Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనల తర్వాత కొంతమంది
- కనిపించడంలేదన్న ఆరోపణలపై క్యూబా
హవానా : దేశంలో ఇటీవల జరిగి ఆందోళనల తర్వాత కొంతమంది కనిపించకుండా పోయారన్న ఆరోపణలను క్యూబా ఖండించింది. ఖైదీల చట్టబద్ధమైన హామీల పట్ల నిబద్ధతను పునరుద్ఘాటించింది. తాజాగా ఒక టివి కార్యక్రమంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ (ఎంఐఎన్ఐఎన్టి) డిప్యూటీ చీఫ్ కల్నల్ విక్టర్ అల్వరెజ్ ఈ ప్రకటన చేశారు. ఎవరినైనా పోలీస్‌స్టేషన్‌కు తీసుకుపోయిన తర్వాత మొదటగా వారి అరెస్టు విషయాన్ని నమోదు చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించి సదరు కుటుంబానికి 24 గంటల్లోగా తెలియపరుస్తామని, ఎంఐఎన్ఐఎన్టికి ఆ తరహా కమ్యూనికేషన్ వ్యవస్థ ఉందని వివరించారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా సంస్థలు కనిపించకుండా పోయిన ప్రజల జాబితా పేరుతో చేస్తున్న ప్రచారానికి ఎటువంటి ప్రామాణికత, తీవ్రత లేదని స్పష్టం చేశారు. ఆయా మీడియా సంస్థలు చెబుతున్న వారిలో అనేక మంది ప్రస్తుతం తాము అదుపులోకి తీసుకున్న వారి జాబితాలోకి లేనేలేరని, దీనిపై తాము పరిశీలన కూడా చేశామని తెలిపారు. ఇతర వివరాలు లేకుండా ఒకే ఇంటిపేరుతో అనేక పేర్లను మీడియా ప్రచారం చేస్తోందని అన్నారు. ఇది క్యూబా విప్లవ వ్యతిరేక శక్తులు చేస్తున్న ప్రచారం అని అల్వరెజ్ పేర్కొన్నారు. ఒప్పుకోలు కోసం అరెస్టయిన వారిపై బలప్రయోగం చేస్తున్నామన్న ప్రచారాన్ని కూడా కొట్టిపారేసిన ఆయన హింస, ఇతర అమానవీయ విచారణ తీరుకు వ్యతిరేకంగా క్యూబా ఒక ఒప్పందంపై సంతకం చేసిందన్న విషయాన్ని గుర్తుచేశారు.