Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 52 మంది మృతి, 30 మందికి గాయాలు
ఢాకా : బంగ్లాదేశ్లో మరో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. రాజధాని ఢాకా వెలుపల షెజాన్ పండ్ల రసాల తయారీ ఫ్యాక్టరీలో జరిగిన ఈ ప్రమాదంలో ఇంతవరకు 52 మంది మరణించారు. మరో 30 మంది దాకా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఫ్రంట్ గేట్, బయటకు వెళ్లే గేటుకు తాళాలు వేసి ఉండడం వల్ల తప్పించుకునే మార్గం లేక చాలా మంది అగ్ని కీలల్లో చిక్కుకున్నారు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి చెలరేగిన మంటలు శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎగసిపడుతూనే ఉన్నాయి. కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతటా విషాదం అలముకుంది. ఈ ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు ఏడుగురు సభ్యులతో దర్యాప్తు కమిటీని వేస్తున్నట్టు జిల్లా మెజిస్ట్రేట్ వెల్లడించారు. షెజాంగ్లోని ఆరంతస్తుల భవనంలో మూడు ఫ్యాక్టరీలు (పండ్ల రసాల పానీయాల తయారీ, ప్యాకింగ్ మెటీరియల్, ప్లాస్టిక్ ఉత్పత్తులు) నడుస్తున్నాయి. బంగ్లాదేశ్ ఫ్యాక్టరీల్లో పనిపరిస్థితులు అధ్వానంగా ఉండడం వల్ల ప్రమాదాలు తరచూ సంభవిస్తుంటాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు కొంత మంది పై ఫ్లోర్ నుంచి దూకేశారు. బంగ్లాదేశ్ కర్మాగారాల్లో ముఖ్యంగా దుస్తుల ఫ్యాక్టరీలో ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. 2012-19 మధ్య 150కిపైగా ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు కార్మికుల హక్కుల సంస్థ తెలిపింది. 2019 ఫిబ్రవరిలో ఢాకాలో రసాయనాలు అక్రమంగా నిల్వ ఉంచిన అపార్టుమెంటులో ప్రమాదం సంభవించి 70 మంది చనిపోయారు. 2013లో తొమ్మిదంతస్తుల భవనం ఒకటి కుప్పకూలి 1100 మంది దాకా చనిపోయారు. చాలా ఫ్యాక్టరీల్లో యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలను గాలికొదిలేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.