Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాకు చైనా హెచ్చరిక
బీజింగ్ : అమెరికా సైనిక రవాణా విమానం గురువారం తైవాన్‌లో ల్యాండ్ అవడంపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిప్పుతో చెలగాటమాడొద్దని అమెరికాను అది గట్టిగా హెచ్చరించింది. తమ సార్వభౌమాధికారాన్ని పదే పదే ఉల్లంఘిస్తే పర్యవసానాలు తీవ్రంగా వుం టాయి. గత రెండు మాసాల్లో చైనా భూభాగంలో దిగిన రెండో అమరికా మిలిటరీ విమానం ఇది. దక్షిణ చైనా సముద్రంలో వివాదాస్పద జలాల్లోకి వచ్చిన అమెరికా యుద్ధ నౌకను చైనా ఆర్మీ తరిమికొట్టిన కొద్ది రోజులకే తాజాగా ఈ సంఘటన చోటుచేసుకుంది. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వూ కియాన్ మాట్లాడుతూ, ప్రభుత్వ అనుమతితోనే చైనా భూభాగంలో దిగడానికి వీలు వుంటుందని స్పష్టం చేశారు. విదేశీ నౌకలు లేదా విమానాలు చైనా గగన తలాన్ని ఉల్లంఘిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. దుస్సాహసంతో కూడిన, కవ్వింపు చర్యలను తక్షణమే నిలుపుచేయాలని అమెరికాను కోరారు. తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలు చెలరేగకుండా నివారించాలన్నారు. గతేడాది తైవాన్‌కు ఆయుధాల విక్రయాలను అమెరికా ఆమోదించింది. పరిస్థితిని తప్పుగా అంచనా వేయవద్దని, సమస్యలు తీసుకురావద్దని తైవాన్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ అథారిటీకి స్పష్టం చేసినట్లు వూ పేర్కొన్నారు.