Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 111 దేశాల్లో డెల్టా వేరియంట్.. కరోనా ముప్పు తొలగిపోలేదు
- సంపన్న దేశాల వద్దే అధిక వ్యాక్సిన్లు
- కోవిడ్-19 ఉధృతిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఇంకా తొలగిపోలేదనీ, థర్డ్‌వేవ్ ముంచుకొస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. అన్ని దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా డెల్టా వేరియంట్ ముప్పు ఇంకా తొలగిపోలేదనీ, సంబంధిత కేసులు అన్ని ప్రాంతాల్లోనూ పెరుగుతున్నాయని పేర్కొంది. దురదృష్టవశాత్తు మనమిప్పుడు థర్డ్ వేవ్ ప్రారంభంలో ఉన్నామంటూ డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 13 నాటికి 111 దేశాల్లో డెల్టా వేరియంట్ ఉనికి ఉందనీ, మున్ముందు ఇది మరింత పెరిగే అవకాశముందని అన్నారు. డెల్టా వేరియంట్‌తో పాటు ఆల్ఫా వేరియంట్ 178 దేశాల్లోనూ, బీటా రకం 123, గామా వేరియంట్ 75 దేశాలకు విస్తరించిందని తెలిపారు. ప్రమాదకర వేరియంట్లలో డెల్టా వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉందని అన్నారు.
కాగా, కరోనా వైరస్ నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటాకి ప్రస్తుతం మనముందున్న ఏకైక మార్గం టీకాలనీ, అయితే, ఇంకా వ్యాక్సిన్లు ప్రజలకు తగినంతగా అందించకపోవడంతో ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఇప్పటివరకు ప్రపంచంలోని నాలుగోవంతు జనాభాకు మాత్రమే తొలి విడత వ్యాక్సిన్ అందిందనీ, ఈ విషయంలో సంపన్న దేశాలే ఎక్కువ టీకాలు అందుకున్నాయని తెలిపింది. అలాగే, ప్రపంచంలో అనేక దేశాలకు ఇప్పటివరకు ఏ వ్యాక్సినూ అందలేదని పేర్కొంది. కరోనా ఉధృతి కొనసాగుతున్న చాలా దేశాలకు సరిపడా వ్యాక్సిన్లు అందలేదని తెలిపింది. అన్ని దేశాల్లోనూ సెప్టెంబర్ నాటికి కనీసం 10శాతం మంది జనాభాకు టీకాలు అందేలా చర్యలు వేగవంతం చేయాలని సూచించింది. రాబోయే డిసెంబర్ చివరి నాటికి మొత్తం జనాభాలో 40శాతం మందికి, 2022 మధ్యకాలం నాటికి 70శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని పేర్కొంది. ప్రమాదకర వేరియంట్ల వ్యాప్తి అధికం కావడంతో పాటు పలు దేశాల్లో కరోనా ఆంక్షలు సడలించడం, సామాజిక కార్యకలాపాలు పెరగడం, మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంతో పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. దీని కారణంగా ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెరిందని తెలిపింది. వ్యాక్సిన్లు అధికంగా అందించిన యూరోపియన్ దేశాలు, ఉత్తర అమెరికా దేశాల్లో కేసులు, మరణాలు కాస్త తగ్గాయని పేర్కొంది. ''థర్డ్‌వేవ్ ప్రారంభంలో ఉన్నాం.. కాబట్టి వ్యాక్సిన్లు అందరికీ అందేలా చర్యలు పెరగాలని'' టెడ్రోస్ ప్రపంచదేశాలను కోరారు. కరోనా పోరులో కలిసిముందుకు సాగాలని సూచించారు.