Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాతో బెల్జియంలో వలసదారుల వెతలు
- ఉపాధి గల్లంతుతో ప్రమాదంలో జీవనం
బ్రసెల్స్ : బెల్జియంలోని బ్రసెల్స్‌లో ఏండ్ల కిందట వచ్చి స్థిరపడిన వలసదారుల ఆందోళన ఉధృతమౌతోంది. తమకు చట్టబద్ధమైన గుర్తింపునిచ్చి ఉపాధి కల్పించడంతో పాటు ప్రభుత్వ సేవలు అందేలా చూడాలని డిమాండ్ చేస్తూ దాదాపు 400 మందికి పైగా వలసదారులు 55 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్నారు. కరోనా మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయి తమ జీవనోపాధి ప్రమాదంలో పడిందని, తమకు మరేదిక్కు లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వలస కార్మికుల్లో ఉత్తర, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు. బ్రసెల్స్ నగరంలోని బెగునేజ్ చర్చి, వియుబి యూనివర్సిటీ క్యాంపస్ ప్రాంగణంలో ప్రారంభించిన నిరాహాదీక్షల్లో మొదటి ఆహారం, తరువాత వైద్యాన్ని నిరాకరించిన ఆందోళనకారులు, ఇప్పుడు నీరు తాగేందుకు కూడా తిరస్కరిస్తున్నారని వారికి మద్దతు తెలుపుతున్న సంస్థ యుఎస్పిఆర్ తెలిపింది. ఈ వలసదారుల వద్ద ఎటువంటి గుర్తింపు లేనందు వలన నివాస హోదాను కూడా పొందలేకపోతున్నారు. ఇదే సమయంలో చట్టబద్ధంగా పనిచేయలేక, బెల్జియంలో నివసించలేక నానాఇబ్బందులు పడుతున్నారు. గంటకు 3 యూరోలు(రూ.264) మాత్రమే ఇస్తూ.. తమచేత చట్టవిరుద్ధంగా పనిచేయించుకున్న కాంట్రాక్టర్ల చెర నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. బెల్జియంలో ఇటువంటి గుర్తింపు పత్రాలు లేని వలసదారులు దాదాపు లక్ష 50 వేల మంది ఉంటారని అంచనా. నిరాహారదీక్షలు 55వ రోజుకు చేరుకుందని, ఇప్పటికే ఒక క్లిష్టమైన దిశలో ఉన్నదనీ.. ఇటువంటి సమయంలో కొంత నష్టం జరిగినా తిరిగి పూడ్చలేనిదిగా ఉంటుందని యూఎస్పీఆర్ ఆందోళన వ్యక్తం చేసింది.