Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: పదకొండు మంది తాలిబన్ల ప్రతినిధి బృందం చైనా విదేశాంగ మంత్రితో చైనాలో చర్చలు జరిపింది. ఈ సందర్భంగా తాలిబన్ల ప్రతినిధి బృందం నాయకుడు బారాదార్ మాట్లాడుతూ.. ఆఫ్ఘాన్ భూభాగం నుంచి చైనా వ్యతిరేక కార్యక్రమాలు జరపడానికి అవకాశముండదని స్పష్టంగా ప్రకటించారు. ఆఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా, నాటో దళాల ఉపసంహరణ జరుగుతున్న నేపథ్యంలో అక్కడి చాలా జిల్లాలను తాలిబన్లు స్వాధీనం చేసుకుంటున్న సందర్భంగా ఈ చర్చలు జరగడం కీలకంగా మారింది.చైనా విదేశాంగ మంత్రి వ్యాంగ్ మాట్లాడుతూ ఆఫ్ఘాన్ లో తాలిబన్లు ఒక కీలకమైన సైనిక, రాజకీయ శక్తి అనీ, రాబోయే రోజుల్లో ఆ దేశంలో శాంతి స్థాపన, పునర్ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించాల్సి ఉన్నదని అన్నారు. చైనా-తాలిబన్ల మధ్య చర్చలు గతంలోనూ జరిగాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో ఈ చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అమెరికా సైన్యాల ఉపసంహరణ హడావిడిగా జరగడాన్ని వ్యాంగ్ తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల ప్రతినిధి బృందం నాయకుడు బారాదార్ మాట్లాడుతూ.. ఆఫ్ఘానిస్థాన్లో శాంతి, పునర్ నిర్మాణం, ఆర్థిక అభివృద్ధికి చైనా సంపూర్ణంగా సహకరిస్తుందని ఆశిస్తున్నట్టు ప్రకటించారు.