Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈయూ ఔషధ నియంత్రణ సంస్థ వెల్లడి
- గ్రీన్ పాస్ రాక..ఈయూ వెళ్లలేకపోతున్న ప్రయాణికులు
లండన్ : యూరోపియన్ యూనియన్‌లోని 27 సభ్యదేశాల్లో ఏ దేశానికి వెళ్లాలన్నా..ఈయూ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదముద్ర వేసిన వ్యాక్సిన్‌ను పొందివుండాలి. వ్యాక్సిన్ పాస్‌పోర్ట్‌లో భాగంగా జులై 1 నుంచి ఈయూ కూటమి 'గ్రీన్ పాస్' మంజూరు చేస్తోంది. మోడెర్నా, పిఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, ఆస్ట్రాజెనికా కంపెనీలు తయారుచేసిన వ్యాక్సిన్లు మాత్రమే ఈ గ్రీన్ పాస్ జాబితాలోకి చోటు దక్కించుకున్నాయి. మనదేశంలో అత్యధికమంది పొందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు గ్రీన్ పాస్‌లో చోటు దక్కలేదు. కోవిషీల్డ్ తయారుచేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గ్రీన్ పాస్ కోసం దరఖాస్తు చేయలేదని ఈయూ ఔషధ నియంత్రణ సంస్థ తాజాగా వెల్లడించింది.ఆస్ట్రాజెనికా తయారుచేసిన వాక్స్జవేరియా, సీరం తయారుచేసిన కోవిషీల్డ్ తయారీలో మూల సూత్రం, సాంకేతిక పరిజ్ఞానం ఒకటే అయినప్పటికీ..కోవిషీల్డ్‌కు ప్రత్యేక అనుమతి ఉండాల్సిందేనని ఈయూ ఔషధ నియంత్రణ సంస్థ గత నెలలో ప్రకటించింది. అయితే సీరం కంపెనీ నుంచి ఇప్పటివరకూ దరఖాస్తు రానందున, పూణెలోని తయారీ యూనిట్‌ను సందర్శించే కార్యక్రమం ఇప్పటివరకూ జరగలేదని ఈయూ తెలిపింది. ఉన్నత విద్య, వాణిజ్యం, ఇతర కార్యక్రమాల కోసం ఈయూ దేశాలకు వెళ్లాలనుకునేవారికి కోవిడ్ నేపథ్యంలో సమస్యలు ఎదురవుతున్నాయి. గ్రీన్‌పాస్‌లో కోవిషీల్డ్ లేకపోవటం వల్ల ఎంతో మంది పర్యాటకులు ఇబ్బందికి గురవుతున్నారు.అయితే ఈ సమస్యపై సీరం సంస్థ చీఫ్ అదర్ పూనావాలా మాట్లాడుతూ, గ్రీన్ పాస్ విషయంపై ఉన్నతస్థాయి ప్రభుత్వవర్గాలతో మాట్లాడుతున్నామని కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అయితే సమస్య పరిష్కారం మాత్రం కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఈయూకు వెళ్లాలనుకునే వారి ప్రయాణాలు రద్దవుతున్నాయి. కోవిన్ వెబ్సైట్ నుంచి జారీ అయ్యే డిజిటల్ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌కు ఆమోదముద్ర వేయాలని భారత విదేశాంగ శాఖ అధికారులు ఈయూ కూటమితో చర్చలు జరుపుతున్నారని సమాచారం.