Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారికి మౌలిక సదుపాయాలు కల్పించండి
- భారత్‌కు ఐక్యరాజ్య సమితి నిపుణుల లేఖ
జెనీవా: హర్యానాలోని ఖోరీ గ్రామానికి చెందిన దాదాపు లక్ష మందిని అక్కడి నుంచి తరలించడంపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషనరేట్ (యూఎస్హెచ్ఆర్) విస్మయం వ్యక్తం చేసింది. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పరిష్కరించకుండా ఉన్న పళంగా వారిని ఇతర ప్రాంతాలకు తరలించడంక ఆశ్చర్యానికి గురిచేసిందనీ, కరోనా సంక్షోభ సమయంలో ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని నొక్కి చెప్పింది. ఖోరీ గ్రామ ప్రజలను తరలించవద్దని భారత ప్రభుత్వాన్ని కోరుతూ.. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల నిపుణుల కమిటీ లేఖ రాసింది. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో ఖోరీ గ్రామ ప్రజలను మరో చోటుకు తరలించేందుకు హర్యానా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పలువురు అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లారు. ఖోరీ గ్రామస్థులకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయన్న సాకుతో ఇతర ప్రాంతాలకు ప్రజలను తరలిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషనరేట్‌కు విన్నవించారు. ఈ క్రమంలోనే యూఎన్‌హెచ్‌ఆర్ పై విధంగా స్పందించింది. కరోనా పంజా విసురుతున్న తరుణంలో ఇలాంటి నిర్ణయాలు మరిన్ని సమస్యలను సృష్టిస్తాయని తెలిపింది. కాగా, ఖోరీ గ్రామంలోని దాదాపు 172 ఎకరాల భూమిని అటవీ భూమిగా అధికారులు గుర్తించారు. దీనిలోని 80 ఎకరాల్లో ప్రజలు ఇండ్లు కట్టుకుని నివసిస్తున్నారు. దీనిపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు 80 ఎకరాల్లో ఇండ్లను ఖాళీ చేయించాలని గత నెల 7న తీర్పునిస్తూ హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు విషయాన్ని దాచిపెట్టి కొందరు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషనరేట్‌కు ఫిర్యాదు చేశారనీ, ఫలితంగానే ఇలాంటి సూచనలు వచ్చాయని అధికారులు చెప్తున్నారు. అలాగే, తాము దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఖోరీ గ్రామ ప్రజలను వేరే చోటుకు తరలిస్తున్నామని తెలిపారు.