Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వందలాది మంది ఆచూకీ గల్లంతు
బెర్లిన్ : యూరప్‌లోని జర్మనీ, బెల్జియంలో సంభవించిన వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 183కి పెరిగింది. భారీ వర్షాల కారణంగా నదుల కట్టలు తెగిపోయి పోటెత్తిన వరదల కారణంగా రెండు దేశాల్లోని వందలాది ఇళ్లు ధ్వంసమైన విషయం తెలిసిందే. అనేక ప్రాంతాల్లో రోడ్డు కొట్టుకుపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒక్క జర్మనీలోనే 156 మంది మరణించారని, గత అర్ధ శతాబ్ధంతో ఇదే అత్యంత ఘోరమైన ప్రకృతి విపత్తు అని అక్కడి అధికారులు తెలిపారు. జర్మనీలోని అహర్వీలర్ జిల్లాలో సుమారు 110 మంది మరణించగా, వందలాది మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వరద నీటి మట్టం భారీగా ఉండడం కారణంగా పలు ప్రాంతాలకు ఇంకా కనెక్టవిటీ కూడా లేదని తెలిపారు. ఉత్తర రైనే-వెస్ట్పలియా రాష్ట్రంలోని ఎర్ప్స్టాడ్ ప్రాంతంలో జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ శనివారం పర్యటించారు. వరద సృష్టించిన విలయంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, బాధితులకు అండగా ఉంటాయని పేర్కొన్నారు. ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ కూడా ఆదివారం రైన్‌ల్యాండ్-పాలటినేట్ రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉంది. కొలోన్ సమీపంలోని వాస్సెన్బర్గ్ పట్టణంలో ఉన్న ఒక డ్యామ్ తెగిపోవడంతో దాదాపు 700 మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. మరోవైపు బెల్జియంలో మరణాల సంఖ్య 27కు పెరిగిందని అక్కడి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. చాలా ప్రాంతాలు ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేకపోవడంతో అంథకారంలోనే ఉన్నాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. వదరల్లో చిక్కుకున్న వారిని సహాయక బందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. జర్మనీ, బెల్జియంతో పాటు నెదర్లాండ్స్ దక్షిణ భాగాలు కూడా భారీ వరదలతో దెబ్బతిన్నాయి.