Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరాక్‌లో 52మంది మృతి
బాగ్దాద్ : ఇరాక్‌లోని ఓ కోవిడ్ హాస్పిటల్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 52మంది కరోనా బాధితులు చనిపోగా, మరో 22మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవాళ్లంతా కరోనా పేషంట్లేనని అధికారులు ధృవీకరించారు. మంటలు, పొగ దట్టంగా అలుముకోవడంతో ప్రమాద తీవ్రత మరింతగా ఉండే అవకాశముందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇరాక్‌లోని నసీరియా పట్టణంలోని అల్-హుస్సేన్ కోవిడ్ ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రి ప్రాంగణంలోని ఆక్సీజన్ ట్యాంక్ పేలి మంటలు వార్డుకు వ్యాపించినట్టు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి.ఆ సమయంలో ఐసోలేషన్ వార్డులో ఉన్న పేషంట్లంతా మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేశారు. అర్ధరాత్రి సమయం కావడంతో ఒకరిద్దరు నర్సులు తప్ప అక్కడ ఎవరూ లేరు. దాంతో పేషంట్లను రక్షించే ప్రయత్నాలు ఫలించలేదు. 70 పడకలతో 3 నెలల క్రితం ఈ కరోనా వార్డును ప్రారంభించారు. ఇరాక్‌లో గత మూడునెలల్లో ఇలాంటి ఘటన రెండోది ఇది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజధాని బాగ్దాద్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో 82మంది మరణించగా, 110మంది గాయపడ్డారు. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు బృందాలు ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. ఆసుపత్రిని మంటలతోపాటు దట్టమైన పొగలు అలుముకున్నాయి. దాంతో కోవిడ్ వార్డుల్లో చిక్కుకున్న బాధితులను వెలుపలికి తీసుకొచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు ఆరోగ్య సిబ్బంది తెలిపారు. ఇరాక్‌లో ఇప్పటివరకు 14లక్షల కోవిడ్ కేసులు నమోదుకాగా, 17వేలమందికిపైగా మృతిచెందారు.