Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్/సిడ్నీ : అగ్రదేశాలైన అమెరికా, ఆస్ట్రేలియాల్లో డెల్టా వేరియంట్ పంజా విసురుతున్నది. అమెరికాలో ఒక్కరోజే 88,376 కొత్త కేసులు నమోదు కాగా, ఆస్ట్రేలియాలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు వెలుగుచూస్తున్నాయి. అమెరికాలో ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదుకావటం ఇదే మొదటిసారి. కరోనా వ్యాక్సిన్ పంపిణీలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ ఈ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 55శాతానికి మించి కనీసం ఒకడోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతున్న ప్రాంతాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి. జులై 25తో ముగిసిన వారంలో అగ్రరాజ్యంలో 5లక్షలకు పైగా కేసులు వెలుగుచూశాయి. గత వారంతో పోలిస్తే ఇది 131శాతం ఎక్కువ కావడం గమనార్హం. జూన్‌తో పోల్చుకుంటే ఇప్పుడు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి డెల్టా వేరియంట్ కారణమని నిపుణులు చెబుతున్నారు. కేసులు మళ్లీ పెరుగుతుండటంతో అమెరికాలోని పలు రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలను మళ్లీ అమల్లోకి తెస్తున్నాయి. అంతకుముందు కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో మాస్కు అవసరం లేదని ప్రకటించిన రాష్ట్రాలు, తాజాగా మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశిస్తున్నాయి.ఇటు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం సైతం డెల్టా వేరియంట్ ఉధృతి పెరిగింది. ఇటీవల కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇక్కడ నిబంధనలను సడలించారు. ఈ సడలింపులిచ్చి ఐదు వారాలు కూడా గడవక ముందే మరోసారి ఆంక్షల దిశగా చేరుకుంటుంది. ఆస్ట్రేలియాలోని ఆర్థిక నగరం న్యూ సౌత్ వేల్స్లో మంగళవారం 239 మంది కొత్త కేసులు వెలుగుచూశాయి. సిడ్నీలో కరోనా ఉధతి మొదలైన తర్వాత ఈ నగరంలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దీనికి డెల్టా వేరియంట్ కారణమని అధికారులు భావిస్తున్నారు.