Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీటీపీ-1 మొదటి డోసు అందలేదు : డబ్ల్యూహెచ్ఓ
జెనీవా : భారత్‌లో 30లక్షల మంది చిన్నారులకు గతేడాది డీటీపీ-1 వ్యాక్సిన్ మొదటి డోసు వేయలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. 2019తో పోలిస్తే.. ప్రపంచవ్యాప్తంగా 3.5 మిలియన్ల మంది చిన్నారులు డీటీపీ వ్యాక్సిన్ మొదటి డోసును పొందలేదని, 3 మిలియన్ల మంది చిన్నారులు మీజిల్ (తట్టు) మొదటి డోస్‌ను పొందలేదని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రస్తుతం అసురక్షిత చిన్నారుల (సరైన సమయంలో తీసుకో వాల్సిన వ్యాక్సిన్లను పొందలేకపోతున్న వారు) చిన్నారుల వాటా పెరుగుతున్నదని యూనిసెఫ్ ఒక నివేదికలో తెలిపింది. ముఖ్యంగా భారత్‌లో అధిక శాతం మంది చిన్నారులు వ్యాక్సిన్ పొందడం లేదనీ, డీటీపీ -3 మోతాదుల పొందిన వారి సంఖ్య 91 శాతం నుంచి 85 శాతానికి పడిపోయిందని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా గతేడాది కరోనా మహమ్మారి కారణంగా ప్రాథమిక ఆరోగ్య సేవలను ప్రభావితం చేయడంతో.. 23 మిలియన్ల చిన్నారులు సాధారణ వ్యాక్సిన్లు కూడా పొందలేకపోయారని తెలిపింది. 17 మంది మిలియన్ చిన్నారులు ఒక్క వ్యాక్సిన్ డోసు కూడా తీసుకోలేదనీ, ఇది వ్యాక్సిన్ పొందడంలో తీవ్రమైన అసమానతలకు దారితీస్తోందని అన్నారు. కరోనాపై ప్రత్యేక చికిత్స కేంద్రాలకు అధిక శాతం వనరులు, సిబ్బందిని మళ్లించడంతో.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సేవలు తగినంతగా కొనసాగలేదని వెల్లడించింది. కొన్ని దేశాల్లో ఆరోగ్య కేంద్రాలను మూసివేశారు. మరికొన్ని దేశాల్లో సమయాలను తగ్గించడం వంటివి జరిగాయని.. ప్రజలు కూడా కరోనా వ్యాప్తికి భయపడి తమ చిన్నారులకు వ్యాక్సిన్లు వేయించలేదని తెలిపింది. మరోవైపు లాక్‌డౌన్‌తో రవాణా సేవలు నిలిచిపోవడంతో ఆరోగ్య కేంద్రాలకు చేరుకునే అవకాశం లేకపోయిందని వెల్లడించింది.కరోనా వైరస్ భయాందోళనలతో.. చిన్నారులకు ఇతర టీకాలు కూడా నిలిపివేసి.. భవిష్యత్ తరాలను ఆందోళనలోకి నెట్టివేశామని.. మిజిల్స్,పోలియో, మెనింజైటిస్ వంటి నివారించగల వ్యాధుల బారిన పడే ప్రమాదానికి చిన్నారులను గురిచేస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ఆందోళన వ్యక్తం చేశారు.