Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా ప్రకటన
వాషింగ్టన్ : యురోపియన్ ఒత్తిడిని పక్కకు నెట్టి అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు కొనసాగుతాయని అమెరికా సోమవారం ప్రకటించింది. దేశ, విదేశాల్లో పెరుగుతున్న డెల్టా వేరియంట్ కేసులను ప్రస్తావిస్తూ, ఈ సమయంలో ప్రయాణ ఆంక్షలు కొనసాగించాల్సిందేనని నిర్ణయించినట్టు వైట్‌హౌస్ పత్రికా కార్యదర్శి జెన్ సాకి విలేకర్లకు తెలిపారు. చాలా ఎక్కువగా సంక్రమణ సామర్ధ్యం వున్న డెల్టా వేరియంట్ ఇక్కడా, ప్రపంచ దేశాల్లో పెరుగుతున్నదని అన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున అమెరికన్ పర్యాటకులు ఎక్కువగా వెళ్ళడానికి ఇష్టపడే స్పెయిన్, పోర్చుగల్‌లకు పర్యటనలు మానుకోవాలని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సూచించింది. గత వారం బ్రిటన్‌కు ప్రయాణించవద్దని కోరిన అమెరికా సైప్రస్‌కు కూడా వెళ్లవద్దంటూ ఇవే మార్గదర్శకాలు జారీ చేసింది. అమెరికాలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. రాబోయే వారాల్లో ఈ కేసులు పెరుగుతునే వుంటాయని సాకి తెలిపారు. ఈ ప్రయాణ ఆంక్షలు ఏ విధంగా దోహదపడతాయని భావిస్తున్నారని ప్రశ్నించగా, అమెరికాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ ఎక్కువగానే వుంది. అయితే అంతమాత్రాన ఆ వేరియంట్ వున్న వారు ఎక్కువ మంది ఇక్కడ వుండాలనుకోవడం సరైన చర్య కాదని వ్యాఖ్యానించారు. కోవిడ్ వల్ల గత ఏడాదికి పైగా యురోపియన్ యూనియన్ దేశాలు, బ్రిటన్, చైనా, ఇరాన్‌లపై ప్రయాణ ఆంక్షలు విధించింది. ఆ తర్వాత బ్రెజిల్, భారత్‌లకు కూడా ఈ ఆంక్షలు విస్తరించాయి.