Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికాలో లూటీలు
జోహెన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జైలుకు వెళ్లడంతో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.కీలక వాణిజ్య కేంద్రాలుగా ఉన్న ప్రావిన్సుల్లో జరుగుతున్న నిరసనలు అల్లర్లు, దోపిడీలకు దారితీశాయి. దీంతో గౌటెంగ్, క్వాజులు-నాటాల్ ప్రావిన్సుల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటల్లో ఇప్పటివరకు 32 మంది ప్రాణాలు కోల్పోయినట్టు దక్షిణాఫ్రికా అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఆందోళనకారులు దుకాణాలను లూటీ చేస్తోన్న సమయంలోనే ఈ తొక్కిసలాటలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.క్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా(79)కి మద్దతుగా గతవారం ప్రారంభమైన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. ఇందులో పాల్గొంటున్న ఆందోళనకారులు దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రజలు, నిరసనకారులు ఆహారం, ఎలక్ట్రానిక్ పరికరాలు, మద్యం, వస్త్రదుకాణాలు, షాపింగ్ మాల్స్‌పై దాడి చేసి వాటిని లూటీ చేస్తున్నారు. పోలీసులు, సైన్యాన్ని రంగంలోకి దించినప్పటికీ పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాగా 2009 నుంచి 2018 వరకు దాదాపు తొమ్మిదేండ్లపాటు దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఉన్న జాకబ్ జుమాపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. దర్యాప్తు కమిషన్ ముందు హాజరు కావాలని జుమాను ఆదేశించినప్పటికీ ఆయన స్పందించలేదు. దీంతో ధిక్కరణ కింద 15నెలల జైలు శిక్ష విధించిన కోర్టు.. పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ఐదారు రోజుల్లో లొంగిపోకపోతే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జైలుకు వెళ్లి లొంగిపోవాల్సి వచ్చింది. ఒక మాజీ అధ్యక్షుడికి జైలు శిక్ష విధించడం దక్షిణాఫ్రికా దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.