Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ మానవ హక్కుల చరిత్రలో మాయని మచ్చ
- సామాజిక కార్యకర్తల ఉనికికే ప్రమాదం : ఐరాస నిపుణురాలు
ఐరాస : ఆదివాసీయుల హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి కస్టడీలో మరణించారన్న వార్త విని ఎంతో ఆవేదన చెందినట్టు ఐరాస మానవ హక్కుల నిపుణురాలు మేరీ లాలోర్ పేర్కొన్నారు. మానవ హక్కుల పరిరక్షకుడికి హక్కులను తిరస్కరించేందుకు కారణాలేమీ లేవని అన్నారు. ఆయన మరణం దేశ మానవ హక్కుల చరిత్రలో ఎప్పటికీ మాయని మరకగా ఉంటుందని అన్నారు. ఆయనను ఎందుకు విడుదల చేయలేదనీ, కస్టడీలో ఎందుకు చనిపోయారో చెప్పాలని ప్రశ్నించారు. ఎల్గార్ పరిషద్-మావోయిస్టుల లింక్ కేసులో స్టాన్ స్వామిని గత ఏడాది చట్ట వ్యతిరేక కార్యాకలాపాల కింద అరెస్టు చేయగా... ఈ నెల 5న ముంబయిలోని ఆస్పత్రిలో కన్నుమూసిన సంగతి విదితమే. ఆయన మరణంతోనైనా మేల్కోవాలన్న ఆమె.. మానవ హక్కుల పరిరక్షులు, సరైన చట్టప్రాతిపదిక లేకుండా అక్రమంగా నిర్బంధించిన వారందరినీ విడుదల చేయాలని అన్ని దేశాలను కోరారు. ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, 40 ఏండ్ల పాటు సామాజిక న్యాయం కోసం పోరాడిన కాథలిక్ మత గురువు స్టాన్ స్వామి క్టసడీ మరణం... భారత మానవ హక్కుల చరిత్రలో ఎప్పటికీ మాయని మచ్చ అని పేర్కొన్నారు. 'మానవ హక్కుల పరిరక్షకుడిని ఉగ్రవాదిగా ముద్రించడం క్షమించరానిది. ఆయన అలా మరణించడానికి ఆస్కారం లేదు. కానీ మరెవ్వరూ కూడా ఆయనలా బలికాకూడదు' అంటూ ఆమె వ్యాఖ్యానించారు. కాగా, స్టాన్ స్వామి కేసులో అంతర్జాతీయ విమర్శలను భారత్ ఖండించింది. అక్టోబర్‌లో ఉగ్రవాదం ఆరోపణలు గుప్పించి అరెస్టు చేశారని, వేధింపులకు గురయ్యారని, పలుమార్లు ప్రశ్నించారని మేరీ లాలోర్ అన్నారు. 2020 నవంబర్‌లో ఆయన కేసులో ఐరాస ప్రతినిధులు భారత్‌లో చర్చించారని గుర్తు చేసుకున్న ఆమె... ఆయనను ఎందుకు విడుదల చేయలేదని, కస్టడీలో ఎందుకు చనిపోయారో చెప్పాలని భారత్‌ను ప్రశ్నించారు.
ఆదివాసీ మైనార్టీలు, దళితుల కోసం ముఖ్యంగా .. అక్రమ భూ సేకరణ వంటి విషయాల్లో వారికి అండగా స్టాన్ స్వామి దశాబ్దాలుగా పోరాటం చేశారని మేరీ అన్నారు. పర్యావరణం, భూమి, స్వదేశీ ప్రజల హక్కులపై పోరాటం చేసే సామాజిక కార్యకర్తల ఉనికి చాలా ప్రమాదంలో ఉన్నదని తెలుసునని అన్నారు.