Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మెచిచీ తొలగింపు
- అధ్యక్షుడు సయీద్ కీలక నిర్ణయం
టునిస్ : ఉత్తరాఫ్రికా దేశమైన టునీషియాలో ఆదివారం కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్‌ను సస్పెండ్ చేయడంతో పాటు ప్రధాని హిచేమ్ మెచిచీని తొలగిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు కైస్ సయీద్ ప్రకటించారు. దేశంలో కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ అధికార పార్టీకి వ్యతిరేకంగా పెద్దయెత్తున దేశంలో ఆందోళనలు చోటుచేసుకున్న తరువాతి రోజునే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అధ్యక్ష భవనంలో ఆదివారం అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం అనంతరం సయీద్ ఈ ప్రకటన చేశారు. అంతకుముందు అధికార పార్టీకి వ్యతిరేకంగా వేలాది సంఖ్యలో టునిషియన్లు దేశంంలోని పలు నగరాల్లో ర్యాలీలు నిర్వహించారు. రాజధాని టునిష్లో వందలాది సంఖ్యలో ఆందోళనకారులు పార్లమెంట్ ముందు నిరసనలకు దిగారు. అధికార ఎన్నాధా పార్టీతో పాటు ప్రధాని మెచిచీకి వ్యతిరేకంగా పెద్దయెత్తున నినాదాలు చేశారు. అదేవిధంగా గఫ్సా, ఖైరోన్, మొనాస్టిర్, సౌస్సే, టోజూర్లో ఆందోళనలు జరిగాయి. పార్లమెంట్‌ను రద్దు చేయాలని ఆందోళనకారులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆందోళనకారులు రాళ్లు విసరడంతో పోలీసులు టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారని అధికారులు తెలిపారు. పలువురు ఆందోళనకారులను అరెస్టు చేశారు.
'' పార్లమెంటు రద్దుకు రాజ్యాంగం అనుమతించదు, కానీ దాని పనిని నిలిపివేయడానికి అనుమతిస్తుంది'' అని అధ్యక్షుడు సయీద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టికల్ 80ను ఉటంకిస్తూ రాబోవు ప్రమాదం వంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఇటువంటి చర్య తీసుకోవచ్చని పేర్కొన్నారు. కొత్త ప్రధాని నియామకం తర్వాత ప్రభుత్వ సాయంతో తాను ఎగ్జిక్యూటివ్ కార్యకలాపాల అధికారాన్ని తీసుకుంటానని చెప్పారు. ట్యునీషియాలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. 1.2 కోట్ల మంది ఉన్న జనాభాలో ఇప్పటికే కరోనాతో 18 వేల మంది మరణించారు.