ్ హింసకు సంబంధించి ఎల్గార్ పరిషత్ కేసులో ఉపా చట్టం కింద స్టాన్ స్వామిని మోడీ సర్కార్ అరెస్టు చేసింది. ఉపా కేసులో ఎన్ఐఏ గత నెల బాంబే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. స్టాన్ స్వామికి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని కోరింది. తన వయస్సు, ఆరోగ్య పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని బెయిల్ మంజూరు చేయాలని స్టాన్ స్వామి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. శనివారం బెయిల్ పిటిషన్ వాయిదాపడిందని తెలియగానే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. బెయిల్ పిటిషన్పై సోమవారం మధ్యాహ్నం కోర్టు విచారణ ప్రారంభం అవుతుందనేలోగా ఆయన కన్నుమూశారు.
ఉపా దుర్వినియోగంపై ఐరాస ఆగ్రహం
ఉపా చట్టాన్ని అడ్డుపెట్టుకొని అనేకమంది హక్కుల కార్యకర్తలను భారత ప్రభుత్వం జైల్లో నిర్బంధిస్తోందని ఐరాస మానవ హక్కుల విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టపరంగా సరైన ఆధారాల్లేని వారిని జైళ్ల నుంచి విడుదల చేయాలని, రాజకీయంగా విమర్శించేవారిని, వ్యతిరేకించేవారిని అక్రమంగా నిర్బంధించరాదని ఐరాస ప్రతినిధి త్రోసెల్ భారత్కు సూచించారు. స్టాన్ స్వామి మృతి మానవ హక్కుల వాదానికి తీరని లోటుగా ఐరాస ప్రత్యేక రిపోర్టర్ మేరా లాలర్ అన్నారు. తప్పుడు ఆరోపణలతో స్వామిని నిర్బంధించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవతావాదుల్ని ఈ విధంగా నిర్బంధించటం క్షమించరాని తప్పు..అని అన్నారు.