Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిడ్నీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడంతో కేసులు పెరుగుతుండటంపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. ''నేను విఫలమయ్యాను. ఈ ఏడాది ప్రారంభంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోలేకపోయాను. అందుకు క్షమాపణలు కోరుతున్నా. టీకా కార్యక్రమం ఇంత నెమ్మదిగా సాగుతున్నందుకు నేనే బాధ్యత తీసుకుంటున్నా. ఇప్పటికే ఎదురైన సవాళ్లన్నింటికీ నేనే బాధ్యుణ్ణి. కొన్ని అంశాలు మన నియంత్రణలో ఉన్నాయి.. మరికొన్ని లేవు'' అంటూ మోరిసన్ విచారం వ్యక్తం చేశారు. కాగా, ఆస్ట్రేలియాలో 11 శాతం మందికే టీకాలు అందించారు. ప్రపంచంలోని ధనిక దేశాలతో పోలిస్తే.. అత్యంత తక్కువ వాక్సినేషన్ ఇది. కరోనా కట్టడికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటున్నా.. సిడ్నీ, న్యూసౌత్ వేల్స్లో రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో లాక్డౌన్ సైతం కొనసాగుతోంది. కరోనా సోకినా చాలా మంది ఐసోలేషన్ లోకి వెళ్లట్లేదనీ, ఇది చాలా ప్రమాదకరమనీ, కేసులు మరింత పెరిగే ప్రమాదముందని న్యూసౌత్ వేల్స్ అధ్యక్షురాలు గ్లేడిస్ బియర్జిక్లయన్ హెచ్చరించారు. అందరికీ వ్యాక్సిన్ అందే వరకూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.